ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తున్న తరుణంలో.. గతంలో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన చిత్రాలను మరోమారు థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో ఐకానిక్ మూవీ రీరిలీజ్ కు అధికారిక ప్రకటన వచ్చింది. విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'పుష్పక విమానం' సినిమాని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ శనివారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.
ఇంతకముందు కమల్ హాసన్ నటించిన 'వేట్టయ్యాడు విలయ్యాడు' సినిమాని రీ-రిలీజ్ చేసిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) సంస్థ.. ఇప్పుడు 'పుష్పక్' మూవీని మళ్ళీ థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. "పుష్పక్ లేదా పేసుంపదం సినిమా సైలెంట్ బ్లాక్ కామెడీలో అగ్రగామిగా నిలుస్తుంది. ఇది ఇండియన్ సినిమా యొక్క ఐకానిక్ మాస్టర్ పీస్, త్వరలో థియేటర్లలో తిరిగి విడుదల చేస్తాం" అని పేర్కొంటూ ఓ పోస్టర్ ను ఆవిష్కరించారు.
దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన ప్రయోగాత్మక చిత్రం 'పుష్పక విమానం'. 1987లో వచ్చిన ఈ బ్లాక్ కామెడీ చిత్రం మంచి విజయం సాధించింది. ఎన్ని కోరికలు తీరినా మనిషి ఇంకా ఏదో కావాలని తపిస్తుంటాడు అనే పాయింట్ తో ఈ సినిమా తీశారు. ఇందులో అమల అక్కినేని హీరోయిన్ గా నటించగా.. సమీర్ ఖాఖర్, టినూ ఆనంద్, పీఎల్ నారాయణ, ఫరీదా జలాల్, ప్రతాప్ పోతన్, లోకనాథ్, రమ్య ఇతర కీలక పాత్రలు పోషించారు.
Also Read: '7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ - మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
సాధారణంగా సినిమాలో మూడు మంచి పాటలు, నాలుగు మంచి డైలాగ్స్ లేకపోతే బోర్‌గా ఫీలవుతుంటాం. అలాంటిది ఒక్క డైలాగ్ కూడా లేకుండా సినిమా తీసి, రెండు గంటల పాటు జనాలను థియేటర్లో కూర్చో బెట్టడం అంటే మామూలు విషయం కాదు. అలా ఎలాంటి మాటలు లేకుండా సింగీతం తెరకెక్కించిన మూకీ మూవీ 'పుష్పక విమానం'. ఈ చిత్రంలో ఎవరూ మాట్లాడరు కానీ, కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారంటే ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
'పుష్పక విమానం' కథంతా ఒక నిరుద్యోగ గ్రాడ్యుయేట్ చుట్టూ తిరుగుతుంది. దురాశావాది అయిన అతనికి అనుకోకుండా ఓ ధనవంతుడు తారసపడతాడు. డబ్బున్న వాడిగా పుష్పక్ అనే ఫైవ్ స్టార్ హోటల్ లో మకాం వేస్తాడు. శ్రీమంతుడిగా చలామణీ అవుతూ, ఓ యువతితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనలతో జీవితంలో డబ్బు కన్నా విలువైనది సంతృప్తి అని హీరో గ్రహించడంతో ఈ సినిమా కథ ముగుస్తుంది.
ఈ చిత్రాన్ని తమిళ్ లో 'పేసుంపదం' పేరుతో, హిందీలో 'పుష్పక్' అని.. తెలుగు కన్నడ భాషల్లో 'పుష్పక విమానం' అనే టైటిల్ తో రిలీజ్ చేసారు. తక్కువ బడ్జెట్ లో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అలాంటి మాస్టర్ పీస్ దాదాపు 36 ఏళ్ళ తర్వాత ఈ జెనెరేషన్ ఆడియన్స్ ను అలరించడానికి మళ్ళీ థియేటర్లలోకి రాబోతోంది. మేకర్స్ త్వరలోనే రీరిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
Also Read: రాజమౌళి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కాపీ మాస్టర్ - బాలీవుడ్ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial