కోలీవుడ్ సీనియర్ హీరో కమలహాసన్ శుక్రవారం ఉదయం విజయవాడలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 'ఇండియన్ 2' సినిమా చిత్రీకరణ కోసం విజయవాడ వచ్చిన కమలహాసన్ ఇందులో భాగంగానే సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణలీక్ పాల్గొన్నారు. ఈ మేరకు విగ్రహాన్ని ఆవిష్కరించి తన ఆనందాన్ని పంచుకున్నారు. కాగా తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా కమల్ హాసన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. డీటెయిల్స్ లోకి వెళ్తే.. ఒకప్పటి స్టార్ హీరో, మహేష్ బాబు తండ్రి దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మరణించి ఏడాది కావస్తోంది.


గత సంవత్సరం నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. హీరోగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన నిర్మాతలకు దేవుడిగా మారి అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన మరణం తర్వాత ఏడాది పొడుగునా ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ విగ్రహ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ స్వస్థలం అయిన బుర్రిపాలెం లో ఆయన విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు తప్ప కుటుంబ సభ్యులు అంతా హాజరయ్యారు. ఇక తాజాగా విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ విగ్రహాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు.






విజయవాడ గురునానక్ కాలనీలో అభిమానులు కృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చిన కమలహాసన్‌తో ఈ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ విగ్రహావిష్కరణ జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మెమొరబుల్ మూమెంట్ పై మహేష్ బాబు స్పందిస్తూ కమలహాసన్ కి స్పెషల్ థాంక్స్ చెప్పారు.


ఈ మేరకు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోని తన ట్విట్టర్ వేదికగా పంచుకున్న మహేష్.. "నాన్నగారి విగ్రహం ఆవిష్కరించినందుకు కమల్ హాసన్ , దేవినేని అవినాష్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లినా ఒక అభిమాని కుటుంబాన్ని మా సొంతం చేసి వెళ్లారు. ఫ్యాన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ రాస్కొచ్చారు. దీంతో మహేష్ చేసిన ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న 'ఇండియన్ 2' షూటింగ్ ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సంచలన దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. 1996లో వచ్చిన 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా 'ఇండియన్ 2' తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


Also Read : సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం ఆవిష్కరించిన విశ్వ నటుడు కమల్ హాసన్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial