డ్రగ్స్ కేసు (Drugs Case)తో తనకు ఎటువంటి సంబంధం లేదని నటి జ్యోతి స్పష్టం చేశారు. మీడియాలో తన ఫోటోలు రావడం చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఫోనులు చేస్తున్నారని... కేసు విచారణలో ఉండగా ఫోటోలు వేయడం తప్పని, తన ఫోటోలు వేయవద్దని మీడియాను కోరారు. ఓ డాక్యుమెంటరీ షూటింగులో బిజీగా ఉన్నప్పటికీ... ఫోనులు రావడంతో ఈ విధంగా వివరణ ఇస్తున్నారని ఓ వీడియో విడుదల చేశారు. 'బిగ్ బాస్' బ్యూటీ అషు రెడ్డి  స్పందించిన కొన్ని గంటలకు జ్యోతి కూడా స్పందించారు. అసలు, డ్రగ్స్ కేసు ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే... 


తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కేసు సంచలనాలకు, కలకలానికి కారణమైంది. జూన్ 13న ఓ ఛోటా నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి (KP Chowdary)ని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కొంత మంది నటీనటులు, సినిమా ప్రముఖుల పేర్లు ఆయన చెప్పినట్లు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.   


తెలుగు చిత్రసీమలో కొంత మంది నటీమణులతో కేపీ చౌదరి వందల ఫోన్ కాల్స్ మాట్లాడినట్లు, అందులో నటి జ్యోతి పేరు కూడా ఉన్నట్లు బయటకు వచ్చింది. మీడియాలో, ముఖ్యంగా న్యూస్ ఛానళ్లలో తన ఫోటోలు రావడంతో జ్యోతి స్పందించారు. 


కేపీ చౌదరి స్నేహితుడు మాత్రమే! - నటి జ్యోతి
డ్రగ్స్ కేసులో తన పేరు ఉందా? లేదా? అనేది నిర్ధారించకుండా... కేపీ చౌదరి అనే వ్యక్తి ఏం చెప్పారో కూడా తెలియకుండా తన ఫోటోలు వేయడం చాలా తప్పు అని నటి జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయితే అప్పుడు చర్యలు తీసుకోమని చెప్పారు. 


కేపీ చౌదరి తనకు స్నేహితుడు మాత్రమేనని జ్యోతి తెలిపారు. ఆయన ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా... వాళ్ళ అబ్బాయిని తమ ఇంట్లో వదిలి వెళతారని, ఆ అబ్బాయి బాగోగులు తాను చూసుకుంటానని ఆమె చెప్పారు. తన కుమారుడితో కేపీ చౌదరి కుమారుడు వీడియో గేమ్స్ ఆడుకుంటారని ఆమె వివరించారు.


Also Read : ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'


కేపీ చౌదరితో తనకు ఉన్నది ఫ్యామిలీ బాండింగ్ మాత్రమేనని, ఫోనులో తమ మధ్య సంభాషణ కుటుంబ సభ్యుల గురించి మాత్రమే ఉంటుందని జ్యోతి చెబుతున్నారు. 'అమ్మ ఎలా ఉన్నారు?' అని తాను ఎక్కువగా అడుగుతానని చెప్పారు. తన ఫోనులో కాల్ హిస్టరీ డిలీట్ చేయలేదన్నారు. పోలీసు విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని జ్యోతి చెప్పారు. ఒకవేళ తాను డిలీట్ చేసినట్లు అనిపిస్తే రికవరీ చేసుకోవచ్చని చెప్పారు.   


అబ్బాయిల ఫోటోలు, పేర్లు ఎందుకు రావడం లేదు?
కేపీ చౌదరి ఫోనులో వందల మంది పేర్లు బయటకు వచ్చాయని చెబుతున్నారని... అయితే అమ్మాయిల ఫోటోలు, పేర్లు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? అబ్బాయిల పేర్లు ఎందుకు రావడం లేదని జ్యోతి ప్రశ్నించారు. అమ్మాయిలను ఈజీగా టార్గెట్ చేస్తున్నారా? అని మండిపడ్డారు. సోషల్ డ్రింకింగ్ తప్ప, తాను ఆల్కహాల్ కూడా తాగనని, అవసరం అయితే నార్కోటిక్ టెస్టుకు రెడీగా ఉన్నానని జ్యోతి చెప్పారు. 24 / 7 అందుబాటులో ఉంటానని, తాను దాక్కోలేదని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని జ్యోతి చెప్పారు. తాను సింగిల్ పేరెంట్ అని, ఇలా తన ఫోటోలు వేయడం వల్ల తన కుమారుడు చాలా ఇబ్బంది పడుతున్నారని జ్యోతి చెప్పారు. 


Also Read : కంగనా ‘ఎమర్జెన్సీ’టీజర్‌ లో పెద్ద మిస్టేక్... ఇందిరా గాంధీ నిజంగా ఆ మాట అన్నారా? 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial