దేశంలో రూ. 2 వేల నోట్ల చలామణిని ఉపసంహరించుకున్నట్లు తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం 10.8 శాతం నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్లు వెల్లడించింది.  ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2,000 నోటును మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉన్న బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఆర్బీఐ చేసిన ఈ రూ. 2 వేల నోట్ల రద్దు ప్రకటన నెట్టిట్లో బాగా వైరల్ అవుతోంది. తాజాగా విడుదలైన విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు2’ సినిమాను బేస్ చేసుకుని జోరుగా మీమ్స్ చేస్తున్నారు నెటిజన్లు.


‘బిచ్చగాడు’ రిలీజ్ సమయంలో రూ.1000, రూ.500 నోట్ల రద్దు


విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సినిమా తెలుగులో  మే 13న విడుదల అయ్యింది. ఈ సినిమాలో పెద్ద నోట్ల కారణంగా బ్లాక్ మనీ ఎలా పోగు అవుతుంది? ఒకవేళ పెద్ద నోట్లను రద్దు చేస్తే కలిగే ఉపయోగాలు ఏంటి? అనే విషయాలను ఈ సినిమాలో బిచ్చగాడు చెప్తాడు. ఈ సినిమా వచ్చిన సుమారు 5 నెలల తర్వాత అంటే నవంబర్ 8, 2016 నాడు దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు  తెలిపారు. అప్పట్లో ప్రధాని తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు గాను, ఈ నిర్ణం తీసుకున్నట్లు ప్రధాని మోదీ అప్పట్లో తెలిపారు. ఈ నిర్ణయంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ దగ్గరున్న నోట్లను మార్చుకునేందుకు ఎన్నో అవస్థలు పడ్డారు. అత్యవసర పనులకు చేతిలో డబ్బులు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. కొద్ది నెలల పాటు ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. ఆ తర్వాత పరిస్థితి చక్కబడింది.


తాజాగా ‘బిచ్చగాడు 2’ విడుదల రూ.2 వేల నోట్లు రద్దు   


ఇక తాజాగా ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ గా ‘బిచ్చగాడు 2’ విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన గంటల వ్యవధిలోనే రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్‌బీఐ ప్రకటించింది. అనుకోకుండా తీసుకున్న నిర్ణయమే అయినా, ఈ సినిమా విడుదల సమయంలోనే ఎందుకు ఇలా జరుగుతుందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు ముడిపెట్టి మీమ్స్ తో ఫన్నీ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ ‘బిచ్చగాడు 3’ వస్తే డబ్బులే రద్దు చేస్తారేమో? అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ మీమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి.  


















ఇక విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’తో దర్శకుడిగా మారాడు. ఈ చిత్రానికి డీసెంట్ రెస్పాన్స్ రావడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇందులో కావ్య థాపర్, రాధా రవి, దేవ్ గిల్, జాన్ విజయ్, యోగి బాబు, మన్సూర్ అలీ ఖాన్, వై.జి.మహేంద్రన్ కీలక పాత్రలు పోషించారు.   


Read Also: యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న 'జై శ్రీ రామ్' సాంగ్, 24 గంటల్లో రికార్డు వ్యూస్!