Nani: హాలీవుడ్‌లోని మల్టీవర్స్ తరహాలో ఇప్పుడు ఇండియన్ సినిమాల్లో కూడా సినిమాటిక్ యూనివర్స్‌లు మొదలయ్యాయి. బాలీవుడ్, కోలీవుడ్‌లో మొదలయిన సినిమాటిక్ యూనివర్స్, మల్టీవర్స్‌ను కాన్సెప్ట్‌ను తెలుగులోకి తీసుకొచ్చిన దర్శకుడు శైలేష్ కొలను. ‘హిట్’ సినిమాతో దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్‌వర్స్’ అని ఒక యూనివర్స్‌ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్‌వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్‌లో కన్ఫ్యూజన్ మొదలయ్యిందని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


శైలేష్ పేరు లేదు..


‘హిట్’ సినిమాతో శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం చేసిందే నేచురల్ స్టార్ నాని. తన నిర్మాణంలోనే ‘హిట్’ తెరకెక్కింది. అందుకే శైలెష్ కొలనుకు నాని అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. దాంతోనే ‘హిట్ 3’లో నానిని లీడ్‌గా తీసుకొని తన హిట్‌వర్స్‌ను ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్నాడు ఈ దర్శకుడు. కానీ అంతలోనే నానికి, శైలేష్‌కు మధ్య క్రియేటివ్ పరంగా మనస్పర్థలు వచ్చాయని టాలీవుడ్‌లో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా నేచురల్ స్టార్ 40వ పుట్టినరోజు సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్‌పై అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ, సుజీత్, వేణు లాంటి దర్శకులను లైన్‌లో పెట్టాడు. ఇందులో శైలేష్ కొలను పేరు లేకపోవడంతో అప్పటినుండే ప్రేక్షకుల్లో అనుమానం మొదలయ్యింది.


విక్రమ్ సర్కార్..


‘హిట్ 3’లో నానిని విక్రమ్ సర్కార్‌గా చూపిస్తున్నట్టు ‘హిట్ 2’ క్లైమాక్స్‌లోనే రివీల్ చేశాడు దర్శకుడు శైలేష్ కొలను. అందుకే తాజాగా ‘హిట్ 3’ స్క్రిప్ట్‌తో నానిని కలిశాడట. కానీ కథ పూర్తిస్థాయిలో నానికి నచ్చకపోవడంతో, అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయమని సలహా ఇచ్చాడట. మెయిన్‌ ప్లాట్ నానికి నచ్చలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే ప్రస్తుతం తన కథతో నానిని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు శైలేష్. చివరిగా సీనియర్ హీరో వెంకటేశ్‌తో ‘సైంధవ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు ఈ దర్శకుడు. నానితో ‘హిట్ 3’ చేయడానికి చాలా సమయం పడుతుందని, అందుకే మధ్యలో ‘సైంధవ్’తో వస్తున్నానని ఒకానొక సందర్భంలో రివీల్ చేశాడు.


హిట్ దక్కలేదు..


నేచురల్ స్టార్ నానికి ఉన్న కమిట్‌మెంట్స్ వల్ల ‘హిట్ 3’ లేట్ అవుతుందని భావించిన శైలేష్ కొలను.. వెంకటేశ్‌తో ‘సైంధవ్’ తెరకెక్కించాడు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఈ కారణం వల్ల కూడా నాని.. తనతో వర్క్ చేయడానికి ఆలోచిస్తున్నాడేమో అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సరిపోదా శనివారం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. దీని తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో ఒక ప్రాజెక్ట్‌ను ఓకే చేశాడు. ఈ రెండూ పూర్తయిన తర్వాత ‘బలగం’ ఫేమ్ వేణుతో ఒక పీరియాడిక్ స్టోరీ ప్లాన్ చేశాడు. ఇక నాని, శైలేష్ కాంబినేషన్‌లో వచ్చే ‘హిట్ 3’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులు మరికొంతకాలం ఆగాల్సిందే.


Also Read: షారుఖ్, సుహానా సినిమాకు టైటిల్ ఫిక్స్ - యాక్షన్ కోసం ట్రైనింగ్ మొదలుపెట్టిన తండ్రీకూతుళ్లు