ఇటీవల కాలంలో ఫిలిం మేకర్స్ కు లీకుల బెడద బాగా ఎక్కువైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదొక విధంగా కంటెంట్ ఆన్ లైన్ వేదికగా బయటకి వస్తూనే ఉంది. షూటింగులు జరుపుకుంటున్న లొకేషన్స్ నుంచి ఫోటోలు వీడియోలు లీక్ అవుతుండటం.. హీరోల లుక్స్, కీలక సన్నివేశాలు, పాటలు వంటివి ముందే బయటకు రావడం దర్శక నిర్మాతలకు ఇబ్బందిగా మారుతోంది.
ఈ మధ్య ఎడిటింగ్ రూమ్ నుంచి, విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్న స్టూడియోల నుంచి కూడా ఈ లీకులు వస్తున్నాయి. తమ ఫేవరేట్ హీరోల సినిమాల విషయాలు లీక్ అయినప్పుడు, వారి అభిమానులు ఎగ్జైట్ మెంట్ తో సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు. ఇదంతా మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అందుకే డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారు.
రెండు రోజుల క్రితం 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ఒక పాట లీకైన సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతలు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీకు రాయుళ్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఇప్పుడు 'కల్కి 2898 AD' మేకర్స్ కూడా లీకుల వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Pushpak Re-release: కమల్ హాసన్ కల్ట్ క్లాసిక్ మూవీ రీ-రిలీజ్‌కు రెడీ!
కొన్ని రోజుల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898 AD' సినిమా సీన్స్ లీకై ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పటి నుండి అన్నీ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్న మేకర్స్.. ఈ లీకులతో షాక్ కు గురయ్యారు. ఇది విఎఫ్ఎక్స్ కంపెనీ నుంచే బయటకి వచ్చినట్లు చిత్ర యూనిట్ గుర్తించిందని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు 'ప్రాజెక్ట్ K' పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బాధ్యతలను అప్పగించిన VFX కంపెనీపై మేకర్స్ ఇప్పుడు దావా వేయడానికి రెడీ అయ్యారట. ఈ లీకేజీకి కారణమైన ఉద్యోగిని ఇప్పటికే తొలగించినప్పటికీ, నిర్మాతలు ఆ కంపెనీపైనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' చిత్రం తెరకెక్కుతోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా 2024 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Samantha: బాలీవుడ్ ఎంట్రీకి సామ్ సిద్ధం, ఆ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన సమంత?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial