మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఈ సంవత్సరం చిరంజీవికి అందించనున్నట్లు ప్రకటించారు. 2013లో భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అవార్డును అందించడం ప్రారంభించారు.


వహీదా రెహమాన్ ఈ అవార్డును మొదటిసారి అందుకోగా... ఆ తర్వాత రజనీకాంత్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రమణ్యం, అమితాబ్ బచ్చన్, సలీం ఖాన్, బిశ్వజిత్ ఛటర్జీ, హేమ మాలిని, ప్రసూన్ జోషి వంటి దిగ్గజాలకు ఈ అవార్డు దక్కింది. ఈ సంవత్సరం చిరంజీవికి ఈ అవార్డును అందించనున్నారు. నాలుగు దశాబ్దాల పైచిలుకు నుంచి సాగుతున్న అద్భుతమైన కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించినందుకు చిరంజీవికి ఈ అవార్డు అందించారు.


ప్రస్తుతం చిరంజీవి రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో ‘వాల్తేరు వీరయ్య’ 2023 సంక్రాంతికి విడుదల కానుండగా, ‘భోళా శంకర్’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ కూడా కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ‘భోళా శంకర్‌’ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.