లేడీ సూపర్ స్టార్ నయనతార 'జవాన్' మూవీతో బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కు జోడీగా నటించింది. ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. హీరోయిన్ గా నటించిన నయన్ హిందీ డెబ్యూతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకి రివ్యూ ఇచ్చి, ఆమె పర్ఫార్మెన్స్ ను కొనియాడిన సినీ ప్రముఖుల్లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నారు. బన్నీ రివ్వూకి నయనతార తాజాగా స్పందించింది.


'జవాన్' చిత్రాన్ని చూసిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అల్లు అర్జున్ ట్విట్టర్ X వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినందుకు ముందుగా 'జవాన్' చిత్ర బృందానికి శుభా కాంక్షలు. ఇది ఎప్పుడూ చూడని షారూక్ ఖాన్ గారి మాస్ అవతార్. ఆయన స్వాగ్ తో ఇండియానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఉర్రూతలూగించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది సార్, మేము దీని కోసమో ప్రార్థించాము"


"విజయ్ సేతుపతి గారు ఎప్పటిలాగే తన పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. దీపికా పదుకొణె ప్రభావవంతమైన స్టార్. నయనతార జాతీయ స్థాయిలో ప్రకాశవంతంగా మెరిసింది. అనిరుధ్ మీరు దేశంలోని ప్రతి ఒక్కరినీ మీ సంగీతం వైపు తిప్పుకున్నారు. మనందరినీ గర్వపడేలా చేసినందుకు, ఆలోచింపజేసే కమర్షియల్ సినిమాని అందించినందుకు, భారతీయ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించినందుకు డైరెక్టర్ అట్లీ గారికి బిగ్ బిగ్ కంగ్రాట్స్." అంటూ అల్లు అర్జున్ పేరుపేరునా అందరినీ అభినందించారు.


Also Read: Samantha: బాలీవుడ్ ఎంట్రీకి సామ్ సిద్ధం, ఆ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన సమంత?


బన్నీ ప్రశంసలకు 'జవాన్' హీరోయిన్ నయనతార ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ ను స్టోరీగా పెడుతూ, "సో స్వీట్ ఆఫ్ యు అల్లు అర్జున్" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం నయన్ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకుముందు షారూఖ్ ఖాన్ సైతం స్టైలిష్ స్టార్ ట్వీట్ కి స్పందిస్తూ, తాను 'పుష్ప' చిత్రాన్ని మూడు రోజుల్లో మూడు సార్లు చూసినట్లు తెలిపారు.


"థాంక్యూ సో మచ్ మై మ్యాన్. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ఎంతో సంతోషంగా ఉంది. స్వాగ్ విషయానికి వస్తే ఫైరే నన్ను పొగుడుతోంది. వావ్.. చాలా సంతోషంగా ఉంది. ఈ ట్వీట్‌ తో 'జవాన్‌' విజయం రెట్టింపు అయిందనే అనుభూతి చెందుతున్నాను. 'పుష్ప' సినిమాను మూడు రోజుల్లో మూడు సార్లు చూశాను కాబట్టి నేను మీ నుండి ఏదో నేర్చుకున్నానని తప్పక ఒప్పుకుంటాను. వీలైనంత త్వరగా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుసుకొని బిగ్ హగ్ ఇస్తాను. లవ్ యూ" అని షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు నయనతార కూడా బన్నీ ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపింది.


నిజానికి 'జవాన్' మూవీలో అల్లు అర్జున్ క్యామియో ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అట్లీ ఈ విషయం మీద బన్నీని కలిసినట్లుగా చెప్పుకున్నారు. కానీ ఈ కలయిక వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా కోసం అని ఈ మధ్యే క్లారిటీ వచ్చింది. దర్శక హీరోల మధ్య ఇప్పటికే చర్చలు జరిగింది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చేస్తున్న అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్, సందీప్ రెడ్డి వంగాలతో సినిమాలు చేయనున్నారు. ఇదే క్రమంలో అట్లీతో జట్టు కడతారేమో వేచి చూడాలి.


Also Read: కల్కి 2898 AD లీక్ - నష్టపరిహారం కోసం VFX కంపెనీపై కేసు నమోదు చేసిన మేకర్స్?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial