Prabhas Fans Disappointed With Deepika Padukone: ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు.. టాలీవుడ్‌కు వచ్చి నటించడం చాలా పెద్ద విషయంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. టాలీవుడ్ రేంజ్ కూడా మారిపోయింది. బాలీవుడ్ భామలు సైతం మన స్టార్ల సరసన నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా త్వరలోనే ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన డెబ్యూ చేయడానికి సిద్ధమయ్యింది. కానీ తన టాలీవడ్ డెబ్యూ గురించి అసలు దీపికా పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దీంతో తనపై విమర్శలు వినిపిస్తున్నాయి. ‘కల్కి 2898 AD’కు సంబంధించిన ఏ అప్డేట్‌పై కూడా ఈ హీరోయిన్ ఆసక్తి చూపించడం లేదు.


ప్రమోషన్స్ షురూ..


‘కల్కి 2898 AD’ మూవీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అసలైతే గత ఏడాది సమ్మర్‌లోనే ఈ సినిమా విడుదల అవుతుందని ప్రేక్షకులు అనుకున్నారు. కానీ క్వాలిటీ పరంగా ఇంకా బెటర్ అవ్వాలనే ఉద్దేశ్యంతో మూవీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు లేట్ అవుతూ వచ్చాయి. అందుకే డిసెంబర్‌ నుండి కూడా పోస్ట్‌పోన్ అయ్యి ఏకంగా ఈ ఏడాది సమ్మర్‌లో అంటే జూన్ 27న విడుదలను కన్ఫర్మ్ చేసుకుంది ‘కల్కి 2898 AD’. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ టీమ్.. ప్రమోషన్స్ ప్రారంభించారు. ఇందులో హీరోయిన్‌గా నటించిన దీపికా మాత్రం ఈ ప్రమోషన్స్ గురించి ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


బుజ్జి గ్లింప్స్..


ముందుగా ‘కల్కి 2898 AD’ నుండి బుజ్జి - భైరవ గ్లింప్స్ విడుదలయ్యింది. ఈ అప్డేట్‌ను ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడం కోసం ఒక స్పెషల్ వ్యక్తిని పరిచయం చేయబోతున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ షేర్ చేశాడు ప్రభాస్. దీంతో ఒక్కసారి సోషల్ మీడియాలో అంతా దీని గురించే హాట్ టాపిక్‌గా మారింది. అలా బుజ్జి గ్లింప్స్‌కు ఎనలేని పాపులారిటీ దక్కింది. అలా ప్రభాస్ సైతం ‘కల్కి 2898 AD’ ప్రమోషన్స్ కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తుంటే దీపికా పదుకొనె మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కనీసం బుజ్జి - భైరవ గ్లింప్స్‌ను కూడా తన సోషల్ మీడియాలో వెంటనే షేర్ చేయలేదు దీపికా.


పట్టించుకోవడం లేదు..


దీపికా పదుకొనె నటించే బాలీవుడ్ సినిమాలను ప్రమోట్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. కానీ తన టాలీవుడ్ డెబ్యూ మూవీ అయిన ‘కల్కి 2898 AD’ గురించి కనీసం పట్టించుకోవడం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీపికా ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తన చివరి సినిమా ‘ఫైటర్’ను ప్రమోట్ చేయడం కోసం దానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ను షేర్ చేసింది దీపికా. కానీ ‘కల్కి 2898 AD’ గురించి మాత్రం ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్న దిశా పటానీ, అమితాబ్ బచ్చన్‌లు సైతం అప్డేట్స్‌ను వెంటనే షేర్ చేస్తున్నారని, వారిని చూసి దీపికా నేర్చుకోవాలని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.


Also Read: కాజల్ సినిమా ఓ అడుగు వెనక్కి - లేడీ సింగం థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?