పోతారు.. మొత్తం పోతారు. అలాంటి అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఇది అలాంటిలాంటి అనౌన్స్‌మెంట్ కాదు. బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్. ఈ మాట అన్నది ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. అవును ఆయన సమర్పణలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. దర్శకుడెవరో తెలుసా? నానితో ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తీసిన శ్రీకాంత్ ఓదెల. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి స్టార్ దర్శకులతో కాకుండా యంగ్ దర్శకులతో సినిమాలు చేస్తున్న విషయం తెలియంది కాదు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌ని అందుకున్నారు చిరు. ప్రస్తుతం కుర్ర దర్శకుడు వశిష్ఠతో ‘విశ్వంభర’ చిత్రం చేస్తున్నారు. ఇప్పుడు మరో కుర్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు తనని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చారు మెగాస్టార్.
చిరుతో ‘విశ్వంభర’ చేస్తున్న వశిష్ఠ మాత్రమే కాదు.. ఈ శ్రీకాంత్ ఓదెల కూడా డై హార్డ్ మెగాభిమాని. ‘దసరా’ మూవీ ప్రమోషన్స్‌లో కూడా మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంత అభిమానమో శ్రీకాంత్ పలు మార్లు చెప్పి ఉన్నారు. ఇప్పుడు తన అభిమాన నటుడిని డైరెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది మాత్రం నేచురల్ స్టార్ నానినే. మొదటి సినిమా ‘దసరా’ తర్వాత మరోసారి నానినే శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నారు. ‘ది పారడైజ్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సినిమా పూర్తవగానే మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల సినిమా ప్రారంభం అవుతుందని మేకర్స్ ప్రకటించారు.
Also Read: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
శ్రీకాంత్ చెప్పిన కథ విన్న నాని.. వెంటనే మెగాస్టార్‌తో ఈ ప్రాజెక్ట్‌ని సెట్ చేయడమే కాదు.. తన యునానిమస్ ప్రొడక్షన్స్‌లో సమర్పిస్తున్నాడు కూడా. ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘ది పారడైజ్’ నిర్మాత, ఎస్ఎల్‌వి సినిమాస్ అధినేత సుధాకర్ చెరుకూరితో కలిసి నాని ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. అందుకే ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి ముందుగానే నాని ఎక్స్ వేదికగా మార్నింగ్ నుండి హడావుడి చేస్తూ వచ్చారు. ‘ఈ అనౌన్స్‌మెంట్ నా సినిమాకు సంబంధించినది కాదు.. కానీ నాకు ఇది బిగ్గెస్ న్యూస్ ఆఫ్ ది ఇయర్’ అని చిన్న హింట్ ఇచ్చిన నాని.. ఆ తర్వాత మరో ట్వీట్‌లో మూవీని అనౌన్స్ చేశారు.
ఆయన స్ఫూర్తితోనే నేను పెరిగాను.
ప్రతిసారి ఆయన కోసం గంటల తరబడి లైన్‌లో నిలబడ్డాను.
ఈ క్రమంలో నా సైకిల్ కూడా కోల్పోయాను.
ఆయనతోనే సెలబ్రేషన్స్ చేసుకున్నాను.
ఇప్పుడాయనని సమర్పిస్తున్నాను.
ఇది ఫుల్ సర్కిల్.
ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న మెగాస్టార్ మ్యాడ్‌నెస్‌ని రివీల్ చేస్తున్నాను అంటూ.. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని నాని పోస్ట్ చేశారు. నాని పోస్ట్‌ని రీ ట్వీట్ చేసిన మెగాస్టార్.. ‘మై డియర్ నాని.. ఈ కాంబినేషన్‌తో థ్రిల్ అవడమే కాదు.. ఎప్పుడెప్పుడా అని ఎంతగానో వేచి చూస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. అంతే, కాసేపట్లోనే ఈ వార్త సోషల్ మీడియాను దావానలంలా ఆవహించేసింది. ఇక అనౌన్స్‌మెంట్ పోస్టర్ అయితే.. మెగా ఫ్యాన్స్‌నే కాకుండా ప్రేక్షకలోకాన్ని సైతం షాక్‌కు గురి చేసింది. ఎరుపు రంగు థీమ్‌తో హింసను ప్రేరేపిస్తున్న ఈ పోస్టర్‌లో ఇచ్చిన ట్యాగ్ అయితే ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేస్తోంది. ‘అతను హింసలోనే తనకు కావాల్సిన శాంతిని కనుగొంటాడు’ అనే ట్యాగ్ ఈ సినిమా స్వరూపాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. బ్లాక్‌బస్టర్ వైబ్స్‌కి దారి చూపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ ప్రకటించారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?