పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 'ఓజీ' సినిమా ప్రీమియర్ షోలకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఓ రోజు ముందుగా సినిమా షోలు పడతాయి. సినిమా విడుదల తేదీ నుంచి పది రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది. ఏపీతో పోలిస్తే తక్కువే. మరి తెలంగాణలో ప్రీమియర్ షో టికెట్ రేట్ ఎంత? పది రోజుల పాటు టికెట్ రేటు మీద ఎంత అమౌంట్ పెరుగుతుంది? అనే వివరాల్లోకి వెళితే...
తెలంగాణలో బెనిఫిట్ షో టికెట్ 800...
ఏపీతో పోలిస్తే 200 రూపాయలు తక్కువ!
ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 24వ తేదీన ప్రీమియర్ షో ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదు. కానీ 24 ముగిసిన తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకు అంటే 25వ తేదీ తెల్లవారుజామున బెనిఫిట్ షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. జీఎస్టీతో కలిపి టికెట్ రేటును 1000 రూపాయలుగా నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వం 'ఓజీ' ప్రీమియర్ షో టికెట్ రేట్ జీఎస్టీతో కలిపి 800గా ఫిక్స్ చేసింది. అయితే అర్ధరాత్రి బెనిఫిట్ షో కాకుండా ముందు రోజు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ప్రీమియర్ షోలు పడే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి కొత్త జీవో తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది.
తెలంగాణలో టికెట్ రేట్లు ఎంత పెరిగాయ్?
ఏపీ ప్రభుత్వం 10 రోజుల పాటు ప్రస్తుతం ఉన్న టికెట్ రేటు మీద సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 125 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 150 రూపాయలు అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 150 రూపాయలు టికెట్ రేట్ మీద అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో టికెట్ రేట్లు ఎక్కువ. అందువల్ల పాతిక రూపాయలు తక్కువ పెంచినప్పటికీ సింగిల్ స్క్రీన్లలో సేమ్ టికెట్ రేట్ ఉండే అవకాశం ఉంది. మల్టీప్లెక్స్‌లను బట్టి మారతాయి. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు రెండు తెలుగు ప్రభుత్వాలు టికెట్ రేట్ హైక్ జీవో జారీ చేశాయి.
ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ రేట్లు పెంచుతూ జీవోలు జారీ చేయడంతో త్వరలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేయడానికి డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ సన్నాహాలు మొదలు పెట్టింది. ట్రైలర్ విడుదల కంటే ముందుగా టికెట్లు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ అమెరికాలో 'ఓజీ' సినిమా కలెక్షన్స్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. అక్కడ రెండు మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన వెంటనే రికార్డుల దిశగా సినిమా ప్రయాణం సాగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: భద్రకాళి రివ్యూ: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్... విజయ్ ఆంటోనీ సినిమా హిట్టా? ఫట్టా!?