Hi Nanna: తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. ఈ నెలాఖరున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నాయకులంతా జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక హామీలను గుప్పిస్తున్నారు. తాము అధికారికారంలోకి వస్తే ఏం చేస్తామనేది చెబుతూ మ్యానిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని సైతం రాజకీయ నాయకుడి అవతారమెత్తాడు. తన పార్టీ పేరుని ప్రకటించడమే కాదు, మ్యానిఫెస్టో కూడా రిలీజ్ చేసాడు. అయితే ఇదంతా ఎన్నికల ప్రచారం కోసం కాకుండా, తన 'హాయ్ నాన్న' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేయడం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  


నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం 'హాయ్ నాన్న'. తండ్రీ కూతుళ్ళ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే ఈ ఫీల్‌ గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి నాని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఎన్నికల ఫీవర్ ను క్యాష్ చేసుకోడానికి వినూత్నమైన ఆలోచనతో వచ్చాడు. ఇందులో భాగంగానే రాజకీయ నాయకుడి గెటప్‌లోకి మారిపోయి ప్రచారం మొదలుపెట్టాడు. థియేటర్లలో మీ ఓటు మాకే వేయాలి అంటూ ట్వీట్లు పెడుతున్నాడు. 


''రిలీజ్ దెగ్గరలో ఉంది. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి. వాడేయటమే.. మ్యానిఫెస్టోలు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ. నేనూ ఒక రాయి ఏసా.. మీ ఓట్ 'హాయ్ నాన్న' కే వేయండి'' అని నాని తాజాగా ఓ ట్వీట్ చేసారు. అలానే హాయ్ నాన్న పార్టీ మ్యానిఫెస్టో అంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్ చేసారు. అందులో ''మన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే యూత్ అంతా విచ్చలవిడిగా రీల్స్ చేసుకోడానికి స్మార్ట్ ఫోన్లను కిట్ కిట్ లుగా పంచిపెడతాం. అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్ల ఆదాయం.. ఆ పక్కనే ఉన్న కిరాణా కొట్టోళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం'' అని చెప్పాడు. 'అప్పుడు సబ్జెక్ట్ టాపిక్ తెలియకుండా అదే పట్టుకొని ఇష్టమొచ్చినట్లు వాగేవాళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం' అంటూ పనిలో పనిగా తన కిరాణా కొట్టు కాంట్రవర్సీపై సెటైర్ వేశారు.  


'హాయ్ నాన్న' అంటే తండ్రీ కూతుర్ల రిలేషన్ షిప్ గుర్తొస్తుంది కాబట్టి ప్రతీ తండ్రికి కుమార్తెకు రెండు ఓట్లు ఉండేలా చూస్తానని, 18 ఏళ్ళు నిండిన వాళ్లే కాకుండా ప్రతీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పి నాని నవ్వించారు. ఎన్నారైలు తమ పట్ల ఎంతో ప్రేమ చూపిస్తారు కనుక డెల్లాస్, టెక్సాస్ లలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నిర్మిస్తామని, అక్కడే సంధ్య దేవి సుదర్శన్ థియేటర్లు కట్టిస్తామని నవ్వులు పూయించారు. తమ పార్టీకే ఓటు వెయ్యండి అని పొలిటీషియన్స్ ఇలాంటి కబుర్లు ఎన్నో చెప్తారని, తమ సినిమానే చూడాలని యాక్టర్స్ కూడా ఎన్నెన్నో చెప్తారని, అలోచించి మంచోడికే ఓటు వెయ్యాలని, మంచి సినిమానే థియేటర్లలో చూడాలని సూచించారు. అలానే ఇటీవల మీడియా మిత్రులను ఉద్దేశిస్తూ యాంకర్ సుమ చేసిన కామెంట్స్ పై వివాదం చెలరేగడంపైనా నాని సెటైర్లు వేశారు. సారీ చెప్పాడని తాను యాంకర్ ను కాదని, పొలిటిషియన్ అంటూ నాని ముగించారు. 


Also Read: చేతబడులు, క్షుద్ర పూజలు - హిట్ ఫార్ములా పట్టేసిన టాలీవుడ్ ఫిలిం మేకర్స్!






ఎన్నికల మూడ్ ని వాడుకొని యునిక్ వేలో నాని తన 'హాయ్‌ నాన్న' సినిమాని ప్రమోట్ చేసుకోవడాన్ని అభిమానులు అభినందిస్తున్నారు. అదే సమయంలో కిరాణా కొట్టు వివాదం, యాంకర్ సుమ మీడియాకు క్షమాపణలు చెప్పిన విషయాలపై సెటైర్లు వేయడంపై కొందరు నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఏదేమైనా నాని డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో తన సినిమాకి పబ్లిసిటీ తీసుకురావడానికి చేసిన ఈ మ్యానిఫెస్టో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ప్రచారం సినిమా ప్రచారానికి ఏ మేరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి. 


ఇదిలా ఉంటే 'హాయ్ నాన్న' సినిమాతో శౌర్యువ్‌ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇందులో బేబి కైరా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్‌ వహబ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. వైరా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి (CVM), విజేందర్‌ రెడ్డి తీగల, మూర్తి కేఎస్‌ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 


Also Read: ఏజ్ బార్ అవుతున్నా ఈ బ్యూటీల క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదుగా!