మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో  తెలుగుతో పాటు హిందీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. భారతీయ వాయుసేనలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  భారత వైమానిక దళానికి సంబంధించిన ధైర్య సాహసాలని ఈ చిత్రంలో కళ్లకుకట్టినట్లు చూపించబోతున్నారు. ఈ యాక్షన్ మూవీలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్‌గా కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. బుధవారం(సెప్టెంబర్ 13) నాడు ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలైనట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.


‘ఆపరేషన్ వాలెంటైన్’  చిత్రంతో వరుణ్ తేజ్ హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె  రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  


శరవేగంగా కొనసాగుతున్న పోస్టు ప్రొడక్షన్ పనులు


ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం,  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా వేగంగా కొనసాగుతోంది.  ప్రేక్షకులకు ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అత్యుత్తమ ఎక్స్‌ పీరియన్స్ అందించేలా గ్రాఫిక్స్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. భారత్ ఎన్న‌డూ చూడని ప్రత్యర్థుల  భయంకరమైన వైమానిక దాడుల స‌మ‌యంలో, ఎదురు నిలిచి పోరాడిన యుద్ధ వీరుల ధైర్యాన్ని, ఎదుర్కొన్న సవాళ్లను వెండితెరపై ఆవిష్కృతం చేయబోతున్నారు మేకర్స్.   


ఎయిర్ ఫోర్స్ డే రోజునే ప్రేక్షకుల ముందుకు ‘ఆపరేషన్ వాలెంటైన్’  


ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 8  ‘ఎయిర్ ఫోర్స్ డే’ నాడు విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను విడుదల చేశారు. తమ చిత్రం ఆరోజు విడుదలైతేనే వైమానిక వీరులను తలుచుకున్నట్లుగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారట. భారతీయులు తమ కోసం నిరంతరం కష్టపడుతున్న సైన్యం గొప్పదనం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారట.


మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్న వరుణ్- లావణ్య


ఓవైపు కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న వ‌రుణ్ తేజ్ త్వ‌ర‌లోనే త‌న ప్రియురాలు లావ‌ణ్య త్రిపాఠిని పెళ్లాడబోతున్నాడు. వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం జూన్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థానికి మెగాస్టార్, అల్లు కుంటుంబంతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఎప్పుడు అనేది మాత్రం బయటకు తెలియడం లేదు. ఇక వరుణ్ తేజ్, లావణ్య కలిసి 'మిస్టర్' సినిమాలో నటించారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తర్వాత ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చింది.


Read Also: బుల్లెట్ భాస్కర్‌ను అన్నయ్యా అని పిలిచిన హీరోయిన్ - అసలు విషయం తెలిసి షాకైన వేణు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial