తమిళ హీరో సూర్య (Suriya) నుంచి 2019 లో ‘కాప్పాన్’ (తెలుగులో ‘బందోబస్త్), ‘ఎన్జీకె’ సినిమాలొచ్చాయి. ఫ్లాప్ అయ్యాయి. ఓటీటీల్లో ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వెండితెరపై ‘కంగువ’గా కనిపించారు. ‘శౌర్యం’ ఫేమ్ శివ (Siva) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కంగువ’ సూర్య కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా గత నవంబర్ లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (‘యానిమల్’ ఫేమ్) విలన్ గా నటించిన ఈ సినిమా ఈ వారమే ఓటీటీలోకి రానుంది.
డిసెంబర్ 8 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘కంగువ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందని టాక్. అమెజాన్ ప్రైమ్ ‘కంగువ’ను దాదాపు వంద కోట్లకు కొనుగోలు చేశారని సమాచారం. తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాష వంటి అంతర్జాతీయ భాషల్లో అందుబాటులో ఉండనుంది. డిసెంబర్ 8వ తేదీ నుంచి ‘కంగువ’ను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో అనౌన్స్ చేసింది. ముందుగా, ఈ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా ఓటీటీల్లోకి రిలీజ్ చేద్దామని నిర్మాతలు భావించారు. అయితే ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో అనుకున్నతేదీ కంటే ముందే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్.
‘కంగువ’ కథలోకి వెళితే...
‘మగధీర’ వంటి సినిమాల తరహాలోనే పూర్వ జన్మల కథాంశంతో రూపొందిన ‘కంగువ’, ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. ఫ్రాన్సిస్ (సూర్య) అనే బౌంటీ హంటర్ ని వెతుక్కుంటూ జెటా అనే పిల్లాడు గోవా వస్తాడు. అతను సాధారణమైన మనిషి కాదు. సూపర్ పవర్స్ కలిగి ఉంటాడు కూడా. జెటా ఓ ల్యాబ్ నుంచి తప్పించుకు వస్తాడు. అతణ్ణి వెతుక్కుంటూ విలన్లూ గోవాలోకి ఎంటర్ అవుతారు. జెటాను చూశాక, ఫ్రాన్సిస్ కి తన గత జన్మ తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. ఇంతకీ ఫ్రాన్సిస్, జెటా మధ్య లింక్ ఏంటి? అన్నది ‘కంగువ’ కథ. వెయ్యేళ్ల క్రితం నాటి రాతి యుగంలోని ఓ తెగ యోధుడిగా ‘కంగువ’గా నటించారు సూర్య. అయితే, ఆ యుగానికి, ఈ కాలానికి మధ్య ఉన్న కనెక్షన్ ను ఎస్టాబ్లిష్ చేయలేక పోయారు దర్శకుడు శివ.
Also Read: నా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్
విజువల్ వండర్ మాత్రమే...
కంగువ పాత్ర కాలంలోని సన్నివేశాల్లో ఎమోషన్ పూర్తిగా కొరవడింది. విజువల్ గా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించారు గానీ కథా కథనాలను ఆసక్తి కరంగా మలచడంలో దర్శకుడు విఫలమయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ నేపథ్య సంగీతం మీద విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. ఇక, సినిమా ఫస్టాఫ్ లో ఫ్రాన్సిస్ (సూర్య), అతని గర్ల్ ఫ్రెండ్ ఏంజెలా (దిశాపటాని) పాత్రల పై చిత్రీకరించిన సన్నివేశాలు పేలవంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దాంతో వాటిని ట్రిమ్ చేసింది చిత్ర యూనిట్. మొదటి షో తర్వాత సినిమా గురించి సోషల్ మీడియాలో బలంగా నెగటివిటీ వెళిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ‘కంగువ 2’ ను కూడా ప్రకటించారు దర్శక,నిర్మాతలు. ప్రస్తుతం ‘జిగర్ తాండ, ‘పేట’, ‘మహాన్’ సినిమాల ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోని ఓ సినిమా చేస్తున్నారు సూర్య. అలానే నటుడు ఆర్.జె. బాలాజి తెరకెక్కించనున్న ఓ సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటి తర్వాతే ‘కంగువ’ రెండో భాగం ఉంటుందని టాక్. ఈ లోగా అజిత్ హీరోగా శివ ఓ సినిమా రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?