Daksha 2025 Movie Review - దక్ష రివ్యూ: సన్నాఫ్ ఇండియా దర్శకుడి కథ... మోహన్ బాబు - లక్ష్మీ మంచు సినిమా ఎలా ఉందంటే?

Daksha The Deadly Conspiracy Review Telugu: లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో నటించిన సినిమా దక్ష. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ సినిమా ఎలా ఉందంటే?

Continues below advertisement

Manchu Lakshmi’s Daksha Movie Review In Telugu: లక్ష్మీ మంచు వెర్సటైల్ ఆర్టిస్ట్. ఎటువంటి పాత్రలోనైనా తనదైన శైలిలో నటించగలరు. ఆవిడ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా 'దక్ష: ద డెడ్లీ కాన్స్పిరసీ'. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) ప్రత్యేక పాత్ర పోషించారు. యువ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, సముద్రఖని, 'రంగస్థలం' మహేష్, మలయాళ నటుడు సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహించారు. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు నిర్మించాయి. ఇది క్లినికల్ ట్రయల్స్ నేపథ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోండి.

Continues below advertisement

కథ (Daksha The Deadly Conspiracy Story): హైదరాబాద్ సిటీలోని ఒక కంటైనర్ యార్డులో సామాన్య వ్యక్తి అనుమానాస్పదంగా మరణిస్తాడు. ఆ కేసును సీఐ దక్ష (లక్ష్మీ మంచు) ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. ఆ తర్వాత అమెరికా నుండి వచ్చిన ఒక ఫార్మా కంపెనీ ప్రతినిధి మరణిస్తాడు. రెండు కేసుల్లో క్లూస్ ఒకే విధంగా ఉంటాయి. ఒక విధమైన గ్యాస్ విడుదల చేయడం ద్వారా హత్యలకు పాల్పడతారు.

దక్ష మీద డాక్యుమెంటరీ తీయాలని ప్రయత్నిస్తున్న జర్నలిస్ట్ సురేష్ (జెమినీ సురేష్) ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. అతను సేకరించిన సమాచారంలో నమ్మశక్యం కాని ఓ నిజం వెలుగులోకి వస్తుంది. ఇన్విస్టిగేషన్ నుంచి దక్షను తప్పించి అప్పటి వరకు ఆ కేసుల్లో ఫారెన్సిక్ డిపార్టుమెంటులో పని చేసే విక్రమ్ (విశ్వంత్ దుద్దుంపూడి)కి కేసును అప్పగిస్తారు కమిషనర్ (సముద్రఖని).

హత్యలకు పాల్పడింది ఎవరు? దక్ష, మిథిలా (చిత్రా శుక్లా) మధ్య సంబంధం ఏమిటి? ఈ కేసులో పోలీసులకు సైక్రియాట్రిస్ట్ విశ్వామిత్ర (మోహన్ బాబు) ఎటువంటి సాయం చేశారు? చివరకు హత్యలు ఎవరు చేశారో తేలిందా? లేదా? అనేది మిగతా సినిమా.

విశ్లేషణ (Daksha 2025 Review In Telugu): దక్ష చిత్రానికి కథ అందించినది సన్నాఫ్ ఇండియా దర్శకుడు డైమండ్ రత్నబాబు. ప్రకృతి వైద్యం (ఆయుర్వేదం), మెడికల్ మాఫియా (క్లినికల్ ట్రయల్స్), పోలీస్ ఇన్వెస్టిగేషన్, కాస్మోటిక్ సర్జరీ... ఒక్క కథలో చాలా అంశాలు చెప్పాలని ట్రై చేశారు. కాదు కాదు… చెప్పారు కూడా! కానీ ఒక్కటంటే ఒక్క అంశానికి కూడా ఆయన న్యాయం చేయలేదు. కథలో ఎన్ని ఎక్కువ పాయింట్స్ యాడ్ చేస్తే అన్ని ఎక్కువ ట్విస్టులు వస్తాయని భావించినట్టు అనిపిస్తుంది. అయితే ఒక్క ట్విస్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. ఆసక్తికరమైన కొత్త కథ చెప్పే ప్రయత్నం చేయలేదు.

లక్ష్మీ మంచు, మోహన్ బాబు... తండ్రీ కుమార్తెల కాంబినేషన్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది. పైగా క్లినికల్ థ్రిల్లర్ అనేసరికి ఇంకొంచెం ఆసక్తి పెరిగింది. అయితే ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రారంభం నుంచి విశ్రాంతి వరకు కథ కొంచెం కూడా ముందుకు కదల్లేదు. టైటిల్ కార్డ్స్ పడటానికి ముందు వచ్చే సీన్ చూస్తే హత్యలు ఎవరు చేస్తున్నారో ప్రేక్షకులకు సులభంగా అర్థం అవుతుంది. కానీ ఆ విషయం తెరపైకి రావడానికి విశ్రాంతి వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ప్రేక్షకులది. 'డైమండ్' రత్నబాబు అందించిన కథలో ఆసక్తి లేదంటే దర్శకుడు వంశీకృష్ణ మల్లా అంతకు మించి అనాసక్తి కలిగించేలా తెరకెక్కించారు.

స్క్రీన్ మీద ఆర్టిస్టులు చేసే మేజిక్ మీద దర్శక రచయితలు ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు తప్ప కథ, కథనాల్లో పట్టు ఉండేలా చూసుకోలేదు. లాజిక్స్ కొంచెం కూడా చూసుకోలేదు. యూఎస్ కాన్సులేట్ బయట సీఐ మీద గూండాలు ఎటాక్ చేస్తారు. అక్కడ సెక్యూరిటీ లేదేంటి? అనే క్వశ్చన్ మైండ్‌లోకి రాకూడదు. ఒక మర్డర్ జరిగిన చోట ఎవరు చంపారు? అని పోలీసులు వాళ్ళను ప్రశ్నిస్తారు. కానీ అసలు వాళ్ళు ఎవరు? మర్డర్ జరిగిన సమయంలో అక్కడ ఎందుకు ఉన్నారు? ఏం చేస్తున్నారు? వంటి ప్రశ్నలు ఎందుకు అడగలేదని ఆలోచించకూడదు. కోర్టు బయట పోలీసులను కొట్టి వాళ్ళ జీపులో కట్టి పడేసి, మిగతా పోలీసుల కళ్ళు గప్పి రెండు హత్యలు జరిగిన కేసులో దోషిని రౌడీలు తమ కారులో ఎక్కించుకుని వెళతారు. చివరకు ఆ కారు, దోషి ఆచూకీ పోలీసులు కనుకొంటారు. కానీ, అసలు వచ్చింది ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటున్న దోషి మీద ఎందుకు దాడి చేశారు? అనేది పట్టించుకోరు. ఫ్లాష్ బ్యాక్ అయితే రవితేజ 'బెంగాల్ టైగర్'ను గుర్తు చేస్తుంది. ఆ కథకు మరొక వెర్షన్ అన్నట్టు ఉంటుంది. ఇంకొక ట్విస్ట్ 'ఎవడు'ను గుర్తు చేస్తుంది. మేజిక్స్‌ వర్కవుట్ అయితే లాజిక్స్‌ ఎవరూ పట్టించుకోరు. మేజిక్ జరగలేదు కాబట్టే ఇదంతా!

Also Read: భద్రకాళి రివ్యూ: పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్... విజయ్ ఆంటోనీ సినిమా హిట్టా? ఫట్టా!?

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో నిర్మాణ విలువలు కథకు తగ్గ స్థాయిలో ఉన్నాయి. దర్శక రచయితల వైఫల్యం అడుగడుగునా, ప్రతి సన్నివేశంలో కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాలి. అచ్చు రాజమణి స్థాయికి తగ్గట్టు నేపథ్య సంగీతం లేదు. ఎండింగ్ తర్వాత వచ్చే సాంగ్ బావుంది. లక్ష్మీ మంచుకు 'డ్రాగన్' ప్రకాష్ కంపోజ్ చేసిన యాక్షన్ కొరియోగ్రఫీ బావుంది.

పోలీసుగా నటనలో ఫైర్ చూపించారు లక్ష్మీ మంచు. డేరింగ్ అండ్ డాషింగ్ ఆఫీసర్ తరహాలో డ్రెసింగ్ బావుంది. కానీ, తెలంగాణ యాసలో మాటలు అంతగా సెట్ కాలేదు. మోహన్ బాబు నాలుగైదు సన్నివేశాల్లో మాత్రమే కనిపించారు. తండ్రీ కుమార్తెల కాంబినేషన్‌కు తగ్గ సన్నివేశాలు గానీ, సంభాషణలు గానీ 'దక్ష'లో లేవు. విశ్వంత్ దుద్దుంపూడి, సముద్రఖని ఆయా పాత్రలకు తగ్గట్టు నటించారు. సిద్ధిఖీ నటన కంటే ఆయనకు ప్రియదర్శిని రామ్ చెప్పిన డబ్బింగ్ హైలైట్ అయ్యింది. 'రంగస్థలం' మహేష్ ఉన్నా కామెడీ లేదు.    

లక్ష్మీ మంచు, మోహన్ బాబు కాంబినేషన్ క్రేజ్‌ను అసలు కొంచెం కూడా మ్యాచ్ చేయలేదీ 'దక్ష'. లక్ష్మీ మంచు నటన బావుంది. కానీ స్టార్టింగ్ టు ఎండింగ్ అసలు ఏమాత్రం ఆసక్తి లేకుండా సాగిన సినిమా 'దక్ష: ద డెడ్లీ కాన్స్పిరసీ'. కథ - కథనాల్లో ఎన్నో మలుపులు తిప్పాలని ట్రై చేసి ఒక్క ట్విస్ట్ కూడా వర్కవుట్ చేయకుండా ఒక్క హై మూమెంట్ ఇవ్వకుండా శుభం కార్డు వేశారు దర్శక రచయితలు. స్కిప్ చేయడం మంచిది.

Also Read'మిరాయ్' రివ్యూ: క్లైమాక్స్‌లో శ్రీరాముడు వచ్చాడు... తేజా సజ్జా - మంచు మనోజ్ మూవీ హిట్టేనా?

Continues below advertisement
Sponsored Links by Taboola