మనదేశంలో లక్షల మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. రోజురోజుకు వారి సంఖ్య పెరుగుతూనే ఉందే కానీ తరగడం లేదు. కేవలం మనదేశంలోనే కాదు, ప్రపంచంలో డయాబెటిస్ అతిపెద్ద ఆరోగ్య సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటమే డయాబెటిస్. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడడం వల్ల ఇలా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఆహారంలోని చక్కెరను శరీరం సరిగా ఉపయోగించుకోలేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి డయాబెటిస్ రాకుండా ముందే అడ్డుకోవాలి. వచ్చాక కొన్ని రకాల ఆహారాలు తినడం మానేయాలి. ముఖ్యంగా రెండు రకాల ఆహారాలు డయాబెటిస్ ను పెంచేస్తాయి. వాటిని దూరం పెడితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి డయాబెటిస్ సైడ్ ఎఫెక్ట్స్ లు కూడా రావు.
ప్రాసెస్ చేసిన మాంసం
పిజ్జాలు, బర్గర్లు, సాండ్‌విచ్, హాట్ డాగ్స్... వీటన్నిటిలో కూడా ప్రాసెస్ చేసిన మాంసాన్నే వాడతారు. ఈ మాంసంలో నైట్రేట్లు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. ముఖ్యంగా మధుమేహం వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. డయాబెటిస్ ఉన్నవారు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన మాంసంలో ఉండే సమ్మేళనాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్‌ను ఎక్కువ చేస్తాయి. వీటివల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువైపోతుంది. డయాబెటిస్ అదుపులో ఉండదు, కాబట్టి ఇలాంటివి తినడం మానేయండి.
వేయించిన ఆహారాలు
నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలను దూరంగా పెట్టాలి. ప్యాక్ట్ ఫుడ్‌లు ప్రాసెసింగ్ చేసిన ఆహారాల జాబితాలోకి వస్తాయి. కేకులు, బిస్కెట్లు, పేస్ట్రీలు, షుగర్‌తో చేసిన వంటకాలు, కూల్ డ్రింకులు వంటివన్నీ కూడా ఇలా వేయించిన ఆహారాల జాబితాలోకి వస్తాయి. కాబట్టి అలాంటివి తినడం తగ్గించాలి. డయాబెటిస్ ఉన్నవారు పూర్తిగా మానేయాలి. ఇవి శరీరంలో చేరాక ఆరోగ్యకరమైన ఫైబర్‌ను సూక్ష్మ పోషకాలను తొలగిస్తాయి. అలాగే ఆకలిని పెంచేస్తాయి. గ్లూకోజ్‌ను నియంత్రణలో ఉంచవు. పొట్టలో ఉన్న మంచి బాక్టీరియాకి ఎంతో హాని చేస్తాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది.
ఏమి తినాలి?
డయాబెటిస్ రానివారు అది భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు కొంత కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. ఇక డయాబెటిస్ వచ్చిన వారు దాన్ని అదుపులో ఉంచుకునేందుకు ఈ ఆహారాలను తినాలి. పుట్టగొడుగులు, బ్రకోలి, పాలకూర, చేపలు, చికెన్, టోఫు, గుడ్లు, పెరుగు, పప్పులు వంటివి అధికంగా తినాలి. జంక్ ఫుడ్ ను పూర్తిగా మానేయాలి.
Also read: కోట్లు విలువ చేసే తిమింగలం వాంతి - మనదేశంలో మాత్రం ముట్టుకుంటే చట్ట విరుద్ధం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.