నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'భగవంత్ కేసరి'. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా మేకర్స్ చిత్ర బృందం కలిసి ఉన్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 


భావోద్వేగాలతో నిండిన యాక్షన్ మూవీని అందించడానికి 'భగవంత్ కేసరి' టీమ్ అంతా సిద్ధమయ్యారు అంటూ షేర్ చేసిన గ్రూప్ ఫోటో నెట్టింట సందడి చేస్తోంది. ఇది హైదరాబాద్‌ లోని సంగీత దర్శకుడు ఎస్. థమన్ రికార్డింగ్ స్టూడియోలో దిగిన ఫొటో. ఇందులో బాలకృష్ణ, శ్రీలీలలతో పాటుగా దర్శక నిర్మాతలు కనిపిస్తున్నారు. ఈ పిక్ లో శ్రీలీల పక్కన బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


'భగవంత్ కేసరి' బృందంలో మోక్షజ్ఞ కూడా జాయిన్ అవ్వడంతో, ఈ సినిమాలో బాలయ్య వారసుడి స్పెషల్ ఎంట్రీ ఉంటుందేమో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుందనే రూమర్స్ ఊపందుకున్నాయి. అంతేకాదు ఈ ఫొటోలో మోక్షు చాలా స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హీరోగా లాంచ్ అవడానికి రెడీ అయిపోయాడని కామెంట్లు చేస్తున్నారు. 






నిజానికి మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ అది ఇంతవరకూ జరగలేదు. లాంచింగ్ ప్రాజెక్ట్ కోసం పలువురు అగ్ర దర్శకుల పేర్లు తెర మీదకు వచ్చాయి కానీ, ఏదీ నిజం కాలేదు. బాలయ్య మాత్రం తనయుడి ఎంట్రీకి మంచి ప్లాన్స్ చేసి పెట్టుగా చెబుతూ వస్తున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 'ఆదిత్య 999 మ్యాక్స్' సినిమాతోనే మోక్షు తెరంగేట్రం వుంటుందని హింట్ ఇచ్చారు. పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా కంటే ముందే లాంచింగ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే నందమూరి హీరో ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తారేమో చూడాలి. 


ఇక 'భగవంత్ కేసరి' విషయానికొస్తే, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి - బాక్సాఫీస్ బొనాంజా బాలయ్య తొలిసారిగా కలిసి వర్క్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తండ్రీ కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా శ్రీలీల కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చింది. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్  మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. 


షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చగా.. సి.రామ్‌ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. రాజీవన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, తిమ్మిరాజు ఎడిటర్ గా వర్క్ చేసారు. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 'భగవంత్ కేసరి' సినిమా విడుదల కానుంది. అక్టోబర్ 15న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారని సమాచారం. 


Also Read: 'ఇండియన్-2' అప్డేట్​ ఇచ్చిన శంకర్.. మరి 'గేమ్ చేంజర్' సంగతేంటి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial