మంచి సినిమాలకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) మద్దతు ఎప్పుడూ ఉంటుంది. దానికి మరో ఉదాహరణ ఇది. ఇంతకు ముందు కొన్ని చిన్న సినిమాలు చూడటమే కాదు... సోషల్ మీడియాలో మంచి రివ్యూలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో చిన్న సినిమా టీజర్ విడుదల చేయనున్నారు. 


ప్రేమ విమానానికి మహేష్ మద్దతు!
నిఖిల్ 'కేశవ', అడివి శేష్ 'గూఢచారి', మాస్ మహారాజా 'రావణాసుర' సినిమాలను నిర్మించిన తెలుగు నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures). ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా 'డెవిల్' సినిమా నిర్మిస్తోంది. వెండి తెరతో పాటు డిజిటల్ తెరపై కూడా ప్రజలకు వినోదం అందించాలని ఓ వెబ్ ఫిల్మ్ నిర్మించింది. ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ 5'తో కలిసి అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మించిన సినిమా 'ప్రేమ విమానం' (Prema Vimanam Movie). 


'ప్రేమ విమానం' టీజర్ (Prema Vimanam Teaser)ను ఏప్రిల్ 27న ఉదయం పది గంటలకు... అంటే రేపే మహేష్ బాబు విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాల నటులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'లో హీరోగా నటించిన సంగీత్ శోభన్ హీరో. అతని సరసన 'పుష్పక విమానం' ఫేమ్ శాన్వీ మేఘన కథానాయికగా నటించారు. 'వెన్నెల' కిశోర్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.


Also Read : 'గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ'లో యంగ్ టైగర్ ఎంటరైతే? - ఇదీ హాలీవుడ్‌లో ఎన్టీఆర్ క్రేజ్





'ప్రేమ విమానం' కథ ఏంటంటే?
'ప్రేమ విమానం'లో ప్రతి ఒక్కరి పాత్రకు ప్రాముఖ్యం ఉంటుందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఎలాగైనా సరే విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు... ఆఘమేఘాల మీద విమానం ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని తెగ తాపత్రయపడే ఓ ప్రేమ జంట... మరో ఇద్దరు పెద్దలు... అందరూ ఒక్క చోటుకు చేరిన తర్వాత వాళ్ళ ప్రయాణంలోని మలుపులు, సంతోషాలు, బాధల సమాహారమే చిత్ర కథాంశమని 'జీ 5' ఓటీటీ ప్రతినిథులు పేర్కొన్నారు. ఇదొక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పారు.


Also Read 'గబ్బర్ సింగ్'కు 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ గిఫ్ట్ - హరీష్ శంకర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా



విశేషం ఏమిటంటే... 'జీ స్టూడియోస్' సంస్థ నిర్మిస్తున్న 'విమానం' సినిమాలోనూ అనసూయ కీలక పాత్ర చేశారు. అందులో సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, మీరా జాస్మిన్ ఇతర తారాగణం. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే... వికలాంగుడిగా సముద్రఖని కనిపించారు. ఆ సినిమా కథాంశం కూడా విమానం ఎక్కాలని ఓ చిన్నారి కలలు కనడం మీద ఉంటుంది. కథాంశం ఒక్కటే అయినా కథ, కథనాలు వేర్వేరుగా ఉంటాయని సమాచారం. రెండికి అసలు సంబంధమే ఉండదట.   


'ప్రేమ విమానం' చిత్రానికి సంతోష్ కటా దర్శకత్వం వహించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. జగదీష్ చీకటి ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రానికి  కూర్పు : అమర్ రెడ్డి, కళా దర్శకత్వం : గంధి నడికుడికర్, సమర్పణ : దేవాన్ష్ నామా, నిర్మాత : అభిషేక్ పిక్చర్స్ & జీ5.