Kajol: ఇప్పుడు కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన సినిమాలు ఎన్నో షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ‘బాజీగర్’. దాదాపు 31 ఏళ్ల క్రితం విడుదలయిన ఈ మూవీ షారుఖ్ ఖాన్, కాజోల్, శిల్పా శెట్టి లాంటి పెద్ద పెద్ద స్టార్లను జీవితాలను మార్చేసింది. వారి కెరీర్లను మలుపు తిప్పింది. ఇప్పటికీ ఈ ముగ్గురి జీవితాల్లో ‘బాజీగర్’ అనేది ఒక ల్యాండ్‌మార్క్‌గా మిగిలిపోయింది. అయితే ముందుగా ఈ మూవీలో కాజోల్‌ను వద్దని నిరాకరించారట మ్యూజిక్ డైరెక్టర్స్ నదీమ్, శ్రావణ్. ఈ విషయాన్ని దర్శకులు అబ్బాస్, మస్తాన్ స్వయంగా బయటపెట్టారు.


ఛాన్స్ మిస్..


‘బాజీగర్’ సినిమాలో హీరోయిన్‌గా నటించడానికి కాజోల్‌ను ముందే సంప్రదించారట అబ్బాస్, మస్తాన్. తనను ఫైనల్ చేసిన తర్వాతే సంగీత దర్శకులుగా నదీమ్, శ్రావణ్‌ను తీసుకుందామని అనుకున్నట్టు చెప్పుకొచ్చారు. వాళ్లకు ఈ సినిమాను సైన్ చేయాలని ఉన్నా కూడా కాజోల్ ఉంటే తాము చేయమని చెప్పేశారట. ఎందుకు అని అడగగా.. కాజోల్‌లో తమకు పర్సనల్‌గా మనస్పర్థలు ఉన్నాయని అన్నారట నదీమ్, శ్రావణ్. అందుకే కాజోల్‌ను సినిమా నుంచి తీసేవరకు తాము ఇందులో పనిచేయమని తేల్చిచెప్పారట. 1993లో విడుదలయిన ‘బాజీగర్’ హిట్ అవ్వడానికి మ్యూజిక్ కూడా ఒక ముఖ్య కారణమే. అలాంటి ఛాన్స్‌ను నదీమ్, శ్రావణ్‌ ఎందుకు మిస్ చేసుకున్నారో అబ్బాస్, మస్తాన్ స్పష్టం చేశారు.


హీరోయిన్ వద్దు..


‘‘నదీమ్, శ్రావణ్‌లకు మేము బాగా తెలుసు. మేము వాళ్లని వెళ్లి కలిసి సినిమా గురించి చర్చించాం. వాళ్లు అసలు సినిమా నుంచి ఎందుకు తప్పుకున్నారో మాకు స్పష్టంగా గుర్తులేదు. నదీమ్, శ్రావణ్‌లకు కాజోల్, తనీషాతో పర్సనల్‌గా ఏవో మనస్పర్థలు ఉన్నాయి. అందుకే హీరోయిన్‌ను మార్చే అవకాశం ఏమైనా ఉందా అని మమ్మల్ని అడిగారు. మేము తనకు అప్పటికే కమిట్ అయ్యాం కాబట్టి ఆ అవకాశం ఏమీ లేదన్నాం. అప్పటికే కాజోల్‌ను ఫైనల్ చేయడంతో తను కాంట్రాక్ట్‌పై సంతకం కూడా పెట్టింది. అందుకే మేము ఏ మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. సినిమా ఉంటే అందులో కాజోల్ ఉంటుంది అని గట్టిగా చెప్పాం. అయితే మేము ఉండము అని వాళ్లు సమాధానమిచ్చారు’’ అని గుర్తుచేసుకున్నారు అబ్బాస్, మస్తాన్.


ఇంట్లో అవమానం..


అసలు కాజోల్‌కు నదీమ్, శ్రావణ్‌లకు మధ్య జరిగిన గొడవ ఏంటి అని అబ్బాస్, మస్తాన్‌లకు కూడా స్పష్టంగా తెలియదని చెప్పారు. ఒకసారి నదీమ్, శ్రావణ్.. కాజోల్ ఇంటికి వెళ్లినప్పుడు తనతో పాటు తన తల్లి కూడా వీరిని సరిగా చూసుకోలేదని ఇండస్ట్రీలో అనుకునేవారట. అంతే కాకుండా కాజోల్ చెల్లెలు తనీషా ప్రవర్తన అయితే దారుణంగా ఉందని, దానిని ఈ సంగీత దర్శకులు అవమానంగా ఫీల్ అయ్యారని చెప్పుకున్నారు. ఇక ఈ పర్సనల్ గొడవ వల్ల ‘బాజీగర్’కు సంగీతాన్ని అందించడానికి ఒప్పుకోలేదు నదీమ్, శ్రావణ్. దీంతో అను మాలిక్ రంగంలోకి దిగారు. ఆయన సినిమాకు అందించిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి.



Also Read: సాయి పల్లవి బర్త్ డే స్పెషల్... లేడీ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు 'తండేల్' టీమ్ ఇచ్చిన గిఫ్ట్ చూడండి