Rajinikanth Vettaiyan Movie News | సూపర్ స్టార్ రజినీకాంత్ 170 సినిమా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది. మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, తాజాగా తెలుగు టైటిల్ విషయంలో రచ్చ తీవ్రతరం అయ్యింది. దీంతో అలర్ట్ అయిన నిర్మాణ సంస్థ సినిమాను తమిళ టైటిల్ తో రిలీజ్ చేయడానికి కారణం ఏంటో స్పష్టం చేసింది. 


దసరా కానుకగా 'వేట్టయన్ : ది హంటర్'


ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'వేట్టయన్ : ది హంటర్'. తలైవా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రానా, ఫాహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, అభిరామి, తుషార విజయన్ వంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషించారు. సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10 న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. రజినీ 170వ సినిమా కావడం, దాదాపు మూడు దశాబ్దాల తరువాత రజినీ, అమితాబ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో కొంతవరకు అంచనాలు ఉన్నాయి సినిమాపై. అయితే అంచనాల కంటే వివాదాల్లోనే ఈ మూవీ ఎక్కువగా నిలుస్తోంది. 'వేట్టయన్' సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా టైటిల్ తెలుగులో కాకుండా తమిళంలోనే ఉండడం వివాదానికి దారి తీసింది. 






టైటిల్ మాత్రం తమిళ భాషలోనే


గత కొన్నాళ్ల నుంచి తెలుగులో రిలీజ్ అవుతున్న ఇతర భాషల సినిమాలకు ఒరిజినల్ టైటిల్ తోనే రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాయన్, కంగువా, వలిమై ఇలా ఈ సినిమాలను తెలుగులో డబ్ చేసినా టైటిల్ మాత్రం తమిళ భాషలోనే ఉంచడం తెలుగు ప్రేక్షకులకు రుచించట్లేదు. పైగా తాజాగా రిలీజ్ అవుతున్న హిందీ మూవీ 'జిగ్రా' కూడా అదే టైటిల్ తో రిలీజ్ అవుతుండడంతో ఇతర భాషల మేకర్స్ పై తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ఇక 'వేట్టయన్' విషయానికి వస్తే దానర్థం 'వేటగాడు'. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా టైటిల్ కి అర్థం ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఈ టైటిల్ వివాదం తెలుగులో సినిమా బుకింగ్స్ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 


మరోవైపు తెలుగు మూవీ లవర్స్ సినిమాను తమిళ టైటిల్ తో రిలీజ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'వేట్టయన్' మూవీని బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై నిర్మాణ సంస్థ స్పందించింది. సినిమాకు తెలుగు టైటిల్ ట్రై చేసినా దొరకలేదంటూ ఒక సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేశారు. అందులో 'వేటగాడు' అనే టైటిల్ అనుకున్నా దొరకకపోవడంతో పాన్ ఇండియా వైడ్ గా ఒకే టైటిల్ తో 'వేట్టయన్'గా చేస్తున్నాము అని క్లారిటీ ఇస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికే తెలుగులో బుకింగ్స్ పై గట్టి ఎఫెక్ట్ పడింది. ఫలితంగా రజనీకాంత్ లాంటి స్టార్ హీరో సినిమాకి టైటిల్ వివాదం సెగ తగలడమే కాకుండా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.


Read Also : Akkineni Naga Chaitanya : నాగ చైతన్య X అకౌంట్ హ్యాక్... అనుమానాస్పద ట్వీట్ తో విషయం వెలుగులోకి..