Game Changer: దక్షిణాది అగ్ర దర్శకులలో శంకర్ షణ్ముగం ఒకరు. భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో సినిమాలను తెరకెక్కిస్తూ, ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా ఆశించిన సక్సెస్ సాధించలేకపోతున్నారు. 'రోబో' తర్వాత ఆ రేంజ్ లో హిట్టైన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఈ నేపథ్యంలో దాదాపు ఆరేళ్ళ తర్వాత శంకర్ నుంచి వచ్చిన 'ఇండియన్ 2' చిత్రంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని అభిమానులు భావించారు. కానీ ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో ఆయన రాబోయే 'గేమ్ ఛేంజర్' సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
1996లో లోకనాయకుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'భారతీయుడు' సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం 'భారతీయుడు 2'. ఈ సినిమా ఆగిపోవడంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో 'గేమ్ ఛేంజర్' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో రెండు చిత్రాలను టేకప్ చెయ్యాల్సి వచ్చింది. 'ఇండియన్ 2' మూవీ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని ఎట్టకేలకు గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. శంకర్ రైటింగ్, టేకింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ ప్రభావం ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' సినిమాపై పడుతుందేమో అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా శంకర్ తలపెట్టిన సినిమా 'గేమ్ ఛేంజర్'. ఇదొక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అవ్వాల్సింది. 'భారతీయుడు 2' కారణంగా లేట్ అవుతూ వచ్చింది. ఇది హిట్ అయ్యుంటే ఆటోమేటిక్ గా 'గేమ్ ఛేంజర్'పై అంచనాలు రెట్టింపు అయ్యేవి. కానీ అలా జరగలేదు. ఇదే ఇప్పుడు అభిమానులందరినీ కలవరపెడుతోంది. కానీ ఈ విషయంలో మెగాభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది శంకర్ సినిమా మాత్రమే కాదు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ కూడా అని మూవీ విశ్లేషకులు అంటున్నారు.
RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత రామ్ చరణ్ నుంచి రాబోతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాపై ట్రేడ్ లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరోవైపు ఈ చిత్రానికి దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బ్యాక్ బోన్ గా ఉన్నారు. దిల్ రాజు తన సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కథా కథనాల దగ్గర నుంచి సినిమాని జనాల్లోకి తీసుకొచ్చే వరకూ అంతా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు. ప్రతీ రూపాయి లెక్కలేసుకునే ఖర్చు చేస్తారు. అలాంటిది ఇప్ఫుడు బడ్జెట్ కు ఏమాత్రం వెనకాడకుండా కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్నారంటే ఈ మూవీలో కంటెంట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
'గేమ్ ఛేంజర్' కథ శంకర్ ఆలోచనల నుంచి పుట్టింది కాదు. తమిళ విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్టోరీ లైన్ ఇస్తే, దాన్ని శంకర్ తనదైన శైలిలో స్క్రీన్ ప్లే రాసుకున్నారు. 'ఇండియన్ 2'లో దర్శకుడి పనితనంపై విమర్శలు వచ్చాయంటే.. దానికి కారణం రామ్ చరణ్ చిత్రంపై ఎక్కువ ఫోకస్ చేయడమే అని కూడా అనుకోవచ్చు. డిజాస్టర్ టాక్ తోనే మూడు రోజుల్లో 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించారంటే, ఇక్కడ శంకర్ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. రామ్ చరణ్ సినిమా నుంచి ఏదైనా సరైన ప్రమోషనల్ మెటీరియల్ వదిలితే ఆయన చుట్టూ ఉన్న నెగెటివిటీ అంతా పోయే అవకాశం ఉంది. కాబట్టి మెగా ఫ్యాన్స్ ఈ మూవీ విషయంలో పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పాలి.
Also Read: 'హను-మాన్' నిర్మాతల చేతికి 'డబుల్ ఇస్మార్ట్'