MS Dhoni Tamil Film:  టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఆయన భార్య సాక్షితో కలిసి నిర్మాణ సంస్థను స్థాపించారు. దానికి ‘ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌’ అనే పేరు పెట్టారు. తాజాగా ఈ నిర్మాణ సంస్థ రూపొందిస్తున్న తొలి సినిమాకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించారు. సినిమా పేరుతో పాటు హీరో, హీరోయిన్, ఇతర నటీనటులను పరిచయం చేశారు. ఎల్జీఎం (లెట్స్ గెట్ మారీడ్) అనే టైటిల్ తో సినిమా రూపొందనున్నట్లు ప్రకటించారు. 


ధోనీ ఎంటర్టైన్ మెంట్స్ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న మొదటి సినిమా ఎల్జీఎం (లెట్స్ గెట్ మారీడ్). దీనిలో 'జెర్సీ' ఫేం హరీష్ కల్యాణ్, 'లవ్ టుడే' ఫేం ఇవానా జంటగా నటించనున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిన్న జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలను ధోనీ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమా నాయకానాయకులు, నదియా, సాక్షి సింగ్ ధోనీ తదితరులు ఉన్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. 


అదే ధోనీ ఎంటర్ టైన్ మెంట్ లక్ష్యం


నిన్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.  నూతన దర్శకుడు రమేష్ తమిళమణి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నదియా, యోగి బాబు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే తమ నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలు ఎలా ఉండాలి అనుకుంటున్నారో ధోని సతీమణి సాక్షి వెల్లడించారు. మంచి కథల ద్వారా దేశం  నలుమూలలలో వున్న ప్రేక్షకులకు చేరువయ్యేలా సినిమాలు తీయడమే ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లక్ష్యమన్నారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ‘ఎల్‌జీఎం’ సినిమా రూపొందుతోందని ఆమె వివరించారు.  


ఐపీఎల్ 2023కి రెడీ అవుతున్న ధోని


భారత క్రికెట్ దిగ్గజం ధోని  రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై బాగా ఫోకస్ పెట్టాడు. మంచి ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ధోనీ ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్‌ కు నాయకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన కేవలం IPLలోనే ఆడుతున్నారు. రాబోయే సీజన్ కోసం ఫిట్ నెస్ సాధించేందుకు రెడీ అవుతున్నారు. రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌ లో ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్నారు.   


ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా?


2011 ప్రపంచ కప్, 2007 T20 ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో సహా అనేక ప్రతిష్టాత్మక విజయాలను భారత్‌కు అందించాడు ధోని. ఆయన కెప్టెన్సీలో భారత్ అత్యున్నత జట్టుగా రూపొందింది. ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందుకుంది. అటు ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అవుతుందా? తదుపరి సీజన్‌ లోనూ ఆడతాడా? అనే విషయం రాబోయే ప్రదర్శనను బట్టి అంచనా వేసే అవకాశం ఉంటుంది.  అందుకే ఈ సీజన్ లో పూర్తి స్థాయితో అద్భుత ఆటతీరును కనబర్చేందుకు ధోని సిద్ధం అవుతున్నారు. భవిష్యత్ ఐపీఎస్ సీజన్ల మీద ఈ ఆటతీరు ఆధారపడి ఉండటంతో మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉంది.