చరిత్ర సృష్టించేవారు కొందరు ఉంటారు. చరిత్ర సృష్టించడమే కాదు... భవిష్యత్ భావి తరాలకు మార్గదర్శిగా నిలిచే వ్యక్తులు, చరిత్రలో చిరస్థాయిగా తమ పేరును లిఖించే మహానుభావులు అరుదుగా ఉంటారు. అటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) అని నట కిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు. 


శకపురుషుడు, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి కీర్తి పతాకాన్ని ఖండాంతరాలు దాటి ఎగిరేలా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు. మే 28న ఆయన జయంతి. ఈ ఏడాది ఆయన జయంతి మరింత ప్రత్యేకం. ఎందుకు? అంటే... శత జయంతి కనుక!


ఎన్టీఆర్ శత జయంతి వేడుకల (NTR centenary celebrations)ను ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి ముగిసింది. కానీ, జయంతి వేడుకలు ముగింపు లేదు. కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్టీఆర్ అంతర్జాతీయ క్యారికేచర్, కవితల పోటీలు జరిగాయి. అందులో విజేతలకు నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు. 


రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు...
రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీ రామారావు (NT Rama Rao) సొంతం అని, ఈ రోజున దేశ వ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు బీజం వేసిన ప్రజా నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 


విజేతలకు చెరొక లక్ష...
క్యారికేచర్, కవితలు... రెండు విభాగాల్లో కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఒక్కో విభాగంలో ప్రథమ స్థానంలో విజేతగా నిలిచిన ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున అందజేశారు. మిగతా విజేతలకు సుమారు అయిదు లక్షల రూపాయల నగదు బహుమతులు అందించారు. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి, విశ్రాంత హోమ్ సెక్రటరీ కె. పద్మ నాభయ్య, ఆదాయ పన్ను కమిషనర్ జీవన్ లాల్ లవాడియ, గజల్ శ్రీనివాస్, బృహస్పతి టెక్నాలజీస్ ఎండీ రాజశేఖర్, సి.ఎస్.బి ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ బాల లత ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తులకు 'కలయిక ఫౌండేషన్' అధినేత చేరాల నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. మంచి కార్యక్రమం చేశారని ఆయన్ను అతిథులు ప్రశంసించారు.


Also Read : మీ కడుపు మంటకు ఫ్రీగా మజ్జిగ ఇస్తా - రూమర్స్, ట్రోలర్స్‌కు తమన్ దిమ్మతిరిగే రిప్లై


హైదరాబాద్ సిటీలో 200 వేడుకలు!
ఎన్టీఆర్ జయంతికి కొన్ని రోజుల ముందు హైదరాబాద్ సిటీలో ఆయన వారసులు, నందమూరి కుటుంబ సభ్యులు భారీ సభ నిర్వహించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించారు. దగ్గుబాటి వెంకటేష్, రామ్ చరణ్, అక్కినేని నాగ చైతన్య, సుమంత్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆ వేడుకకు హాజరయ్యారు. హీరోలతో పాటు ఎన్టీ రామారావుతో పని చేసిన దర్శక, నిర్మాతలను ఘనంగా సత్కరించారు. ఆ కార్యక్రమానికి అభిమానులు వేలాది సంఖ్యలో విచ్చేశారు. అంగ రంగ వైభాగంగా ఆ వేడుక జరిగింది. అది కాకుండా ఒక్క హైదరాబాద్ సిటీలో 200ల వరకు వేడుకలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని వందలు జరిగాయని తెలిసింది. 


Also Read రామ్ చరణ్‌ ఇంట మాత్రమే కాదు, ఈ స్టార్ హీరోల ఇంట్లోనూ మొదటి సంతానం అమ్మాయే