భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి ఒకరు. వెండితెరపై విజువల్ వండర్స్ క్రియేట్ చేసిన దర్శక ధీరుడాయన. భాషా ప్రాంతీయత అడ్డంకులు తొలగించి సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకే తాటి మీదకు తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడమే కాదు, ఇండియన్ సినిమాకు ఆస్కార్ కలను సాకారం చేసిపెట్టాడు. అలాంటి అగ్ర దర్శకుడిపై బాలీవుడ్ కు చెందిన కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసాడు. రాజమౌళి ఒక పర్ఫెక్ట్ కాపీ మాస్టర్ అని ట్వీట్ చేసాడు.
కమల్ ఆర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనకు తానే ఫిలిం క్రిటిక్ గా ట్రేడ్ అనలిస్ట్ గా చెప్పుకునే ఆయన, బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద వ్యక్తిగా పాపులర్ అయ్యాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరు టార్గెట్ చేస్తూ, సినిమాలకు చెత్త రివ్యూలు ఇస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. హీరో హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్ గురించి బేస్ లెస్ కామెంట్స్ చేయడమే కాదు, సినీ ప్రముఖులపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్న కేఆర్కే.. ఇప్పుడు జక్కన్నను టార్గెట్ చేసాడు.
హాలీవుడ్ మూవీస్ లోని కొన్ని సన్నివేశాలను కాపీ చేసి దర్శకుడు 'బాహుబలి' చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొంటూ ఓ నెటిజన్ ఒక వీడియోని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేసాడు. అందులో అవతార్, 300 యోధులు, ది మిత్, కింగ్ ఖాన్, ఎవెంజర్స్, హెర్క్యూల్స్, బ్యాట్ మ్యాన్ vs సూపర్ మ్యాన్, ఎక్స్-మెన్ వంటి సినిమాలలోని సీన్స్ ని ప్రేరణగా తీసుకున్నాడంటూ కంపేర్ చేసి చూపించాడు. ఇదేం బిహేవియర్ సార్ అంటూ రాజమౌళిని ట్యాగ్ చేసాడు. దీన్ని కమల్ ఆర్ ఖాన్ రీట్వీట్ చేస్తూ.. ''అవును, ఈ రాజమౌళి భారతదేశపు పర్ఫెక్ట్ కాపీ మాస్టర్'' అని కామెంట్ పెట్టాడు.
అంతటితో ఆగకుండా ''ఓరి దేవుడా! అంటే 'మక్కి' (ఈగ) సినిమా కూడా కాపీయేనా? ఇప్పుడు రుజువైంది ఎస్.ఎస్. రాజమౌళి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కాపీ మాస్టర్!'' అని మరో ట్వీట్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసాడు కేఆర్కే. అందులో 2010లో వచ్చిన 'కాక్రోచ్'.. 2007లో రూపొందిన 'బీ' అనే హాలీవుడ్ యానిమేషన్ మూవీలోని సన్నివేశాలను 'ఈగ' చిత్రంలో వాడుకున్నాడని చెప్పే ప్రయత్నం చేసాడు. దీనికి డైరెక్టర్ రాజమౌళిని కూడా ట్యాగ్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది.
KRK ట్వీట్ పై రాజమౌళి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ పై ఆధిపత్యం చలాయిస్తున్నాడనే దర్శక ధీరుడిపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. దాన్ని క్రియేటివ్ ఇన్స్పిరేషన్ గా పిలుస్తారే తప్ప, కాపీ మాస్టర్ అని అనరని సమాధానమిస్తున్నారు. RRR తో ఇండియన్ సినిమాని గ్లోబల్ వైడ్ తీసుకెళ్లడమే కాదు, అకాడమీ అవార్డును తీసుకొచ్చిన గొప్ప దర్శకుడిపై ఇలాంటి చవకబారు ట్వీట్స్ తగదని హితవు పలుకుతున్నారు.
కమల్ ఆర్ ఖాన్ గతంలో అనేక సందర్భాల్లో సౌత్ ఇండియన్ యాక్టర్స్ పై, మన సినిమాలపై నోటికొచ్చినట్లుగా మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'బాహుబలి 2' సినిమాపైనా నెగెటివ్ గా ట్వీట్లు పెట్టాడు. టాలీవుడ్ ఆడియన్స్ కౌంటర్ అటాక్ దెబ్బకు దిగొచ్చి, క్షమాపణలు కూడా చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు రాజమౌళిని పర్ఫెక్ట్ కాపీ మాస్టర్, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ కాపీ మాస్టర్ అని పిలిచి మరోసారి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.
Also Read: '7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ - మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial