Bootcut Balaraju Teaser: ‘బిగ్ బాస్’ రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోహెల్. చక్కటి ఆటతీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి బయటకు వచ్చాక, ఆయనకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’, ‘లక్కీ లక్ష్మణ్’, ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ లాంటి సినిమాల్లో నటించి అలరించాడు. ఎక్కువగా కామెడీ ఎంటర్‌టైనర్లలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.
‘బూట్ కట్ బాలరాజు‘గా సోహెల్
తాజాగా సోహెల్ ‘బూట్ కట్ బాలరాజు‘ అనే సినిమాలో నటిస్తున్నారు. కోనేటి శ్రీను దర్శకత్వం ఈ సినిమా రూపొందుతోంది. మేఘ లేఖ హీరోయిన్ గా నటిస్తోంది. ఎండీ పాషా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ఇంద్రజ, సునీల్, సిరి హన్మంతు, జబర్దస్త్ రోహిణి, ముక్కు అవినాష్, సద్దాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఫుల్ ఫన్నీగా ‘బూట్ కట్ బాలరాజు‘ టీజర్
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ తో అలరిస్తోంది. హీరో సోహెల్, ఆయన గ్యాంగ్ చేసే రచ్చ మామూలుగా లేదు. ఊళ్లో జనాలు వీళ్ల తిక్క చేష్టలకు తిట్టిన వాళ్లే గానీ, తిట్టని వాళ్లు లేరు. “అనగనగా ఒక రాజు అనేది పాతకథ. అయితే, అనగనగా ఒక ‘బూట్ కట్ బాలరాజు’ అనేది కొత్తకథ. నా కథ అంటూ హీరోయిన్ వాయిస్ తో టీజర్ మొదలవుతుంది. హీరో సోహెల్ సిగ్గు శరం లాంటి పట్టింపులు ఏమీ లేకుండా తన గాలి బ్యాచ్ తో కలిసి ఊరు మీద పడి తిరుగుతుంటాడు. తుంటరి పనులు చేస్తుంటారు. మంచి వాళ్లంతా పోతున్నరు.. మీరు పోతలేరేంట్రా? అని ఊరు జనాలు అనే రేంజిలో వాళ్ల చిల్లర చేష్టలు ఉంటాయి.
కాలేజీకి వెళ్లరు. వెళ్లినా చదవరు. పనులు చేతగావు. తినడంలో మాత్రం ముందుంటారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా సింపుల్ గా తుడిచేసుకుని బతికే బతుకు హీరో బ్యాచ్ ది. సీనియర్ నటి ఇంద్రజ ఇంద్రావతి పటేలమ్మాగా కనిపిస్తుంది. హీరోయిన్ మేఘ లేఖను చాలా అందంగా చూపించారు. తెలంగాణ యాసలో ఆమె చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఇక అమ్మాయిల గురించి సద్దాం వేసే పంచ్ పటాసులా పేలుతుంది. ‘నా ప్రాణం పోతుంది అంటే, ఆగాగు స్నానం చేసి రెడీ అయి వస్తా అనే టైప్’ అంటూ సైటర్లు విసురుతాడు. ముక్కు అవినాష్ బాలయ్యను ఇమిటేట్ చేసే సీన్ ఆకట్టుకుంటుంది. మొత్తంగా ఫుల్ ఫన్నీగా కొనసాగే ఈ టీజర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా గురించి సోహెల్ పలు విషయాలు వెల్లడించారు. సుమారు తొమ్మిది నెలలు ఈ మూవీ స్క్రిప్ట్ కోసం కష్టపడినట్లు చెప్పారు. మంచి స్క్రిప్ట్, చక్కటి డైలాగ్స్ ఈ సినిమాలో అందరినీ ఆకట్టుకుంటాయన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందన్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. విజయ్ వర్ధన్ ఎడిటర్ కాగా విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
Read Also: మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడ్డానికి మీరెవరు? రేణూ దేశాయ్ ఆగ్రహం