Nidhhi Agerwal Interview On Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' ఈ నెల 24న విడుదలవుతోంది. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్. 'సవ్యసాచి'తో ఆ అమ్మాయి తెలుగు తెరకు పరిచయమైంది. 'ఇస్మార్ట్ శంకర్'తో హిట్ అందుకుంది. 'మిస్టర్ మజ్ను', 'హీరో' సినిమాల్లోనూ నటించింది. అయితే... వరుస సినిమాలు చేయకుండా గ్యాప్ రావడానికి కారణం... 'హరి హర వీరమల్లు' విడుదల అయ్యే వరకు మరో సినిమా చేయనని అగ్రిమెంట్ రాయడమే. ఇప్పుడు వీరమల్లు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆ సినిమా, నెక్స్ట్ ప్రాజెక్ట్స్, కెరీర్ ప్లాన్ గురించి నిధి అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు...
- వీరమల్లు సినిమాలో నేను పంచమి పాత్ర పోషించాను. ఆ క్యారెక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. పంచమి పాత్ర నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను ధరించిన నగలు అన్నీ ఒరిజినల్. ఆల్మోస్ట్ కొట్టిన్నర ఖరీదు చేసేవి. వాటిని కనిపెట్టుకుని ఉండటం కోసం చిత్రీకరణలో ఎప్పుడూ ఒక మనిషి ఉండేవారు.
- పవన్ కళ్యాణ్ గారితో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలతో పాటు ఇతర అంశాలపై ఆయనకు అపారమైన నాలెడ్జ్ ఉంది. చాలాసార్లు ఆయన నాలెడ్జ్ చూసి షాకయ్యా. కొంత మంది పోయెట్స్ గురించి ఆయన డిస్కస్ చేస్తుంటే ఆశ్చర్యపోయేదాన్ని. నాకు వాళ్ళ గురించి అసలు అవగాహన ఉండేది కాదు. ఆయన జెంటిల్ మ్యాన్.
- 'కొల్లగొట్టినాదిరో...' పాట ఉంది కదా! పవన్ కళ్యాణ్ గారితో నా ఫస్ట్ డే షూటింగ్ చేసినది ఆ పాటే. భారీ సెట్స్ వేయడంతో పాటు సహజత్వానికి దగ్గరగా ఆ పాట తీశారు. పవన్ గారితో నటించడం బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఆయనతో ఒక్క సినిమా చేయడం వంద సినిమాలు చేస్తే వచ్చే అనుభవంతో సమానం.
- 'హరి హర వీరమల్లు'లో పవన్... 'ది రాజా సాబ్'లో ప్రభాస్... ఇద్దరితో ఒకేసారి నటిస్తానని కలలోనూ ఊహించలేదు. అంతే పెద్ద స్టార్ అయితే అంత వినయంగా ఉంటారని అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారి కళ్లు చాలా పవర్ ఫుల్. ఆయన నడిచి వస్తుంటే ఒక ఆరా క్రియేట్ అవుతుంది. పాత్రలోకి ఆయన వెంటనే షిఫ్ట్ అవుతారు. ప్రభాస్ నైస్ పర్సన్. 'రాజా సాబ్' సినిమాలో ఆయన చాలా ఓపెన్ అయ్యారు. చాలా ఎక్కువ డైలాగులు చెప్పారు.
- వీరమల్లు సినిమా కోసం నేను ఐదేళ్లు వెయిట్ చేశా. ఈ మధ్యలో చాలా మంది నాకు ఫోనులు చేసి 'మీ సినిమా జరగడం లేదంట కదా! ఆగిపోయిందని విన్నాను' అని చెప్పేవాళ్ళు. అటువంటి మాటలు విన్నప్పుడు నా గుండె బద్దలయ్యేది. ఇప్పుడు సినిమా విడుదల అవుతోంది. నేను హ్యాపీ. విడుదల తర్వాత ప్రేక్షకులు సినిమా, అలాగే అందులో నా క్యారెక్టర్ గురించి ఏం చెబుతారోనని వెయిట్ చేస్తున్నాను.
- వీరమల్లు ట్రైలర్ విడుదల ముందు వరకు సినిమాపై ప్రేక్షకులలో రకరకాల అభిప్రాయాలు ఉండేవి. ముఖ్యంగా సినిమా తీయడానికి ఐదేళ్లు పట్టడం కూడా అందుకు ఓ కారణం. సినిమా ఓల్డ్ అయిపోయిందని అనుకున్నారు. ఇది హిస్టారికల్ ఫిల్మ్. ఎప్పటికీ ఓల్డ్ అవ్వదు. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ప్రేక్షకుల అభిప్రాయం మారింది. ఐదేళ్ళలో నిర్మాత ఏయం రత్నం, నేను ఎంతో కష్టపడ్డాం. మా ఇద్దరికీ ఈ సినిమా సక్సెస్ ఇస్తుందని నమ్ముతున్నా.
- వీరమల్లు కోసం ఐదేళ్లు వెయిట్ చేసినా ఫైనాన్షియల్ పరంగా నేను ఎప్పుడూ స్ట్రగుల్ అవ్వలేదు. నెలకు కనీసం ఒక షాప్ ఓపెనింగ్ అయినా వచ్చేది. ఆ డబ్బు సరిపోయేది. వీరమల్లు పూర్తయ్యే వరకు మరో సినిమా చేయనని అగ్రిమెంట్ మీద సంతకం చేసినట్టు ఇంకోసారి మరో సినిమాకు చేయను. వీరమల్లు సెకండ్ పార్ట్ కోసం కూడా! కథ కంటిన్యూ అవుతుంది కనుక 'వీరమల్లు 2'లోనూ నేను ఉంటానని ఆశిస్తున్నాను.