‘ఆదిపురుష్’ సినిమా విడుదలకు ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. జూన్ 16 న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రామాయణ ఇతిహాసాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు కాబట్టి మూవీపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చినప్పటికీ లేటెస్ట్ గ్రాఫిక్స్ వర్క్స్ తో ఈ మూవీను తెరకెక్కించడంతో ఈ దృశ్యకావ్యాన్ని థియేటర్లలో చూసేందుకు అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్సు బుకింగ్ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోతున్నాయి. మొదట్లో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ విడుదలకు కొన్ని రోజుల ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. 


దేశవ్యాప్తంగా 1.5 లక్షల ఉచిత టికెట్లు..


ఆదిపురుష్ సినిమా కోసం మూవీ ఎలాంటి కమర్షియల్ పబ్లిసిటీను చేపట్టలేదు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా దర్శకుడు ఓమ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మూవీ పై బజ్ ను క్రియేట్ చేశాయి. ఎక్కడ రామాయణం నాటకం జరిగినా అక్కడకు హనుమ వస్తాడని తన తల్లి చెప్పేదని అందుకే ఇప్పుడు ‘ఆదిపురుష్’ సినిమా థియేటర్లలో హనుమంతుడు కోసం ప్రత్యేకంగా ఒక సీటును కేటాయించాలని డిస్టిబ్యూటర్లను కోరారు ఓమ్ రౌత్. ఇక అప్పటి నుంచి ‘ఆదిపురుష్’ సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడుకోవడం మొదలైంది. అలాగే  అనాథ శరణాయాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 10 వేల ఉచిత టికెట్లను అందివ్వనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించడంతో మూవీ గురించి దేశవ్యాప్తంగా చర్చలు నడిచాయి. నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల ఉచిత టికెట్లను పంపిణీ చేసినట్టు తెలుస్తోంది. వీటి విలువ సుమారు రూ.3-3.5 కోట్లు ఉంటుందని అంచనా. ఇదే ఇప్పుడు మూవీపై ఇంతటి బజ్ ను క్రియేట్ చేసింది. 


ఖాళీ సీటులో హనుమాన్ విగ్రహం, పూజలు..


‘ఆదిపురుష్’ సినిమా ప్రదర్శితమయ్యే థియేటర్లలో ఒక సీటును హనుమాన్ కోసం కేటాయించాలని దర్శకుడు ఓమ్ రౌత్ కోరిన తర్వాత ఈ సినిమాపై బజ్ బాగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే టికెట్ ల విక్రయాల జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు హనుమాన్ కోసం ఉంచిన సీటు గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లు హనుమాన్ కోసం కేటాయించిన సీటును అలా ఖాళీగా వదిలేయకుండా ఆ సీటులో హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ను ఉంచాలని భావిస్తున్నాయట. అంతే కాదు సినిమా ప్రదర్శిత మవుతున్న ప్రతీ రోజూ హనుమంతునిక పువ్వులు సమర్పించి హనుమాన్ ను పూజించాలని అనుకుంటున్నాయిట. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 


తమిళనాడు, కేరళలో ప్రభావం చూపని ‘ఆదిపురుష్’..


తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో కూడా ‘ఆదిపురుష్’ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ అవ్వడంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ‘ఆదిపురుష్’ సినిమా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి ప్రభాస్ కు తమిళనాడు, కేరళలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ సినిమా రామాయణం బ్యాక్డ్రాప్ కావడంతో ఆ ప్రాంతాల ప్రజలు అంతగా ఆసక్తి చూపడం లేదట. వారు ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ మోడ్ లో చూడాలని అనుకుంటున్నారని, ‘సలార్’ సినిమా దీనికి మంచి ఉదాహరణ అని చెప్తున్నారు ట్రేడ్ వర్గాల నిపుణులు. అయితే సినిమా ఎక్కడ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుంది అనేది చూడాల్సి ఉంది.


Read Also: 'ఆదిపురుష్' రిలీజ్ అప్‌డేట్స్ - శుక్రవారం ఒక్క రోజే హైదరాబాద్‌లో 1000 ప్లస్ షోలు