Naga Chaitanya Meets Bujji: ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఎన్నో పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో అన్నింటికంటే ముందుగా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. ఫైనల్‌గా జూన్‌లో రిలీజ్‌కు సిద్ధమయ్యింది. దీంతో ప్రమోషన్‌లో భాగంగా ముందుగా ఈ సినిమాలోనే ‘బుజ్జి’ అనే పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. బుజ్జి అంటే ప్రేక్షకులు ఊహించినట్టుగా మనిషి కాదు.. అది ఒక కారు. ‘కల్కి 2898 AD’ కోసమే ఈ బుజ్జి అనే కారును స్పెషల్‌గా డిజైన్ చేశారు. తాజాగా యంగ్ హీరో నాగచైతన్య బుజ్జిని కలిశాడు.


షాకైన చైతూ..


బుజ్జిని ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ‘కల్కి 2898 AD’ మూవీ టీమ్ ఒక స్పెషల్ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్‌లో బుజ్జితో పాటు ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఎఫ్ 1 రేసింగ్‌లో ఉపయోగించే కారులాగా ఉన్న బుజ్జిని చూసి చాలామంది ఇంప్రెస్ అయ్యారు. అలా ఇంప్రెస్ అయినవారిలో నాగచైతన్య కూడా ఒకడు. అందుకే బుజ్జిని నేరుగా చూడడానికి వెళ్లాడు. దానిని చూడడం మాత్రమే కాకుండా బుజ్జితో ఒక రైడ్‌కు వెళ్లాడు. దాని తయారీని చూసి ఆశ్చర్యపోయాడు చైతూ. ‘‘నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. మీరు ఇంజనీరింగ్‌కు సంబంధించిన అన్ని రూల్స్‌ను బ్రేక్ చేశారు’’ అంటూ బుజ్జిని తయారు చేసిన టీమ్‌ను ప్రశంసించాడు.









బుజ్జికి ఫిదా..


నాగచైతన్య.. బుజ్జిని కలవడం, దాంతో రైడ్‌కు వెళ్లడం.. ఇదంతా వీడియో తీసి తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది వైజయంతీ మూవీస్. మామూలుగా చైతూకు ముందు నుంచి కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఏ స్టార్ దగ్గర లేని కొన్ని అడ్వాన్స్ మోడల్ కార్ కలెక్షన్స్ తన దగ్గర ఉన్నాయి. అలాంటి హీరో బుజ్జితో రైడ్‌కు వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్నిబట్టి చూస్తే ‘కల్కి 2898 AD’ను ప్రమోట్ చేయడానికి మరెందరో తెలుగు స్టార్లను రంగంలోకి దించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇప్పటికే బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడానికి కీర్తి సురేశ్ ముందుకొచ్చింది.


గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్..


నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ జూన్ 27న విడుదలకు సిద్ధమయ్యింది. ఇప్పటికే విడుదలయిన బుజ్జి - భైరవ టీజర్‌కు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభించింది. కేవలం ఒక క్యారెక్టర్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేయడానికే మూవీ టీమ్ అంతా కలిసి పెద్ద ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఇంక రానున్న రోజుల్లో ఇలాంటి ఈవెంట్స్ మరెన్నో జరగనున్నాయో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనె, దిశా పటానీ నటించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ నటుడు ముఖ్య పాత్రలు పోషించారు.


Also Read: దీపికా పదుకొనెపై ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం - కారణం ఇదేనట!