Nani Hi Nanna : న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్ ఎంచుకుని బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఈ ఏడాది 'దసరా' మూవీతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న నాని తాజాగా 'హాయ్ నాన్న'తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తండ్రీ, కూతురు మధ్య అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ అనే నూతన దర్శకుడు వెండితెరకు పరిచయమయ్యాడు. నాని సరసన మృణాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే నానికి కూతురిగా కియారా ఖన్నా తన నటనతో ఆకట్టుకుంది.
డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ అందుకుంటుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో వీకెండ్ పూర్తవక ముందే వన్ మిలియన్ మార్క్ దాటింది. దీంతో టైర్ 2 హీరోల్లో ఎక్కువ సార్లు ఓవర్సీస్ మార్కెట్ వద్ద 1 మిలియన్ మార్క్ అందుకున్న హీరోగా నాని సరికొత్త రికార్డ్ క్రేయేట్ చేశాడు. ఈ సినిమాతో కలిపి మొత్తం నాని నటించిన తొమ్మిది సినిమాలు ఈ ఘనతను అందుకోవడం విశేషం.
హాయ్ నాన్న కంటే ముందు ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, MCA, నిన్ను కోరి, జెర్సీ, అంటే సుందరానికి, దసరా సినిమాలు ఈ ఘనత సాధించగా తాజాగా ఆ లిస్టులో హాయ్ నాన్న కూడా చేరింది. టైర్ 2 హీరోల్లో ఎక్కువసార్లు ఈ ఫీట్ అందుకున్న ఏకైక హీరోగా నాని నిలిచాడు. ఎలాగో లాంగ్ రన్ చాలా దూరంలో ఉంది కాబట్టి ఈజీగా టూ మిలియన్ మార్క్ కొట్టొచ్చని అంటున్నారు. ఓవర్సీస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత నాని ఆ ప్లేస్ ను కైవసం చేసుకున్నాడు. ఓవర్సీస్ మార్కెట్ వద్ద మహేష్ టాప్ వన్ ప్లేస్ లో కైవసం చేసుకుంటే, నాని టాప్ 2 ప్లేస్ లో నిలవడం విశేషం. మహేష్ ఖాతాలో ఇప్పటిదాకా 11 మిలియన్ మూవీస్ ఉన్నాయి.
సంక్రాంతికి విడుదల కాబోయే 'గుంటూరు కారం' 12వ మూవీ అవుతుంది. ఇక మిగిలిన హీరోలు మహేష్, నాని తర్వాతి స్థానంలో ఉన్నారు. దీన్నిబట్టి ఓవర్సీస్ లో నానికి ఎంత బలమైన మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే హాయ్ నాన్న రిలీజ్ రోజే నాని అమెరికా ప్రయాణం పెట్టుకుని దానికి తగ్గట్టే అక్కడి ఆడియన్స్ ని కలుస్తూ, థియేటర్స్ విజిట్ చేస్తూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు. సలార్ వచ్చేదాకా ఓవర్సీస్ లో హాయ్ నాన్నకు ఎలాంటి డోకా ఉండదని అక్కడి బయ్యర్లు చెబుతున్నారు. కాగా హాయ్ నాన్న మూవీ 4 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్ల గ్రాస్ అందుకుంది. యానిమల్, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో తక్కువ థియేటర్స్ దొరికినప్పటికీ హాయ్ నాన్న ఈ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం.
Also Read : ప్రభాస్ 'స్పిరిట్'లో ‘యానిమల్’ బ్యూటీ తృప్తి దిమ్రి? ఇదిగో క్లారిటీ!