Sai Dharam Tej: సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారని, సినిమా వాళ్లకి నమ్మకాలు కాస్త ఎక్కువే అని అంటుంటారు. న్యూమరాలజీ గ్రాఫాలజీ అంటూ పేర్లు మార్చుకోవడమో, లేదా అదృష్టం కలిసి రావడం లేదని నేమ్ లోకి ఇంగ్లీష్ అక్షరాల స్పెల్లింగ్ మార్చుకోవడమో చేస్తుంటారు. కానీ ఇప్పుడు మెగా హీరో ఒకరు తన తల్లి మీద ప్రేమతో పేరు మార్చుకున్నారు. తన పేరుకు అమ్మ పేరును జత చేసుకున్నారు.


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా 2014లో 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. పదేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకుని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే 2019లో తన పేరులోని 'ధరమ్' ను తప్పించి, 'సాయి తేజ్' గా మార్చుకున్నారు. అప్పటి నుంచి అదే పేరుతో చలామణి అవుతున్నారు. రెండేళ్ల క్రితం యాక్సిడెంట్ కి గురై కోలుకున్న మెగా హీరో.. ఇప్పుడు మరోసారి తన పేరును మార్చుకున్నారు. ఇక నుంచి తన పేరు 'సాయి దుర్గ తేజ్' అని ప్రకటించారు.


సాయి తేజ్, కలర్స్ స్వాతి కలిసి చేసిన 'సత్య' అనే మ్యూజిక్ వీడియోని మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ సందర్భంగానే సాయి తేజ్ తన పేరును మార్చుకుంటున్నట్లు తెలిపారు. తన తల్లి దుర్గ పేరును యాడ్ చేసుకుంటూ 'సాయి దుర్గ తేజ్' అని ప్రకటించారు. తన తండ్రి పేరు ఎలాగో ఇంటి పేరుతో తనకు సంక్రమిస్తుంది, కానీ తన అమ్మ కూడా ఎప్పుడూ తనతో పాటుగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెగా మేనల్లుడు చెప్పారు. 


'సాయి తేజ్' నుంచి 'సాయి దర్గ తేజ్' గా.. 
సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. "నా లైఫ్ లో ముగ్గురు సత్యలు ఉన్నారు. మా అమ్మ, పిన్ని, అంజనాదేవి. వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకొని పెంచారు. వాళ్ళని హ్యాపీగా ఉంచడం తప్ప నేను ఇంకేమీ చేయలేను. నేను ఎదిగితేనే వాళ్ళకి హ్యాపీ. ఎప్పట్నుంచో మా అమ్మ పేరు మీద ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నాను. అది 'సత్య' తో మొదలైంది. మా అమ్మ పేరు మీద విజయ దుర్గ ప్రొడక్షన్స్ మొదలుపెట్టాను. అలాగే ఇవాళ్టి నుంచి నా పేరులో మా అమ్మ గారి పేరు యాడ్ చేసుకున్నాను. సర్ నేమ్ కింద మా నాన్న గారి పేరు ఎలాగూ ఉంటుంది. మా అమ్మ కూడా నా తోటి ఉండాలి. అందుకే మా అమ్మ పేరు యాడ్ చేసుకొని నా పేరుని 'సాయి దుర్గ తేజ్' గా మార్చుకున్నాను" అని చెప్పుకొచ్చారు. మెగా మేనల్లుడికి తన తల్లి మీద ఉన్న ప్రేమకు మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


'రిపబ్లిక్' మూవీ విడుదలకు ముందు సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ కి గురయ్యారు. దాన్నుంచి కోలుకున్న తర్వాత 'విరూపాక్ష' సినిమా షూటింగ్ పూర్తి చేశారు. గతేడాది సమ్మర్ లో రిలీజైన ఈ మిస్టిక్ థ్రిల్లర్ బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీని తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి 'బ్రో' సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే సంపత్ నంది దర్శకత్వంలో 'గంజా శంకర్' అనే మూవీని అనౌన్స్ చేశారు. ఈ సినిమా ఆగిపోయిందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై వివరణ అడగ్గా.. ఆ విషయం మీడియాలోనే చూసి తెలుసుకున్నానని, ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందనేది కూడా మీరే చెప్పాలని సాయి తేజ్ సెటైర్లు వేశారు.


Also Read: కత్తి పట్టిన అంజలి - ఉమెన్స్ డే స్పెషల్ గా ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ నుంచి లేడీ గ్యాంగ్ పోస్టర్!