తెలంగాణ హైకోర్టులో 'పుష్ప 2' చిత్రానికి వ్యతిరేకంగా ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ఆ కేసులో చిత్ర బృందానికి ఊరట లభించింది. అంతే కాదు... ఇప్పుడీ సినిమా విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేవు. లైన్ క్లియర్ అయిందని చెప్పాలి అసలు కేసు ఏమిటి? ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...
చివరి నిమిషంలో రిలీజ్ ఆపలేం!
'పుష్ప 2: ది రూల్' సినిమా టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. దాని ప్రకారం విడుదలకు ముందు రోజున వేసే పెయిడ్ ప్రీమియర్లకు టికెట్ రేటు మీద 800 పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. విడుదల తర్వాత నుంచి దశలవారీగా ఏఏ రోజులు ఎంతెంత రేటు పెంచి అమ్ముకోవచ్చు అనేది కూడా అందులో చెప్పింది.
సినిమా టికెట్ రేట్లు పెంచడంతో సామాన్యులకు, మరీ ముఖ్యంగా అభిమానులకు తొలి వారం సినిమా చూసే అవకాశం దూరమవుతుందని, అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేయడానికి అడ్డుకోవాలని తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అతను దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు... సినిమా విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో చివరి నిమిషంలో విడుదలను ఆపలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. దాంతో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.
అయితే, ఓ ట్విస్ట్ ఉంది. బెనిఫిట్ షో ద్వారా కలెక్షన్లను నిర్మాత ఖాతాలో వేయకుండా ఎస్క్రో అకౌంటులో పెట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి వాదించారు. దీనిపై రెండు వారాల సమయం కావాలని మైత్రి మూవీ మేకర్స్ న్యాయవాది సిద్దార్థ్ కోరగా... రెండు వారాలు అంటే బెనిఫిట్ షోలు పడతాయని, అప్పటికి సినిమా కూడా విడుదల అయిపోతుందని శ్రీనివాస్ రెడ్డి వాదించారు. దాంతో ఆ విషయం మీద నిర్ణయం తీసుకోవడం కోసం సాయంత్రానికి వాయిదా వేశారు. అప్పుడు తుది నిర్ణయం తెలియజేస్తామని పేర్కొన్నారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?
ఏపీలోనూ పెరిగిన పుష్ప టికెట్ రేట్లు
ఒక తెలంగాణలో మాత్రమే కాదు... మరో తెలుగు రాష్ట్రం ఏపీలోనూ 'పుష్ప 2' టికెట్ రేట్లు పెరిగాయి. తెలంగాణలో ఎంత అయితే పెంచారో... అటు ఏపీలోనూ అంతే పెంచుతూ జీవో విడుదల చేశారు. తమ సినిమా టికెట్ రేట్లు పెంచడంతో పాటు సినిమా పరిశ్రమ అభివృద్ధికి పాటుపడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... ఇద్దరికీ థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం థాంక్స్ ఆయన చెప్పారు.
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?