తెలుగు సినిమాల్లో స్టార్ లు ఎందరో ఉన్నా.. సూపర్ స్టార్ మాత్రం కృష్ణనే. కారణం.. అద్భుత నటన అని మాత్రమే కాదు, తెలుగు సినిమాల్లో సాహసంతో కూడిన ప్రయోగాలు చేపట్టడం కూడా. తెలుగు సీనిమా స్టాండర్డ్స్ ను పెంచడానికి ఆయన ఖర్చుకు వెనకాడకుండా ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో చాలా ప్రయోగాలకు ఫస్ట్ సినిమాలుగా కృష్ణ మూవీస్ నే నిలిచాయి. 

ఫస్ట్ జేమ్స్ బాండ్ -(గూఢచారి 116): (1966)


హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలు మొదలైన సమయంలో ప్రపంచ వ్వ్యాప్తంగా గూఢచారి సినిమాల హవా మొదలైంది . అదే టైమ్ లో ఫ్రెంచ్ లో oss 117 అనే సినిమా రిలీజయింది. ఈ సినిమా షాడో ఆఫ్ ఈవిల్ పేరుతొ ఇంగ్లీష్ లో డబ్ అయి ఇండియాలో విడుదలైంది. మద్రాస్ లో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రాజ్యలక్ష్మి పిక్చర్స్ ఈ చిత్రం ఆధారంగా 1996లో తెలుగులో ‘గూఢచారి 116’ సినిమా తీశారు. ఇందులో హీరోగా కృష్ణ నటించగా ఇండియాలో తొలి జేమ్స్ బాండ్ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. అప్పటికి కేవలం రెండు సినిమాల్లో నటించిన కృష్ణకు ఈ సినిమా కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. మొదటి రెండు సినిమాలైన ‘తేనె మనసులు’, ‘కన్నె మనసులు’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు కాగా గూఢచారి 116 స్పై థ్రిల్లర్. తొలి చిత్రం ‘తేనె మనసులు’ సినిమాలో ఒక సీన్ లో డూప్ లేకుండా రన్నింగ్  స్కూటర్‌పై నుంచి కారు పైకి జంప్ చేసే సీన్ రియల్‌గా చేశారన్న వార్త విని దర్శకుడు డూండీ తన ‘జేమ్స్ బాండ్’ సినిమా ‘గూడఛారి 116’లో హీరోగా కృష్ణను ఎంచుకున్నారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో తన కాలంలోని  మిగిలిన హీరోలను దాటుకుని కృష్ణ కెరీర్ లో దూసుకు పోయారు. ఆ తరువాత డిటెక్టివ్ తరహా చిత్రాలకు కృష్ణ కేర్ ఆఫ్ అడ్రెస్ గా నిలవడంతో  ఆయనకు ఇప్పటికీ ఆంధ్రా జేమ్స్ బాండ్ అనే పేరు స్థిరపడిపోయింది. 

తొలి కౌ బాయ్ -మోసగాళ్లకు మోసగాడు (1971)


తన పెద్ద కుమార్తె పద్మ పేరుతో.. తన తమ్ముళ్ళతో కలిసి కృష్ణ ప్రారంభించిన పద్మాలయ స్టూడియోస్‌ బ్యానర్‌పై కృష్ణ నిర్మించిన ‘అగ్నిపరీక్ష’ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఎలాగైనా తాను నిర్మాతగా సక్సెస్ కొట్టాలనే లక్ష్యంతో కృష్ణ నిర్మించిన సినిమానే.. ‘మోసగాళ్లకు మోసగాడు’. ప్రముఖ రచయిత ఆరుద్రను కలిసి తెలుగు సినిమాకు కౌ బాయ్ జోనర్ ను పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఉన్నాననీ.. ఆ బ్యాక్ గ్రౌండ్ లో కథ కావాలనీ అడగడంతో ఆరుద్ర రెడీ చేసిన కథే ‘మోసగాళ్లకు మోసగాడు’. ఈ సినిమాకు ఆరుద్రనే దర్శకత్వం వహించమని చెప్పినా ఆయన తన వల్ల కాదన్నారు. దీంతో అప్పటికే యాక్షన్ సినిమాలు బాగా తీస్తారనే పేరున్న KSR దాస్ ని దర్శకుడిగా ఎంచుకుని ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా మొదలు పెట్టారు. ఈ సినిమాకు ముందు అదృష్ట రేఖ అనే పేరు అనుకున్నారు. ఆ తర్వాత కాస్త మాస్ గా ఉండాలని ‘మోసగాళ్లకు మోసగాడు’ అని పేరు పెట్టారు. ఈ సినిమా కోసం కృష్ణ అప్పట్లో రూ.8 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ రోజుల్లో  టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, అక్కినేని సినిమాలకు మాత్రమే అంత బడ్జెట్ పెట్టేవారు. దీంతో ‘మోసగాళ్లకు మోసగాడు’ కాస్ట్ ఫెయిల్యూర్ అవుతుందనీ, మహిళలు పెద్దగా ఈ సినిమా చూడరని ఎన్నో గాసిప్స్ పుట్టుకొచ్చాయి. కానీ ఈ సినిమా వాటన్నిటికీ చెక్ పెట్టింది. ఇండియాలోనే తొలి కౌబాయ్ సినిమాగా నిలిచిపోయింది. 8 లక్షల బడ్జెట్ తో తీసిన మోసగాళ్లకు మోసగాడు 50 లక్షల గ్రాస్ వసూలు చేసింది. దానితో ఒక్క సారిగా కృష్ణ టాప్ లీగ్ లోకి దూసుకు వచ్చారు. ఎన్టీఆర్, అక్కినేని తర్వాత టాలీవుడ్ టాప్ హీరోగా కృష్ణ పేరునే చెప్పేవారు. ఈ సినిమా మరిన్ని కేటగిరీల్లోనూ ఫస్ట్ సినిమానే. అవేంటో చూద్దాం. 

నార్త్ లో షూటింగ్ చేసిన ఫస్ట్  సౌత్ ఇండియన్ సినిమా


‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాను నార్త్ ఇండియాలోని షిమ్లా, బికనీర్, సట్లెజ్ నదీ తీరం, టిబెట్, థార్ ఎడారి లాంటి అనేక చోట్ల షూటింగ్ చేశారు. దానికోసం మొత్తం యూనిట్ ను ఒక స్పెషల్ ట్రైన్ లో ఢిల్లీకి తీసుకెళ్లి.. మళ్ళీ అక్కడి నుంచి కార్లు, వ్యాన్ లలో షూటింగ్ స్పాట్స్ కు తరలించేవారు. 

ఇంగ్లీష్ లోకి డబ్  అయిన ఫస్ట్ తెలుగు సినిమా


‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమా తెలుగులోనే కాదు తమిళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లోనూ సంచలనం సృష్టించింది. దానితో సినిమా లెన్త్ తగ్గించి ‘ది ట్రెజర్ హంట్’ పేరుతో ఇంగ్లీష్‌లోకి డబ్ చేసి హాలీవుడ్ లో రిలీజ్ చేశారు. ఆ వెర్షన్ ను టర్కీ, మలేషియా, సింగపూర్‌‌తో పాటు ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో రిలీజ్ చేశారు. విడుదలైన ప్రతీ చోటా ఈ సినిమాకు కాసుల పంట పండింది. 

ఫస్ట్ సినిమా స్కోప్ -అల్లూరి సీతారామరాజు  (1974)


విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవిత కథను తెరకెక్కించాలని టాలీవుడ్ పెద్దలు ఎన్టీఆర్ లాంటి వారు ప్రయత్నాలు చేసినా సరైన స్క్రిప్ట్ దొరక్క లేట్ అవుతూ వచ్చింది. పైగా పూర్తిగా అడవిలోనే తియ్యాల్సిన సినిమా ఇది, చాలా కష్టం అన్నారు నాటి నిర్మాతలు. అయితే అప్పటికే ‘మోసగాళ్లకు మోసగాడు’ ఇచ్చిన సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న కృష్ణ ఈ బాధ్యత తలకెత్తుకున్నారు. త్రిపురనేని మహారథి అందించిన కథ, డైలాగ్స్ తో ఈ అల్లూరి సీతారామరాజు సినిమా తెరకెక్కింది. 

 

1968లో వచ్చిన ‘అసాధ్యుడు’ సినిమాలో కృష్ణ కాసేపు అల్లూరి సీతారామరాజు గా కొద్దిసేపు కనిపిస్తారు. దీంతో ఆ సినిమా డైరెక్టర్ రామచంద్రరావు నే అల్లూరి సీతారామరాజుకు డైరెక్టర్ గా తీసుకున్నారు. కానీ ఆయన షూటింగ్ మధ్యలోనే అనారోగ్యంతో చనిపోయారు . దీంతో మిగిలిన షూటింగ్ ని దర్శకుడు KSR దాస్ సాయంతో కృష్ణ నే డైరెక్ట్ చేశారు. అయినప్పటికీ సినిమా డైరెక్టర్ గా వీ.రామచంద్రరావు పేరే వేశారు కృష్ణ. అదీ ఆయన సహృదయం. ఇక తెలుగులో తొలి స్కోప్‌గా రూపొందిన అల్లూరి సీతారామరాజు చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక ఆణిముత్యంగా మిగిలిపోవడమే కాకుండా బయోపిక్ లకు ఒక డిక్షనరీగా మారింది. అల్లూరి సీతారామరాజును తెలుగు వాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. 35 కేంద్రాల్లో విడుదలైన ఈ  సినిమా మొదటి వారంలోనే 18 లక్షల పైగా వసూలు చేసి ఓపెనింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. 19 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు .. షిఫ్ట్స్ మీద 15 రోజులు.. హైదరాబాద్ లో 365 రోజులు ఆడింది. బాక్సాఫీస్ వద్ద  రెండుకోట్ల రూపాయలు వసూలు చేసిన ఫస్ట్ తెలుగు సినిమా ఇది. దానితో అంతకు ముందు ఉన్న లవకుశ, దసరా బుల్లోడు రికార్డ్స్ తుడిచిపెట్టుకు పోయాయి. ఇందులో తెలుగు వీర లేవరా పాట రాసిన శ్రీశ్రీ కి నేషనల్ అవార్డు వచ్చింది.

 

తొలి 70 MM  సినిమా - సింహాసనం : (1986 )

 

నేటి ‘బాహుబలి’ ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో.. అలాంటి సెన్సేషన్ దాదాపు 35 ఏళ్ల క్రితం సృష్టించిన సినిమా ‘సింహాసనం’. అత్యంత భారీ స్థాయిలో ఒక జానపద సినిమాను తియ్యాలనుకున్న కృష్ణ.. తెలుగులో తాను నటిస్తూ.. హిందీలో జితేంద్ర హీరోగా తన దర్శకత్వంలో తీసిన సినిమా ‘సింహాసనం’. అప్పటికే తెలుగులో భారీ బడ్జెట్ అంటే 30 నుంచి 40 లక్షలు మాత్రమే. ఆ టైంలో రూ.3 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ‘సింహాసనం’. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరికి ఇదే ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాకు డైరెక్టర్, నిర్మాతతో పాటు ఎడిటర్ కూడా కృష్ణ నే. 1986లో టాలీవుడ్ లో మెదటిసారిగా 150 థియేటర్ లలో రిలీజ్ అయిన సింహాసనం  సినిమా వద్ద అభిమానుల తాకిడిని ఆపడం కోసం పోలీసులను ఉపయోగించాల్సి వచ్చింది. సినిమా భారీతనానికి తగ్గట్టు 70MMలో తీశారు కృష్ణ. వైజాగ్ లో 100 రోజులు హౌస్ ఫుల్స్ తో ఆడి రికార్డ్ సృష్టించింది ఈ సినిమా. నాలుగున్నర కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి సినిమా సింహాసనం. చెన్నైలో 100రోజుల ఫంక్షన్ జరిపితే.. 400 బస్సుల్లో వచ్చిన అభిమానుల వల్ల  చెన్నైలో 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యిందని నాటి అభిమానులు చెబుతుంటారు. సినిమా హీరోయిన్ లతో సహా ముఖ్య అతిథులూ సభ వద్దకు చేరుకోలేకపోయారు. అదీ కృష్ణ ‘సింహాసనం’ సినిమాతో సాధించిన ఇమేజ్. 

మొదటి డీటీయస్ సినిమా - తెలుగు వీర లేవరా -(1995 )


సాంకేతికతను తెలుగు తెరకు అద్దడానికి ఎప్పుడూ ముందు ఉండే కృష్ణ నటించిన 300వ సినిమా ‘తెలుగువీర లేవరా’ . ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నేటి మంత్రి రోజా హీరోయిన్ గా నటించారు.  టాలీవుడ్‌ లో మొట్టమొదటి డీటీయస్ సినిమా ఇదే. అయితే నాటికి ఉమ్మడి ఏపీలో డీటీయస్ థియేటర్ లు చాలా తక్కువ ఉండడం వల్ల  ఆ సిస్టం ఎఫెక్ట్‌ను జనాలు పెద్దగా గుర్తించలేదు. అయినప్పటికీ తెలుగు తెరకు డీటీయస్ టెక్నాలజీని పరిచయం చేసిన హీరోగా కృష్ణ నిలిచిపోయారు.

 


 

ఇవి మాత్రమే కాకుండా .. ఒకే ఏడాది ఎక్కువ సినిమాల్లో (17) హీరోగా నటించిన తెలుగు హీరోగా, ఒకే హీరోయిన్ తో ఎక్కువ సినిమాల్లో జంటగా నటించిన రికార్డ్ ( విజయ నిర్మల,జయప్రద).. ఇలా ఎన్నో మొదటి  రికార్డ్స్ టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ పేరు మీదనే ఉన్నాయి.