యావత్ భారత దేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రతి తెలుగోడు సగర్వంగా తలెత్తుకునే ఆ ఆనంద క్షణాలను చూస్తే.. తప్పకుండా కళ్ల నుంచి ఆనంద భాష్పాలు వచ్చేస్తాయ్. ఈ రోజు (సోమవారం) చాలామంది భారతీయుల పరిస్థితి ఇదే. ‘RRR’ సినిమాలోని ‘‘నాటు నాటు’’ పాటకు అవార్డు ప్రకటించగానే.. భారతీయుల కళ్లు చెమ్మగిల్లాయి. నోటి నుంచి మాట రావడం కష్టమైన భావోద్వేగ క్షణం అది. ఆ ఆనందాన్ని మాటలతో కాదు కేకలతో మాత్రమే వ్యక్తం చేయగలం. అందుకే, ‘‘నాటు నాటు’’ పాటకు ఆస్కార్ ప్రకటించగానే అంతా చిన్న పిల్లలైపోయారు. కేరింతలు కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆ అంతర్జాతీయ వేదికపై ‘ఆస్కార్’ వేడుకను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ‘సృష్టికర్త’ రాజమౌళితోపాటు ఎన్టీఆర్, రామ్ చరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్‌, వారి కుటుంబ సభ్యుల ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ‘‘నాటు నాటు’’కు అవార్డు ప్రకటించగానే ఎగిరి గంతేశారు. వారి ఆనందాన్ని అక్కడే కూర్చొని ఉన్న హాలీవుడ్ కళాకారులు కూడా పంచుకున్నారు. రాజమౌళి టీమ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఒకరికొకరు హగ్ ఇచ్చుకుని అభినందనలు తెలుపుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. 






‘బెస్ట్ ఒరిజనల్ సాంగ్’ కేటగిరిలో ‘‘నాటు నాటు’’కు అవార్డు


బెస్ట్ ఒరిజినల్ సాంగ్' (ఉత్తమ పాట) విభాగంలో 'నాటు నాటు'కు 95వ ది అకాడమీ అవార్డ్ అందుకుంది. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు పాటగా, ఆ మాటకు వస్తే తొలి భారతీయ సినిమా పాటగా 'నాటు నాటు...' చరిత్ర సృష్టించింది. మన దేశానికి వచ్చిన తొలి ఆస్కార్ అవార్డు ఇది. ఇప్పటి వరకు భారతీయులు అందుకున్న ఆస్కార్ అవార్డులు అన్నీ హాలీవుడ్ సినిమాలు వచ్చినవే. లెజెండరీ దర్శకుడు సత్యజిత్ రేకు గౌరవ ఆస్కార్ ఇచ్చారు. ఇంతకు ముందు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన 'జయహో' పాటకు ఆస్కార్ వచ్చింది. అయితే, అది ఇండియన్ సినిమాలో పాట కాదు. హాలీవుడ్ దర్శకుడు డానీ బోయల్ తెరకెక్కించిన ఇంగ్లీష్ సినిమా 'స్లమ్ డాగ్ మిలినియర్'లోది.






'నాటు నాటు...' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా... ఎంఎం కీరవాణి స్వరపరచిన గీతమిది. ఈ పాటలో ఎన్టీఆర్ లిరిక్స్ కీరవాణి తనయుడు కాల భైరవ పాడగా... రామ్ చరణ్ లిరిక్స్ రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆకట్టుకుంది. ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కూడా 'నాటు నాటు...' పాటకు అభిమాని. అమెరికాలో రాజమౌళిని కలిసిన ఆయన ఆ విషయం చెప్పడంతో 'దేవుడికి నాటు నాటు నచ్చింది' అని సంతోషం వ్యక్తం చేశారు. 


Also Read ఎన్టీఆర్ షేర్వాణీపై పులి బొమ్మ వెనుక సీక్రెట్ - 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్‌పై కామెంట్