May 9th history in Tollywood: టాలీవుడ్ సినీ పంచాంగంలో మే 9వ తేదీకి ఘనమైన చరిత్ర ఉంది. మన సినీ ప్రముఖులంతా సమ్మర్ సీజన్ లో దీన్ని చాలా లక్కీ డేగా భావిస్తుంటారు. ఈ తారీఖున థియేటర్లలో విడుదలైన సినిమాలు కచ్చితంగా ఘన విజయం సాధిస్తాయని నమ్ముతుంటారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తూ గతంలో ఆ డేట్ కి రిలీజ్ చేసిన సినిమాలు చాలా వరకూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందుకే మన స్టార్ హీరోలంతా తమ చిత్రాలు ఇదే తేదీకి తమ చిత్రాలను తీసుకురావాలని కోరుకుంటారు. దర్శక నిర్మాతలు రిలీజ్ స్లాట్ కోసం పోటీ పడుతుంటారు. మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. 


జగదేక వీరుడు అతిలోక సుందరి:


మెగాస్టార్ చిరంజీవి, అలనాటి అందాల నటి శ్రీదేవి కాంబోలో వచ్చిన వెండితెర అద్భుతం 'జగదేక వీరుడు అతిలోక సుందరి'. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. దీనికి యండమూరి వీరేంద్రనాథ్ కథ అందించారు. ఇది 1990 మే 9న థియేటర్లలో రిలీజయింది. తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ను సైతం లెక్కచేయకుండా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాదు, ఫాంటసీ జోనర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఇళయరాజా సంగీతం ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఈ సినిమా వచ్చి నేటితో 34 ఏళ్ళు పూర్తయింది. దీనికి సీక్వెల్ తియ్యాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


గ్యాంగ్ లీడర్:


చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి హీరో హీరోయిన్లుగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. మాగంటి రవీంద్రనాథ్ నిర్మించిన ఈ సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ బప్పీ లహరి సంగీతం సమకూర్చారు. 1991 మే 9న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఇది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రత్యేకంగా ప్రదర్శించబడింది. చిరు హీరోగా ఇదే చిత్రాన్ని 'ఆజ్ కా గూండా రాజ్' (1992) పేరుతో హిందీలో రీమేక్ చేసారు. కానీ నార్త్ లో ఆశించిన విజయాన్ని అందుకోలేదు.


భారతీయుడు:


విశ్వనటుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ షణ్ముగం కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ 'ఇండియన్'. దీన్ని 'భారతీయుడు' పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి, 1996 మే 9న రిలీజ్ చేసారు. మన దేశంలోని అవినీతి, లంచగొండితనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రిటైర్డ్ ఫ్రీడమ్ ఫైటర్ కథాంశంతో తీసిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. దీంట్లో కమల్ డ్యూయెల్ రోల్ ప్లే చెయ్యగా.. మనీషా కోయిరాలా, ఊర్మిళ, సుకన్య మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. దాదాపు 28 ఏళ్ళ తర్వాత దీనికి సీక్వెల్ గా ఇప్పుడు 'భారతీయుడు 2' సినిమా వస్తోంది. ఇది జూలైలో విడుదల కాబోతోంది.






Also Read: HBD VIJAY DEVERAKONDA: విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఆగిపోయిన సినిమాలు ఎన్నో తెలుసా?


ప్రేమించుకుందాం.. రా:


విక్టరీ వెంకటేష్, అంజలా జవేరి జంటగా జయంత్ సి. ఫరాన్జీ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ మూవీ 'ప్రేమించుకుందాం.. రా'. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఫ్యాక్షనిజాన్ని తెర మీదకు తీసుకొచ్చిన మొదటి సినిమా ఇది. దీని తర్వాత సీమ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి. 1997 మే 9న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. సురేష్ బాబు నిర్మించిన ఈ మూవీకి మహేశ్ మహదేవన్ సంగీతం సమకూర్చారు. 


సంతోషం:
కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా.. గ్రేసీ సింగ్, శ్రియా శరన్ హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా 'సంతోషం'. కేఎల్ నారాయణ నిర్మించిన ఈ సినిమాతో దశరథ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సరిగ్గా 22 ఏళ్ళ క్రిందట 2002 మే 9న ఈ మూవీ రిలీజయింది. ఇది బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడమే కాదు, అప్పటి వరకూ ప్లాపుల్లో ఉన్న నాగ్ కెరీర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆర్ఫీ పట్నాయక్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 


మహానటి:


అలనాటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ లో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించింది. దుల్కర్ సల్మాన్, సమంత రూత్ ప్రభు, విజయ్ దేవరకొండ కీలక పాత్రల్లో నటించగా.. అక్కినేని నాగచైతన్య గెస్ట్ రోల్ లో మెరిశారు. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై ప్రియాంకా దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. 2018 మే 9న విడుదలైన ఈ సినిమా ఘన విజయం అందుకుంది. ఉత్తమ నటితో సహా రెండు నేషనల్ ఫిలిం అవార్డులు సాధించింది. 


మహర్షి:


సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబోలో రూపొందిన చిత్రం 'మహర్షి'. ఇది మహేశ్ కెరీర్ లో మైలురాయి 25వ చిత్రం. వైజయంతీ మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 2019 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్టైంది. రెండు నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా గెలుచుకుంది. 






ఇలా మే 9న వచ్చిన అనేక చిత్రాలు విజయవంతం అయ్యాయి. నిర్మాత అశ్వినీదత్ ఈ తేదీని తన బ్యానర్ కు సెంటిమెంట్ గా భావిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'కంత్రి' మినహా, ఆ డేట్ కి వచ్చిన 'వైజయంతీ మూవీస్' సినిమాలన్నీ హిట్ అయ్యాయి. వీటికి సంబంధించిన విశేషాలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD' చిత్రాన్ని కూడా తమకు కలిసొచ్చిన అదే రోజున రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఇకపోతే ఈ రోజున రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి లాంటి స్టార్స్ తమ పుట్టిన రోజులను జరుపుకుంటున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే 'మే 9'ని సినీ అభిమానులు కూడా ప్రత్యేకంగా భావిస్తారు. 






Also Read: 'కల్కి'తో ప్రభాస్ 'పాన్ వరల్డ్'కు బాటలు వేస్తాడా?