'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) స్టార్ట్ చేసినప్పుడు దానిని వర్కింగ్ టైటిల్ అని మాత్రమే అనుకున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీ రామారావు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ముగ్గురి పేర్లలో 'ఆర్' అక్షరం తీసుకుని 'ఆర్ఆర్ఆర్' అని చెప్పారు. ప్రేక్షకుల్లోకి ట్రిపుల్ ఆర్ అనేది బలంగా వెళ్లడంతో చివరకు దానిని టైటిల్ కింద ఖరారు చేశారు. అప్పుడు 'ఆర్ఆర్ఆర్' అంటే రౌద్రం రణం రుధిరం అని నిర్వచనం ఇచ్చారు.


ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' అనేది ఒక సినిమా కాదు... ఎమోషన్! ఇండియన్స్ ఎమోషన్! భారతీయ చిత్రసీమ గర్వించేలా చేసిన సినిమా. సినిమాలోని 'నాటు నాటు...' (Naatu Naatu Song) పాటకు 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో ఆస్కార్ (Oscars 2023 Winners) రావడంతో భారతీయులు అందరూ గర్వపడుతున్నారు. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ సైతం! ఆస్కార్ వేదికపై తెలుగు పాట వినిపించడం, ఆ పాటకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సినిమా ప్రముఖులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం ఎప్పటికీ మర్చిపోలేని క్షణాలు. ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు కీరవాణి ఇచ్చిన నిర్వచనం ఏమిటో తెలుసా?


రిటర్న్ హోమ్...
రిసీవ్ యువర్ లవ్...
రిజాయిస్ - ఇదీ 'ఆర్ఆర్ఆర్'
ఆస్కార్ విజయం వెనుక దేశమంతా ఇచ్చిన మద్దతు ఎంతో ఉందని కీరవాణి (MM Keeravani On RRR Oscar Win) తెలిపారు. ''ప్రియమైన జనని... మేం అట్లాంటిక్ సముద్రం దాటి వెళ్లి చరిత్ర సృష్టించేలా చేసింది మీ మద్దతు. నాకు 'ఆర్ఆర్ఆర్' సర్వసం. అయితే, ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్'కు అర్థం ఏమిటంటే... రిటర్న్ హోమ్ (దేశానికి తిరిగి రావడం), రిసీవ్ యువర్ లవ్ (మీ ప్రేమను స్వీకరించడం), రిజాయిస్ (సంతోషంగా ఉండటం)'' అని కీరవాణి ట్వీట్ చేశారు. ఆస్కార్ వరించిన తర్వాత శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు.


Also Read రాజమౌళి అవార్డులు మీద ఎప్పుడూ దృష్టి పెట్టలేదట 










'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడంతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి వచ్చిన ప్రశంసలు, ప్రశంసించిన వారి జాబితా బోలెడు ఉంది. అయితే, ఒక్కరి ప్రశంస మాత్రం కీరవాణి కళ్ళ వెంట ఆనంద భాష్పాలు వచ్చేలా చేసింది. ఇంతకీ, ఆయన ఎవరో తెలుసా? ఆయన అభిమాన సంగీత దర్శకుడు. 


ఆస్కార్ వేదికపై కీరవాణి స్పీచ్ గుర్తు ఉందా?
ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న తర్వాత కీరవాణి మాట్లాడిన మాటలు గుర్తు ఉన్నాయా? తాను కార్పెంటర్స్ సంగీతం వింటూ పెరిగానని, ఈ రోజు ఆస్కార్స్ (Oscars Trophy)తో ఉన్నానని పెద్దన్న పేర్కొన్నారు. కార్పెంటర్ పాట పాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ రిచర్డ్ కార్పెంటర్ నుంచి కీరవాణికి ప్రశంస వచ్చింది. 


ఆస్కార్ అందుకున్న 'నాటు నాటు...' రచయిత చంద్రబోస్, కీరవాణికి రిచర్డ్ కార్పెంటర్, ఆయన పిల్లలు శుభాకంక్షాలు చెప్పారు. అదీ పాట రూపంలో! ''ఇది నేను అసలు ఊహించలేదు. ఆనంద భాష్పాలు వస్తున్నాయి. ఈ విశ్వంలోని అత్యంత అందమైన, అద్భుతమైన బహుమతి ఇది'' అని కీరవాణి ఇంస్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. అదీ సంగతి!


Also Read శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే