Golden Globe Awards 2024: తాజాగా 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వేడుకలు జరిగాయి. ఇందులో అన్ని సినిమాలకంటే ఎక్కువ కేటగిరిల్లో అవార్డులు సాధించి విన్నర్‌గా నిలిచింది ‘ఓపెన్‌హైమర్‌’. ఈ సినిమాకు మొత్తం నాలుగు కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. దీనికి సరిసమానంగా ‘బార్బీ’ చిత్రం కూడా అవార్డుల విషయంలో పోటీ ఇచ్చింది. ఇక ‘ఓపెన్‌హైమర్‌’కు ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ డ్రామా నటుడు, ఉత్తమ సహాయ నటుడు కేటగిరిల్లో అవార్డులు దక్కాయి. ఒక బయోపిక్‌గా తెరకెక్కిన ‘ఓపెన్‌హైమర్‌’ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో సత్తా చాటడంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇండియా నుంచి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సారి మాత్రం ఇండియన్ మూవీస్‌కు చోటు దక్కలేదు.


రికార్డులు బ్రేక్ చేసిన ‘ఓపెన్‌హైమర్‌’..
క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించే సినిమాలకు హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఈ దర్శకుడు తెరకెక్కించే సినిమాలు అస్సలు అర్థం కావు అని కామెంట్ చేస్తూనే.. చాలామంది ప్రేక్షకులు ఈయన సినిమాలను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడడానికి పోటీపడుతుంటారు. ఇక చాలాకాలం తర్వాత ‘ఓపెన్‌హైమర్‌’తో ఆడియన్స్ ముందుకు వచ్చారు నోలాన్. సైంటిస్ట్ జె రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా హాలీవుడ్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. కలెక్షన్స్ విషయంలో కూడా రికార్డులను తిరగరాసింది. అదే సమయంలో ‘బార్బీ’ మూవీ విడుదలయినా కూడా నోలాన్ అభిమానులంతా కలిసి ‘ఓపెన్‌హైమర్‌’నే బ్లాక్‌బస్టర్ చేశారు.


న్యూక్లియర్ ఆయుధాల తయారీ..
‘ఓపెన్‌హైమర్‌’లో టైటిల్ పాత్రలో సిల్లియన్ మర్ఫీ నటించారు. జె రాబర్ట్ ఓపెన్‌హైమర్‌గా సిల్లియన్ నటన ప్రేక్షకుల ప్రశంసలను దక్కించుకుంది. అందుకే ఉత్తమ నటుడిగా సిల్లియన్ మార్ఫీకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలాన్‌ను కూడా అవార్డ్ వరించింది. దీంతో నోలాన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వరల్డ్ వార్ 2 సమయంలో న్యూక్లియర్ బాంబ్‌ను తయారు చేయడంలో సైంటిస్ట్ ఓపెన్‌హైమర్ ఎలాంటి రిస్కులు తీసుకున్నాడు అనేది ఈ సినిమాలో బాగా చూపించారు నోలాన్. అంతే కాకుండా న్యూక్లియర్ ఆయుధాలకు సంబంధించిన ప్రతీ సీన్‌ను ఒక విజువల్ వండర్‌లాగా ప్రేక్షకుల ముందు నిలబెట్టారు. 






‘అమెరికన్ ప్రొమెథ్యూస్’ అనే పుస్తకం ఆధారంగా..
2005లో కై బర్డ్, మార్టిన్ జె షెర్విన్ రచించిన ‘అమెరికన్ ప్రొమెథ్యూస్’ అనే పుస్తకం ఆధారంగా ‘ఓపెన్‌హైమర్‌’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాలో ఓపెన్‌హైమర్ ప్రొఫెషనల్ జీవితం గురించి మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా చూపించే ప్రయత్నం చేశారు క్రిస్టోఫర్ నోలాన్. చదువులో ఓపెన్‌హైమర్ ఎంత చురుగ్గా ఉండేవారు, వరల్డ్ వార్ 2 సమయంలో మ్యాన్‌హాటన్ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డారు, అంత గొప్ప సైంటిస్ట్‌గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు తన కెరీర్‌లో కిందపడిపోయారు అనే విషయాలను నోలాన్ స్క్రీన్‌పై చక్కగా ప్రజెంట్ చేశారు. ‘ఓపెన్‌హైమర్‌’ సినిమా చూసినవారంతా ఇది ఒక విజువల్ వండర్ అని సర్టిఫికెట్ ఇచ్చేశారు. కానీ అలాంటి కేటగిరిలో మాత్రం ‘ఓపెన్‌హైమర్‌’కు ఒక్క గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా దక్కలేదు.


Also Read: ఆస్కార్ లిస్ట్‌లో ఆ మూవీ - నా గుండె పగిలిపోయింది, అదంతా రాజకీయం: విజయ్ సేతుపతి