Animal : సినిమా విడుదలయ్యి వారం రోజులు అయినా.. దానికి పోటీగా మిగతా సినిమాలు రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు ఇంకా ‘యానిమల్’ గురించే మాట్లాడుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రతీ క్యారెక్టర్‌కు గుర్తింపు లభించింది. అందుకే హీరోయిన్‌గా నటించిన రష్మిక కంటే సెకండ్ హీరోయిన్ తృప్తి దిమ్రీ గురించే ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అదే విధంగా తనతో పాటు ఆడియన్స్‌లో ఆకర్షించిన మరొక నటి మాన్సీ తక్షక్. తను ‘యానిమల్’లో విలన్ పాత్ర పోషించిన బాబీ డియోల్‌కు మూడో భార్యగా నటించింది. తాజాగా మాన్సీ చేసిన కామెంట్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.


వైరల్ అయిన మ్యూజిక్..
‘యానిమల్’లో రణబీర్ పాత్రను మాత్రమే కాదు.. బాబీ డియోల్ పాత్రను కూడా చాలా వైలెంట్‌గా క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాలో బాబీ డియోల్‌‌కు ఇద్దరు భార్యలు. వారు ఉండగానే మరో అమ్మాయిని మూడో పెళ్లి చేసుకుంటాడు. అదే సమయంలో తమ్ముడి హత్య వార్త విని షాకవుతాడు. ఆ కోపంతో పెళ్లిలోనే వధువును రేప్ చేస్తాడు. ‘యానిమల్’లో కాంట్రవర్షియల్‌గా ఉన్న సీన్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ సీన్స్‌పై బాబీ డియోల్ రీల్ భార్య మాన్సీ తక్షక్ స్పందించింది. ‘‘అది షాకింగ్‌గానే ఉంటుంది. ఎవరూ తమ పెళ్లి అలా ముగిసిపోవాలని అనుకోరు. పెళ్లి సీన్ మొదలయినప్పుడు మీరు గమనిస్తూ.. ఆ లైట్స్, ఆర్ట్ అంతా చాలా అందంగా ఉంటుంది. ఇక ఆ మ్యూజిక్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయ్యింది’’ అంటూ ఆ పెళ్లి సీన్ గురించి వివరించింది.


ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు..
‘‘అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఇలాంటిది ఏదో జరుగుతుంది. యానిమల్ వస్తుంది అని ఆడియన్స్‌కు చెప్పడానికి అదంతా. రణబీర్ అలాంటివాడు అయితే విలన్ ఇంకెంత దారుణంగా ఉంటాడో మీరు ఊహించుకోవచ్చు. బాబీ క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ముందు నిలబెట్టడానికి అది కరెక్ట్‌గా సరిపోయింది. అసలైన యానిమల్ ఎవరు అని వారికి అర్థమవుతుంది. అలాంటిది నా పెళ్లిలో జరగకూడదని కోరుకుంటాను’’ అంటూ మాన్సీ.. బాబీ క్యారెక్టర్‌కు ఇచ్చిన ఇంట్రడక్షన్ కరెక్టే అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇక ఈ సీన్‌పై వస్తున్న విమర్శలకు కూడా మాన్సీ స్పందించింది. ‘‘దాని ముందు వచ్చే పెళ్లి సీన్ మీరు చూసుంటే.. మా కెమిస్ట్రీ, కళ్లలో కళ్లు పెట్టి చూసుకోవడం.. ఇవన్నీ మా కథ మీకు అర్థమయ్యేలా చేస్తాయి. వారికి ఉన్న విబేధాలు, వయసు తేడా, కెరీర్స్.. అన్నీ పక్కన పెడితే వారిద్దరూ ప్రేమించారు కాబట్టే పెళ్లికి సిద్ధపడ్డారు’’ అని తెలిపింది.


వేధింపులను చూపించడం ఉద్దేశం కాదు..
‘‘ప్రేక్షకులు దీనిని చాలా తప్పుగా చూస్తున్నారు. కానీ దాని ఉద్దేశం అది కాదు. వేధింపులను చూపించడం అనేది లక్ష్యం కాదు. తన తమ్ముడు చనిపోయాడు అనే వార్తను పెళ్లిలో వినాల్సి వస్తుంది బాబీ ఊహించడు. అందుకే తనకు ఏం ఆలోచించాలో, ఏం చేయాలో అర్థం కాదు. ఒక ‘యానిమల్‌’లాగా బాబీ పాత్ర కూడా ఎప్పుడు ఏం చేస్తుందో ఊహించలేము. ఆయన ఆ జోన్‌లోకి వెళ్లిపోయి, ఆ కోపాన్ని తీర్చుకోవడం కోసం తన భార్యల దగ్గరకు వస్తాడు. వేధింపుల గురించి చూపించడం దర్శకుడు ప్రయత్నం కాదు. నాకు కథలో అయినా, సెట్‌లో అయినా ఎప్పుడూ అలా అనిపించలేదు. ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్‌షిప్ అలా బయటికి వచ్చింది అంతే’’ అని బాబీ పాత్ర గురించి మరింత స్పష్టంగా ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పింది మాన్సీ తక్షక్.


Also Read: ఆ పాట, స్టెప్పులపై తీవ్ర విమర్శలు - నితిన్ సినిమాలో బూతులు ఏంటి?