టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ (79)ఇకలేరు. ఇవాళ తెల్లవారుఝామున 4.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. సోమవారం గుండెపోటు, శ్వాస ఇబ్బందులతో  హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో కృష్ణ అడ్మిట్ అయ్యారు. అయితే చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడం, అవయవాలు ఏవీ పనిచేయకపోవడంతో తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవలే కృష్ణ భార్య ఇందిరా కన్నుమూశారు. అంతకుముందు పెద్ద కొడుకు రమేష్ మరణించారు. ఇప్పుడు కృష్ణ మరణంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సూపర్ స్టార్ మరణ వార్తతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.


కృష్ణ మరణ వార్త విని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మాటలకు అందని విషాదం ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదు. ఆయన మంచి మనసు గలిగిన హిమాలయ పర్వతం. సాహసానికి ఊపిరి, ధైర్యానికి పర్యాయపదం. ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం.. వీటి కలబోత కృష్ణ గారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, భారత సినీ పరిశ్రమలోనే అరుదు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రు నివాళి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నా సోదరుడు మహేష్ బాబుకు, ఆయన కుటుంబ సభ్యులందరికీ, అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకొంటున్నా’’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 


బాలకృష్ణ స్పందిస్తూ.. ‘‘ఘట్టమనేని కృష్ణ గారి మరణం తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. కృష్ణ గారు తన నటనతో చిత్రసీమలో సరికొత్త ఒరవళ్ళు సృష్టించి ఎనలేని ఖ్యాతి సంపాదించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్టూడియో అధినేతగా చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. కృష్ణగారితో మా కుటుంబానికి ఎంతో అనుబంధం వుంది. నాన్నగారు, కృష్ణ గారు కలసి అనేక చిత్రాలకు పని చేశారు. ఆయనతో కలిసి నేను నటించడం మర్చిపోలేని అనుభూతి. కృష్ణ గారు లేనిలోటు సినీ పరిశ్రమకూ, అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఇటివలే సోదరుడు రమేష్ బాబుని, మాతృమూర్తి ఇందిరాదేవిని కోల్పోయి దుఃఖంలో వున్న నా సోదరుడు మహేష్ బాబుకు ఈ కష్టం కాలంలో దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను'' అని అన్నారు.






కృష్ణ మరణ వార్త తనను ఎంతో బాధించిందని సీనియర్ నటి రాధికాశరత్ కుమార్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ గా ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు రాధిక.






కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్


సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ తుది శ్వాస  విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. కృష్ణ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకొంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణ, ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది.  తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా కృష్ణ చేసిన సేవలు చిరస్మరణీయాలు. తెలుగు సినిమా పురోగమన ప్రస్థానంలో ఆయన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారు. విభిన్న పాత్రలు పోషించిన కృష్ణ  కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజా జీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు.  సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరని లోటు. ఆయన కుమారుడు మహేష్ బాబు, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను." అంటూ పవన్ కళ్యాణ్ స్పందించారు.


సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల నందమూరి కళ్యాణ్ రామ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.







కృష్ణ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. " కృష్ణ అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు  పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం." అంటూ ట్వీట్ చేశారు.







సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చనిపోయారు అంటే ఇప్పటికి నమ్మలేకపొతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మహేష్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు సాయి.