బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన సినిమా ‘ఓం శాంతి ఓం’. ఈ సినిమా 2007 లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీకు ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. దీపికా పదుకోణ్ హీరోయిన్ గా చేసింది. అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రి పాత్రలో పాకిస్థానీ నటుడు జావేద్ షేక్ నటించారు. ఈ సినిమా వచ్చి దాదాపు 16 ఏళ్లు గడుస్తోంది. ఇన్నేళ్ల తర్వాత పాకిస్తాన్ నటుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సినిమా కోసం తన రెమ్యునరేషన్ విషయంలో జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం జావేద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కేవలం రూపాయి పారితోషికం అడిగాను: జావేద్ షేక్
‘ఓం శాంతి ఓం’ సినిమా తనకు ఓ మంచి అనుభవాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు జావేద్. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమాలో తనను షారుఖ్ ఖాన్ తండ్రి పాత్రలో తీసుకున్నారని అన్నారు. అయితే అప్పుడు తన వద్దకు వారి మేనేజర్ వచ్చాడని, ఒప్పందం పై సంతకం చేయాలని అడిగాడని చెప్పారు. తాను కూడా సరే అన్నానని, అయితే ‘‘మీకు రెమ్యునరేషన్ ఎంత?’’ అని మేనేజర్ అడిగాడన్నారు. కానీ తాను ఈ సినిమాకు డబ్బు తీసుకోనని చెప్పానన్నారు. ఎందుకంటే.. ఈ సినిమాలో నటించడం తనకు ఒక గౌరవం అని అన్నారు. ‘‘భారతదేశంలో ఎంతో మంది నటులున్నారు. వాళ్ళలో ఎవరినైనా తీసుకోవచ్చు. కానీ ఒక పాకిస్తానీ నటుడినైన నన్ను తీసుకోవడం చాలా గొప్ప విషయం’’ అని అన్నారు. అందుకే ఫరా ఖాన్, షారుఖ్ ఖాన్‌ల మీద అభిమానంతో తాను డబ్బు తీసుకోనని కేవలం ఒకే ఒక్క రూపాయి తీసుకుంటానని వాళ్ల మేనేజర్ తో చెప్పానన్నారు. అయితే తర్వాత వాళ్లు పంపిన మొదటి చెక్ చూసి షాకయ్యానని అప్పటి విషయాల్ని గుర్తు చేసుకున్నారు జావేద్.
జావేద్ పై విమర్శలు..
జావేద్ షేక్ ఇంటర్వ్యూ వీడియోను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది పాజిటివ్ గా స్పందిస్తే ఇంకొంత మంది నెగిటివ్ గా స్పందించారు. భారత నటీనటులను పొగిడినందుకు పాకిస్తాన్ కు చెందిన కొంతమంది నెటిజన్లు ఆయన్ను విమర్శించారు. ‘‘సినిమాలో నటించి పారితోషికం ఎందుకు వదిలేయాలి? ఇతరుల ముందు విలువ తగ్గించుకోవడం ఎందుకు’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘‘ఎవరూ ఉచితంగా పని చేయరు, మీ డబ్బు మీరు తీసుకోవాలి’’ అంటూ మరో వ్యక్తి స్పందించాడు. ‘‘ఇండియన్ నటుల గురించి తాను గొప్పగా చెప్పడం అవమానకరం’’ అంటూ ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా జావేద్ పై కొంతమంది నెటిజన్లు విమర్శలు గుప్పించారు. కొంత మంది మాత్రం ఆయన వ్యాఖ్యల్ని సమర్థించారు. ఇక ‘ఓం శాంతి ఓం’ 2007లో విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, శ్రేయాస్ తల్పాడే, కిరణ్ ఖేర్ కూడా నటించారు.
Also Read: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?