లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా, దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘థగ్ లైఫ్‘. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై కమల్, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‍గా త్రిష హీరోయిన్ గా నటించనుంది.  మలయాళ  హీరో దుల్కర్ సల్మాన్, తమిళ హీరో జయం రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కమల్ కు బర్త్  డే గిఫ్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో విడుదల చేశారు మేకర్స్.


‘థగ్ లైఫ్‘ మూవీపై భారీ అంచనాలు


ఈ వీడియోలో కమల్ హాసన్ గతంలో ఎప్పుడూ లేని విధంగా డిఫరెంట్ గెటప్ లో కనిపించారు. అంతేకాదు, ఆయన పాత్రని కూడా మేకర్స్ పరిచయం చేశారు. ఈ చిత్రంలో రంగరాయ శక్తివేల్ నాయకర్ అనే గ్యాంగ్‍స్టర్  కమల్ కనిపించబోతున్నారు. గ్లింప్స్ ఓపెనింగ్ లోనే “నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. పుట్టినప్పుడే శక్తివేల్ నాయకర్ నుదిటిపై క్రిమినల్, గూండా, యాకూజా అని రాసినట్టు ఉన్నారు”  అంటూ మొదలు పెడతారు. కమల్ తలపై ఓ ముసుగు ఉంది. కొందరు  కమల్ ను చంపేందుకు దూసుకొస్తారు. వారందరినీ కమల్ మట్టుబెడతారు. సరికొత్త వేషధారణలో కమల్ అదుర్స్ అనిపించారు. ఈ వీడియోలోని యాక్షన్ సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ అనౌన్స్ మెంట్ వీడియోతో మూవీపై భారీగా అంచనాలు రేకెత్తించారు మేకర్స్. కమల్, మణిరత్నం కాంబోలో సుమారు 35 ఏండ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.  


హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారా?


మరోవైపు ఈ సినిమా హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టారు. మణిరత్నం కూడా కాపీ కొడతారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. హాలీవుడ్ మూవీ ‘రైజ్ ఆఫ్ స్కై వాకర్’ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలా ఉందో.. ‘థగ్ లైఫ్’ మూవీలో కమల్ హాసన్ గెటప్ కూడా అచ్చం అలాగే ఉంది. ఆ సినిమా లోని విజువల్ బ్యాక్ డ్రాప్ కూడా సేమ్ టు సేమ్ ఉంది. ఈ ఫోటోలను చూసిన తర్వాత దర్శకుడు మణిరత్నం పైగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆయన కూడా హాలీవుడ్ చిత్రాలను కాపీ కొడతారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.


కాపీ విమర్శలపై మిశ్రమ స్పందన


మరోవైపు కొన్ని ఫోటోలను చూసి సినిమాకు మక్కీకి మక్కీ అని చెప్పడం కరెక్టు కాదు అంటున్నారు మరికొంత మంది నెటిజన్లు. సినిమా కథ, కమల్ హాసన్ పాత్రకు సంబంధించి సంబంధం ఉండకపోవచ్చు అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో రెహమాన్ ఇచ్చిన సంగీతానికి, ‘రైజ్ ఆఫ్ స్కై వాకర్’ సినిమాలో మ్యూజిక్ కు అసలు సంబంధమే లేదంటున్నారు. మరికొంత మంది ఆ హాలీవుడ్ సినిమా నుంచి ప్రేరణ పొందే ఈ సినిమా చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా దర్శకుడు మణిరత్నం పైనా కాపీ క్యాట్ అనే ముద్ర పడిందనే చెప్పుకోవచ్చు. ఈ విమర్శలపై చిత్రబృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.


Read Also: రష్మిక మార్ఫింగ్ వీడియో - భయమేస్తుందన్న చైతూ, మద్దతుగా మృణాల్, సాయి తేజ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial