Shah Rukh Khan and Suhana Khan: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు 2023 చాలా స్పెషల్. గత కొన్నిరోజులుగా ఆయన నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అవుతూ ఉండగా.. 2023లో మాత్రమే మూడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా అన్నింటితో హిట్స్ అందుకున్నాడు కూడా. అంతే కాకుండా తన వారసురాలిగా సుహానా ఖాన్ కూడా గతేడాది నటిగా డెబ్యూ ఇచ్చింది. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ ‘ది ఆర్చీస్’లో ఒక హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. అయితే త్వరలోనే ఈ ఇద్దరు కలిసి నటించనున్నారు అనే వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవ్వగా.. తాజాగా ఈ మూవీపై మరో అప్డేట్ బయటికొచ్చింది.


టైటిల్ ఫిక్స్..


షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ఒక యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. ఇందులో షారుఖ్ ఖాన్‌తో పాటు తన కూతురు సుహానా ఖాన్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ మూవీని సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. అంతే కాకుండా ‘పఠాన్’, ‘ఫైటర్’లాంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. షారుఖ్, సుహానాల మల్టీ స్టారర్‌కు సహ నిర్మాతగా వ్యవహరించడానికి ముందుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి బాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్ నడుస్తుండగా.. తాజాగా దీని టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ టైటిల్ చక్కర్లు కొడుతోంది. 


త్వరలోనే సెట్స్‌పైకి..


షారుఖ్ ఖాన్, సుహానా ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి ‘కింగ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు సమాచారం. అంతే కాకుండా 2024 మేలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతుందని తెలుస్తోంది. 2023 అక్టోబర్ నుండి 2024 ఫిబ్రవరీ వరకు సిద్ధార్థ్ ఆనంద్, సుజోయ్ ఘోష్ కలిసి షారుఖ్, సుహానాతో  కలిసి ఎన్నోసార్లు స్టోరీ డిస్కషన్‌లో పాల్గొన్నారు. ఈ స్క్రిప్ట్‌ను మెరుగుపరచడం కోసం సుజోయ్ ఇంత సమయాన్ని తీసుకున్నాడని సమాచారం. ఇక సిద్ధార్థ్ ఆనంద్ సినిమాలు అంటేనే యాక్షన్ సీక్వెన్స్‌లు ఒక రేంజ్‌లో ఉంటాయి. అందుకే ‘కింగ్’లో కూడా ఆ రేంజ్ యాక్షన్‌ను చూపించడానికి షారుఖ్ సిద్ధమవుతున్నాడట.


మన్నత్‌లో ట్రైనింగ్..


‘కింగ్’లో షారుఖ్ ఖాన్‌తో పాటు సుహానా ఖాన్ కూడా యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గోనుందని, ఫైట్స్ చేయనుందని తెలుస్తోంది. అందుకే వీటికోసం సుహానా స్పెషల్ ట్రైనింగ్‌ను కూడా ప్రారంభించిందట. తన ఇల్లు మన్నత్‌లో సుహానా ప్రాక్టీస్ మొదలయ్యిందని, తనతో పాటు షారుఖ్ కూడా ఈ ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నాడని సమాచారం. 2024 మేలోని ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి క్యాస్టింగ్‌పై దృష్టిపెట్టాడట దర్శకుడు సుజోయ్ ఘోష్. 2025లో ఎలాగైనా ‘కింగ్’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.  ‘కింగ్’ అయిపోయిన వెంటనే ‘పఠాన్ 2’ షూటింగ్‌లో పాల్గొనున్నారు షారుఖ్. ఇలా ప్రస్తుతం షారుఖ్ కాల్ షీట్స్ అన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నిండిపోయాయని తెలుస్తోంది.


Also Read: అన్నపూర్ణ-చిన్మయి వివాదంపై మాధవిలత షాకింగ్‌ కామెంట్స్‌ - సమాజం అన్నాక అన్నీ ఉంటాయి, కానీ..