Sriram Adittya: 'భలే మంచి రోజు' సినిమాతో దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య, తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ జీవితంలో జరిగిన కొని కీలక విషయాలను, మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. సినిమాల్లో ట్విస్టులు ఉన్నట్టుగానే తన జీవితంలోనూ చాలా మలుపులున్నాయన్న శ్రీరామ్.. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన తాను ఫేస్ బుక్, గూగుల్ లో పనిచేసిన సమయంలో కథలు రాసుకున్నానని చెప్పుకొచ్చారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ వచ్చానని తెలిపారు.
సాఫ్ట్ వేర్ జాబ్ నుంచి సినీ రంగానికి రావడం, తాను ప్రేమించిన అమ్మాయితో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం వంటి కీలక అంశాలు తన జీవితాన్ని మలుపు తిప్పాయని శ్రీరామ్ చెప్పారు. అంతే కాకుండా అప్పటి ప్రేమ ముచ్చట్లనూ ఆయన తెలియజేశారు. తమకు రెండు పెళ్లి రోజులున్నాయని, ఒకటి ఆర్య సమాజ్ లో జరిగిందని చెప్పారు. ఇప్పుడు నవ్వుతూ చెప్తున్నాం గానీ.. అప్పుడు మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండేదన్నారు. నెక్స్ట్ డే పెళ్లి పెట్టుకుని పవన్ కల్యాణ్ హీరోగా నటించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' బెనిఫిట్ షో చూశామంటూ శ్రీరామ్, ఆయన భార్య ప్రియాంక వెల్లడించారు.
శ్రీరామ్, ప్రియాంక ఇద్దరూ మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని వారు తెలిపారు. తనకు నచ్చని పెర్ఫ్యూమ్ కొట్టుకునేసరికి శ్రీరామ్ తో మాట్లాడానని ప్రియాంక చెప్పారు. అంతే కాదు పెళ్లికి ముందు శ్రీరామ్ ఏ అమ్మాయితో మాట్లాడాలన్నా తాను హెల్ప్ చేసేదాన్ని అని తెలిపారు. అంత సపోర్ట్ గా ఉంది కాబట్టే తాను పెళ్లిచేసుకున్నానని ఈ సందర్భంగా శ్రీరామ్ స్పష్టం చేశారు.
శ్రీరామ్ చెప్పినట్టు వారి పెళ్లి వార్త అప్పట్లో తెగ వైరలయ్యింది. వారి ప్రేమకు తమ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతే కాకుండా ప్రియాంకను తన తండ్రి వేరే అబ్బాయితో పెళ్లి ఫిక్స్ చేశారు. బంధువులకు, స్నేహితులకు కార్డ్స్ కూడా పంచారు. మరికొద్ది రోజుల్లో పెళ్లి అనగా శ్రీరామ్, ప్రియాంకను తీసుకువెళ్లి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నట్టు ఓ వార్త హల్ చల్ చేసింది. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారన్నది మాత్రం నిజం. వీరిద్దరికీ 2020లో బాబు కూడా పుట్టాడు.
ఇక శ్రీరామ్ ఆదిత్య సినీ ప్రయాణం గురించి చెప్పాలంటే.. 'శమంతకమణి', 'దేవదాస్', 'హీరో' లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం హీరో శర్వానంద్ తో ఓ సినిమా చేస్తోన్న ఆదిత్య.. స్టార్ డైరెక్టర్ అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ సమయంలో తప్ప మామూలుగా అంతగా బయట కనిపించని ఆయన.. రీసెంట్ గా తన భార్యతో కలిసి ఓ షోలో పాల్గొనడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన స్టోరీ గురించి చెప్పడం అందర్నీ ఆకర్షిస్తోంది.
Read Also : పవిత్ర బంధానికి మహేష్ ఆమోద ముద్ర, ఆమె వంట మెచ్చిన సూపర్ స్టార్ - నరేష్