100 ఏళ్ళ ఇండియన్ సినిమాకు కలగా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని సాకారం చేసింది RRR. పాపులర్ హాలీవుడ్ సాంగ్స్ ని వెనక్కి నెట్టి మన తెలుగు పాట 'నాటు నాటు', అకాడెమీ వేదిక మీద బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించింది. అలాంటి గీతాన్ని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ లపై యావత్ భారతీయ సినీ ప్రియులు ప్రశంసలు కురిపించారు. అయితే 'నాటు నాటు' అనేది తన టాప్ 100 సాంగ్స్ లో లేదని కీరవాణి షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ అయిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ లో 'నిజం' అనే కొత్త షోని ప్రారంభించారు. నిజం నివురు కప్పిన నిప్పు.. ఎప్పుడో అప్పుడు మంటగా మారి అబద్దాన్ని కాలుస్తుంది.. అబద్దం బట్టలూడదీసి నిజం చూపించడమే ఈ షో లక్ష్యం అంటూ ఆర్జీవీ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కీరవాణిని ఇంటర్వ్యూ చేశారు. 'ఆస్కార్ వెనుక నాటు నిజం' అనే పేరుతో లేటెస్ట్ ఎపిసోడ్ ను వర్మ ఛానల్ లో వదిలారు. 

 

ఈ ఇంటర్వ్యూలో RRR చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ కి ఆస్కార్ దక్కడం గురించి ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. ఒకవేళ 'నాటు నాటు' సాంగ్ ఇంకెవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉంటే.. దానికి ఆస్కార్ వచ్చి ఉంటే.. ఆ పాటకి అంత అర్హత ఉందని మీరు భావించేవారా? అని కీరవాణిని వర్మ ప్రశ్నించారు. దీనికి కీరవాణి బదులిస్తూ "ఈ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చెప్తాను. జస్ట్ ఒక పాటగా తీసుకుంటే మాత్రం ఆస్కార్ వచ్చిందందుకు నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నేను 'జయహో' సాంగ్ కు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా అలా ఫీల్ అవలేదు కాబట్టి. జయహో ఎంత మెరిట్ తీసుకుందో.. దీనికి కూడా అంతే మెరిట్" అని అన్నారు.

 

ఈ సందర్భంగా 'నాటు నాటు' సాంగ్ మీ కెరీర్ లో టాప్ 100 సాంగ్స్ లో అయినా ఉంటుందని అనుకుంటున్నారా? అని ఆర్జీవీ సూటిగా ప్రశ్నించారు. దీనికి కీరవాణి వెంటనే "లేదు" అని సమాధానమిచ్చారు. అయితే ఏదైనా ఒకటి క్రియేట్ చేసేప్పుడు అవతలి వాళ్లకి నచ్చాలి అని పని చేస్తున్నప్పుడు, అది ముందు మనకు నచ్చాలి. నాకే నచ్చకపోతే ఇంక ప్రపంచానికి నచ్చాలని నేను ఎలా ఎక్స్ పెక్ట్ చేయగలను అంటూ 'నాటు నాటు' పాట తన టాప్ లిస్టులో లేకపోయినా, తనకు నచ్చిన పాటే అనే విధంగా వివరణ ఇచ్చారు.



 

నిజానికి కీరవాణి తండ్రి శివశక్తి దత్త ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో 'నాటు నాటు' పాటపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కీరవాణి ఇప్పటి వరకూ ఎన్నో మంచి పాటలను కంపోజ్ చేశాడని.. వాటితో పోలిస్తే ట్రిపుల్ ఆర్ లోని 'నాటు నాటు' పాట ఏమంత గొప్పగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. రణగొణ ధ్వని తప్ప ఆ పాటలో శ్రావ్యత లేదని శివశక్తి దత్త అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు కీరవాణి సైతం అలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చిన 'నాటు నాటు' పాట తన టాప్ 100 సాంగ్స్ లో లేదని కీరవాణి చెప్పడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 'ఆస్కార్ వెనుక నాటు నిజం' వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.