తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే సంగీత ద్వయం ‘రాజ్-కోటి’. తన స్నేహితుడు కోటితో కలిసి ఎన్నో సినిమాలకు మంచి స్వరాలు అందించిన రాజ్(65).. ఆదివారం మరణించారు. బాత్రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన గుండె పోటుకు గురయ్యారని, హాస్పిటల్‌కు తరలించే లోపే ఆయన కన్ను మూశారని రాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజ్ మరణ వార్త యావత్ టాలీవుడ్‌ను విషాదంలో నింపేసింది.
రాజ్‌కు ముగ్గురు కుమార్తెలు దీప్తి, దివ్య, శ్వేత ఉన్నారు. దివ్య టాలీవుడ్‌లో అసోషియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. మూడో అమ్మాయి శ్వేత మలేషియాలో ఉంటున్నారు. సోమవారం ఆమె ఇండియాకు చేరగానే మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాజ్ చెన్నైలో పుట్టి, పెరిగారు.
90వ దశకంలో రాజ్-కోటి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి పాటా హిట్టే. దీంతో వారికి అప్పట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే, స్పర్థల వల్ల వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత కోటి మాత్రమే సంగీత దర్శకుడిగి నిలదొక్కుకున్నారు. రాజ్ దాదాపు టాలీవుడ్‌కు దూరమయ్యారు. రాజ్ సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు. టీవీ రాజు కూడా సంగీత దర్శకుడు. ఈయనకు సీనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ మాద్రాసులో సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఉండేవారట. రాజ్ పూర్తి పేరు తోటకూర సోమరాజు. మహేష్ బాబు నటించిన ‘టక్కరి దొంగ’లో కామెడీ పాత్రనో పోషించారు రాజ్.
రాజ్ కోటి కలిసి సంగీతం అందించిన ఫస్ట్ మూవీ ‘ప్రళయ గర్జన’. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్ వంటి సినిమాలకు అందించిన పాటలు ఎంతగా హిట్ అయ్యాయో తెలిసిందే. ఇద్దరు కలిసి సుమారు 150 వరకు సినిమాలకు సంగీతం అందించారు. కోటీతో విడిపోయిన తర్వాత రాజ్ ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’, ‘చిన్ని చిన్న ఆశ’ సినిమాలకు సంగీతం అందించారు. వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ మూవీకి నేపథ్య సంగీతాన్ని అందించారు.
కోటితో ఎందుకు విడిపోయారు?
కేరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజ్-కోటీ విడిపోయారు. వీరిద్దరు విడిపోవడం సంగీత ప్రియులకు కూడా అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో మీడియా నుంచి ప్రతిసారీ వారికి ఇదే ప్రశ్న ఎదురయ్యేది. కోటీతో ఎందుకు విడిపోవల్సి వచ్చిందనే విషయాన్ని రాజ్ ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అయితే, కోటి మాత్రం ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెప్పారు. వాస్తవానికి రాజ్ తనకీ ఎలాంటి విభేదాలు లేవని, ఇద్దరం కలసే పాటలు చేశామని కోటీ తెలిపారు. తాను పాటలకు కండక్టింగ్ బాగా చేసే వాడని, తాను కంపోజింగ్ చేసేవాడినని అన్నారు. ఏదైనా ఇద్దరం కలిసే పనిచేసేవాళ్లమని అన్నారు. ఎలాంటి క్రెడిట్ వచ్చినా అది రాజ్ కోటికి కలిపే వచ్చేదని అన్నారు. అయితే పని విషయంలో ఒక్కోసారి హీరో, డైరెక్టర్లు తనతో వచ్చి మాట్లాడేవారని.. అది ఆయనకు నచ్చేది కాదని అన్నారు. అయితే రాజ్ అలాంటి చిన్న చిన్నవి పెద్దగా పట్టించుకోరని, కానీ పక్కన ఉన్నవారి చెప్పుడు మాటలు విని తనకు దూరమైపోయాడని అన్నారు.
నిజానికి రాజ్ కే మొదట సినిమా అవకాశం వచ్చిందని ఆయనే తనతో ఇద్దరం కలసి సినిమాలు చేద్దామని చెప్పారని, అలా తామిద్దరం కలసి ప్రారంభించామని అన్నారు. మళ్లీ తర్వాత తనే వచ్చి మనం విడిపోదాం అని అంటే తాను షాక్ కు గురయ్యానని అన్నారు. తాను ఎంత చెప్పినా వినలేదని, మనల్ని నమ్ముకొని కొన్ని ఆర్కెస్ట్రా ఫ్యామిలీలు ఉన్నాయని అందుకే విడిపోకూడదని బతిమాలినా రాజ్ వినలేదని, విడిపోవాల్సిందేనని పట్టుబట్టాడని చెప్పారు. అప్పటికే కొన్ని సినిమాలు వర్క్ జరుగుతున్నాయని అన్నారు. అందులో చిరంజీవి లాంటి పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయని చెప్పారు. రాజ్ స్టూడియోకు రాకపోయినా తాను మాత్రం పని ఆపలేదని అన్నారు. 90 శాతం సినిమాలు తానే పూర్తి చేసి అవి పూర్తయ్యాక స్క్రీన్ మీద రాజ్ కోటి అనే టైటిల్ వేయించానని చెప్పారు. ఆ తర్వాత నుంచీ ఎవరికి వారు సినిమాలు చేసుకున్నామని చెప్పారు. అయితే తాము విడిపోయిన విషయంలో తప్పు ఎవరిదీ కాదని, కాల ప్రభావం వలన అలా జరిగిందని, రాజ్ అంటే తనకు ఎప్పటికీ గౌరవమేనన్నారు కోటి.