మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) తమ్ముడు రఘు కొడుకు మాధవ్ భూపతిరాజు (Maadhav Bhupathiraju) తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు 'మిస్టర్ ఇడియట్' (Mr Idiot Movie) టైటిల్ ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్, ప్రీ లుక్ విడుదల చేశారు. 


టైటిల్ పోస్టర్ విడుదల చేసిన రవితేజ
'మిస్టర్ ఇడియట్' టైటిల్ పోస్టర్ రవితేజ చేతుల మీదుగా విడుదలైంది. ప్రీ లుక్ విడుదల అనంతరం చిత్ర బృందానికి మాస్ మహారాజా అభినందనలు చెప్పారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ''హీరోగా నా కెరీర్‌లో 'ఇడియ‌ట్'కు ఎంత ప్రాముఖ్య‌త ఉందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు మా ర‌ఘు కొడుకు మాధ‌వ్ 'మిస్టర్ ఇడియ‌ట్‌'గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. నాలాగే త‌న‌ కెరీర్‌లో కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను'' అని రవితేజ తెలిపారు. 


'పెళ్లి సందD' దర్శకురాలు గౌరీతో... 
జేజేఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో రూపొందుతున్న 'మిస్టర్ ఇడియట్' చిత్రానికి 'పెళ్లి సందD' ఫేమ్ గౌరీ రోణంకి దర్శకురాలు. జేజేఆర్ రవిచంద్ నిర్మాత. ఈ చిత్రంలో సిమ్రాన్ శర్మ హీరోయిన్. 


టైటిల్ చూసి హ్యాపీగా ఫీలైన రవితేజ
'మిస్టర్ ఇడియట్' టైటిల్ చూసి రవితేజ చాలా హ్యాపీగా ఫీలయ్యారని చిత్ర నిర్మాత జేజేఆర్ రవిచంద్ తెలిపారు. ఆయన చేతుల మీదుగా ప్రీ లుక్, టైటిల్ పోస్టర్ విడుదల కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''ఈ సినిమా చిత్రీకరణ అంతా నెలాఖరుకు పూర్తి అవుతుంది. చిత్ర దర్శకురాలు గౌరీ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలతో అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తున్నాం. నవంబర్ నెలలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సంద‌ర్భంగా ర‌వితేజ‌గారికి, నా వెనుకే ఉండి నన్ను ఎంతగానో ప్రోత్స‌హిస్తున్న చ‌ద‌ల‌వాడ శ్రీనివాస్‌ గారికి థాంక్స్‌'' అని చెప్పారు. 


Also Read : 'రంగబలి' దర్శకుడి జోకులకు భయపడిన సుమ - జనాలు అపార్థం చేసుకుంటే?


'మిస్టర్ ఇడియట్' ప్రీ లుక్ చూస్తే... ఓ అమ్మాయికి లిప్ కిస్ ఇస్తున్న హీరో, మరో అమ్మాయి వెళ్ళకుండా చేతితో పట్టుకోవడం గమనించవచ్చు. ఇదొక న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామా అని యూనిట్ వర్గాలు తెలిపాయి. 






తనకు ఈ సినిమా సెకండ్ డెబ్యూ అని సినిమా ప్రారంభోత్సవంలో దర్శకురాలు గౌరి రోణంకి తెలిపారు. తనకు అవకాశం ఇవ్వడంతో పాటు హీరో మాధవ్ మీద నమ్మకం ఉంచినందుకు నిర్మాతకు థ్యాంక్స్ చెప్పారు. ఇది యూత్ ఫుల్, కలర్ ఫుల్ సినిమా అని తెలిపారు. టైటిల్ విడుదల సందర్భంగా ''మరో ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. అందరి ఆశీర్వాదాలు లభిస్తాయని ఆశిస్తున్నా'' అని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రామ్, కళా దర్శకత్వం : కిరణ్ కుమార్ మన్నె, కూర్పు : విప్లవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, నిర్మాత : జేజేఆర్ రవిచంద్, రచన & దర్శకత్వం : గౌరి రోణంకి.


Also Read ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎన్టీఆర్ - అంతా విదేశాల్లోనే?




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial