నేషనల్ అవార్డుల్లో ఎన్నడూ లేని స్థాయిలో టాలీవుడ్ తారలు తళకులీనారు. ఈ ఏడాది ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో టాలీవుడ్‌కు వివిధ విభాగాల్లో అవార్డులు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల చరిత్రలో తొలిసారి.. ఒక టాలీవుడ్ హీరోకు ఉత్తమ హీరో అవార్డు లభించడం విశేషం. ‘పుష్ప: ది రూల్’ మూవీలో అల్లు అర్జున్ నటనకు ఫిదా అయిన జ్యూరీ ఆయన్ని ఉత్తమ కథానాయుకుడిగా ఎంపిక చేశారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ ఈ అవార్డును అందుకున్నాడు. 






'పుష్ప' సినిమాకు గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అవార్డు అందుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి కూడా అవార్డుల వర్షం కురిసింది. మొత్తం ఆరు అవార్డులతో.. ‘ఆర్ఆర్ఆర్’ తన సత్తా చాటింది. ఎంఎం కీరవాణికి ఈ సినిమాకు గాను ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఆయన తనయుడు కాల భైరవకు 'కొమురం భీముడో...' సినిమాకు గాను  ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డు అందుకున్నాడు. తండ్రి కుమారులు ఇద్దరూ ఒకే రోజు ఒకే వేదికపై పురస్కారాలు అందుకోవడం గమనార్హం. వారితోపాటు దర్శకుడు రాజమౌళి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉత్తమ తెలుగు సినిమాగా ఎంపికైన ‘ఉప్పెన’ మూవీ నుంచి దర్శకుడు బుచ్చిబాబు అవార్డు అందుకున్నాడు. 'కొండపొలం'లో 'ధమ్ ధమ్ ధమ్...' పాటకు ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్ పురస్కారాలు అందుకున్నారు. 






ఉత్తమ నటిగా 69వ జాతీయ పురస్కారాల్లో ఇద్దరు హిందీ కథానాయికలు నిలిచారు. 'గంగూబాయి కథియావాడి' చిత్రంలో నటనకు గాను ఆలియా భట్, 'మిమి'లో నటనకు కృతి సనన్ పురస్కారం కైవసం చేసుకున్నారు. 'మిమి' చిత్రంలో నటనకు పంకజ్ కపూర్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచారు. తమిళ కథానాయకుడు, భాషలకు అతీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న మాధవన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రి' సినిమా ఉత్తమ జాతీయ సినిమాగా నిలిచింది. సంచలన విజయం సాధించిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా ఉత్తమ జాతీయ సమగ్రతా సినిమాగా నిలిచింది.


నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 అవార్డు గ్రహీతల జాబితా ఇదే:






⦿ ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ - పుష్ప: ది రైజ్‌
⦿ ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన
⦿ ఉత్తమ యాక్షన్‌ డైరక్షన్‌: కింగ్‌ సాలమన్‌ - RRR
⦿ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - RRR
⦿ ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌రక్షిత్‌ - RRR
⦿ ఉత్తమ నేపథ్య గాయకుడు: కాలభైరవ (RRR- కొమురం భీముడో)
⦿ ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్): దేవిశ్రీ ప్రసాద్ - పుష్ప: ది రైజ్
⦿ ఉత్తమ సంగీత దర్శకుడు (నేపథ్య సంగీతం): ఎం.ఎం.కీరవాణి - RRR
⦿ ఉత్తమ గీత రచన: చంద్రబోస్‌ - కొండపొలం
⦿ ఉత్తమ నటి: ఆలియా భట్‌ - గంగూబాయి కాఠియావాడి, కృతిసనన్‌ - మీమీ
⦿ ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి - ది కశ్మీర్ ఫైల్స్‌ 
⦿ ఉత్తమ సహాయ నటుడు: పంకజ్‌ త్రిపాఠి - మిమి
⦿ ఉత్తమ చిత్రం: రాకెట్రీ - ది నంబీ ఎఫెక్ట్‌
⦿ ఉత్తమ సినిమాటోగ్రఫీ: సర్దార్‌ ఉద్దమ్‌ (అవిక్‌ ముఖోపాధ్యాయ)
⦿ ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్‌ (ఇరివిన్‌ నిజాల్‌ - మాయావా ఛాయావా)
⦿ నర్గీస్ దత్ అవార్డు: ది కశ్మీర్ ఫైల్స్
⦿ ఉత్తమ దర్శకుడు: నిఖిల్‌ మహాజన్‌ - గోదావరి (మరాఠీ)
⦿ ఉత్తమ ఎడిటర్: సంజయ్ లీలా భన్సాలీ - గంగూబాయి కాఠియావాడి
⦿ ఉత్తమ స్క్రీన్‌ప్లే: నాయట్టు - మలయాళం
⦿ ఉత్తమ సంభాషణలు: గంగూబాయి కాఠియావాడి