తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ కథానాయకులలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) రూటే సపరేటు! కమర్షియల్ సినిమాలతో పాటు కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఓ ఇమేజ్ ఛట్రంలో బందీ కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. న్యూ ఏజ్ రోమ్ కామ్ చేయడానికి ఓకే చెప్పారు. 


మంచు మనోజ్ 'రొమాంటిక్ కామెడీ'
మంచు మనోజ్ కథానాయకుడిగా ఎల్.ఎస్. ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి మమత సమర్పణలో ఓ సినిమా రూపొందిస్తున్నారు. నిర్మాణ సంస్థలో మూడో చిత్రమిది. ఎం. శ్రీనివాసులు, డి. వేణు గోపాల్, ఎం. మమత, ముల్లపూడి రాజేశ్వరి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 20న మంచు మనోజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమాను (Manchu Manoj New Movie) అనౌన్స్ చేశారు. 


నిర్మాతలు సినిమా గురించి మాట్లాడుతూ ''రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో మంచు మనోజ్ గారి నటన, ఆయన క్యారెక్టర్ హైలైట్ అవుతాయి. దీనికి  భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. ఆయన మంచి కథ రెడీ చేశారు. త్వరలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. టాలెంటెడ్ టీంతో రూపొందిస్తున్న చిత్రమిది'' అని చెప్పారు. ఇప్పటి వరకు మనోజ్ చేసిన సినిమాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. 


Also Read : తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు బతికుంటుంది - రామ్ చ‌ర‌ణ్‌


మంచు మనోజ్ హీరోగా వెండితెరపై సందడి చేసి సుమారు ఆరేళ్ళు అవుతోంది. 'గుంటూరోడు' తర్వాత ఆయన పూర్తిస్థాయిలో హీరోగా చేసిన సినిమా ఏదీ లేదు. ఆ సినిమా తర్వాత 'ఒక్కడు మిగిలాడు'లో ప్రత్యేక పాత్ర చేస్తే... 'ఇది నా లవ్ స్టోరీ', 'ఆపరేషన్ 2019'లో అతిథి పాత్రలు చేశారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై ఫుల్ కాన్సంట్రేషన్ చేశారు. భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఎల్.ఎస్. ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న సినిమా కాకుండా 'వాట్ ద ఫిష్' అని మరో సినిమా చేస్తున్నారు. మనోజ్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నిన్న విడుదల చేశారు.


Also Read బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ



వ్యక్తిగత జీవితంలోనూ సెటిలైన మనోజ్!
సినిమా జీవితానికి వస్తే... మంచు మనోజ్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. అలాగే, వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన సెటిల్ అయ్యారు. ఈ ఏడాది మార్చి 3న భూమా నాగ మౌనిక రెడ్డిని ఆయన వివాహం చేసుకున్నారు. ఇప్పుడీ కొత్త జంట సంతోషంగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ అయ్యారు. గత ఏడాది సెప్టెంబర్ తొలి వారంలో భాగ్య నగరంలోని సీతాఫల్ మండిలోని వినాయక మండపంలో తొలిసారి మనోజ్, మౌనిక జంటగా కనిపించారు. అప్పుడే వాళ్ళ ప్రేమ విషయం బయటకు వచ్చింది. పెళ్లి గురించి ప్రశ్నించగా... వ్యక్తిగత విషయమని మనోజ్ చెప్పారు. ఆ తర్వాత కడప దర్గాను మనోజ్ సందర్శించిన సమయంలో త్వరలో కొత్త జీవితం ప్రారంభించనున్నట్టు, త్వరలో కొత్త కుటుంబంతో కడప దర్గాకు మళ్ళీ రావాలని ఉన్నట్టు ఆయన తెలిపారు. మార్చిలో మనోజ్, మౌనిక ఏడు అడుగులు వేశారు.