ఘట్టమనేని అల్లుడిగా, సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నైట్రో స్టార్ సుధీర్ బాబు.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి బాగా కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ వస్తున్నాడు. అయితే ఇటీవల కాలంలో ఆశించిన విజయాలు అందుకోలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని 'మామా మశ్చీంద్ర' అనే మరో డిఫరెంట్ సబ్జెక్ట్‌ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. 


సుధీర్ బాబు కెరీర్ లో 15వ చిత్రం 'మామా మశ్చీంద్ర'. ఇందులో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఎన్నో చిత్రాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా మెప్పించిన హర్షవర్ధన్ ఈ స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన స్పెషల్ పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, టీజర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే చాలా రోజులుగా సరైన విడుదల తేదీ కోసం వేచి చూస్తున్న మేకర్స్.. ఎట్టకేలకు డేట్ ఫిక్స్ చేసారు. ఈ చిత్రాన్ని 2023 అక్టోబర్ 6న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. 


ఈ సందర్భంగా సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ.. ''ట్రిపుల్ ఫన్, ట్రిపుల్ ఎమోషన్స్, ట్రిపుల్ డ్రామా & ట్రిపుల్ యాక్షన్ కోసం సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 6 నుంచి అన్నీ జరుగనున్నాయి. 'మామా మశ్చీంద్ర' ఒక విలక్షణమైన స్పెషల్ ఎంటర్‌టైనర్. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని థియేటర్‌లలో చూసి ఇష్టపడతారు'' అని పేర్కొన్నారు. ఈ క్రమంలో మూడు పాత్రలతో డిజైన్ చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే అక్టోబర్ 6న సుధీర్ బాబు సినిమాకు పోటీగా సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న 'టిల్లు స్క్వేర్' మూవీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 






Also Read: YSR - CBN Web Series: మళ్ళీ వార్తల్లోకి వైఎస్సార్ - చంద్రబాబు సిరీస్!


'మామా మశ్చీంద్ర' సినిమాలో పరశురామ్ అనే మిడిల్ ఏజ్ డాన్ గా, దుర్గ అనే స్థూలకాయుడిగా, DJ అనే యువకుడిగా మూడు పాత్రల్లో సుధీర్ బాబు కనిపించనున్నారు. మూడు పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకూ సిక్స్ ప్యాక్ బాడీతో మ్యాచో మ్యాన్ గా కనిపించే సుధీర్.. ఒక్కసారిగా లడ్డూ బాబులా, ఉబకాయుడులా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ సినిమాలో మృణాళిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించారు.


నారాయణదాస్ నారంగ్ & సృష్టి సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న 'మామా మశ్చీంద్ర' చిత్ర బృంద రానున్న రోజుల్లో దూకుడుగా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే సుధీర్ బాబు ప్రస్తుతం 'హరోం హర' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. 'సెహరి' ఫేమ్‌ జ్ఞానసాగర్‌ ద్వారక ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలానే 'లూజర్' ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో 'మా నాన్న సూపర్ హీరో' అనే సినిమాలో సుధీర్ హీరోగా నటిస్తున్నారు.


Also Read: 'ఫ్యాన్స్‌నే కాదు డిస్ట్రిబ్యూటర్స్‌ని కూడా ఆదుకోండి'.. విజయ్‌ దేవరకొండని ఉద్దేశిస్తూ నిర్మాత షాకింగ్ ట్వీట్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial