తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు అందరికీ 'దిల్' రాజు (Dil Raju) ఆప్తులు. ఈతరం అగ్ర కథానాయకులు అందరితోనూ ఆయన సినిమాలు నిర్మించారు. మరి, 'దిల్' రాజుకు ఇష్టమైన కథానాయకుడు ఎవరో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). ఈ మాట 'దిల్' రాజు భార్య వ్యాఘా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 


పంపిణీదారుడు (Movie Distributor)గా చిత్రసీమలో ప్రయాణం ప్రారంభించిన 'దిల్' రాజుకు... అభిమాన హీరోతో సినిమా నిర్మించడానికి కొన్నేళ్ళు పట్టింది. రాజకీయాల్లోకి వెళ్లిన పవన్, చిన్న విరామం తర్వాత చేసిన 'వకీల్ సాబ్'ను ఆయన నిర్మించారు. అయితే... అంతకు ముందు పవన్ హీరోగా నటించిన సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులో 'తొలిప్రేమ' అంటే 'దిల్' రాజుకు చాలా ఇష్టం. ఎందుకు అనేది ఆయన మాటల్లో...  


'తొలిప్రేమ' తనకు ఒక గొప్ప జ్ఞాపకం అని 'దిల్' రాజు చెప్పారు. పంపిణీదారుడిగా చిత్రసీమలో ఆయనకు బలమైన పునాది వేసిన చిత్రమిది. పాతికేళ్ల క్రితం ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా జూన్ 30న రీ రిలీజ్ చేస్తున్నారు. శనివారం సినిమా రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ వేడుకలో సినిమా తనకు ఎంత మేలు చేసిందీ 'దిల్' రాజు వివరించారు. 


ఒక్క సిట్టింగులో కొనేశా... - 'దిల్' రాజు
''తొలిప్రేమ'లో భాగమైన హీరో పవన్ కళ్యాణ్ గారికి, దర్శకుడు కరుణాకరన్ గారికి, నిర్మాత జీవీజీ రాజు గారికి అందరికీ ఈ సినిమా ఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా సినీ ప్రయాణంలో ఈ చిత్రానికి ఒక ప్రత్యేక పేజీ ఉంటుంది. పంపిణీదారుడిగా తెలుగు చిత్రసీమలో అప్పుడప్పుడే నా ప్రయాణం మొదలైంది. రవీందర్ రెడ్డి అని ఓ ఫైనాన్సియర్ ఉన్నారు. ఓసారి నాతో మాట్లాడుతూ 'జీవీజీ రాజు గారి నిర్మాణంలో కొత్త దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నారు' అని చెప్పారు. అప్పటికి నాకు తెలిసిన సమాచారం అంతే! నేను కొన్ని లెక్కలేసుకొని 'తొలిప్రేమ' ముహూర్త కార్యక్రమాలకు వెళ్ళాను. అప్పటికి నా గురించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఒక్క 'పెళ్లి పందిరి' సినిమా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశా.  జీవీజీ రాజు గారిని కలిసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఇవ్వమని నేరుగా అడిగా. పూజా కార్యక్రమాలు అయిపోయాక ఒకసారి కలవమన్నారు. ఆఫీసుకు వెళ్లి కలిశాను. ఒక్క సిట్టింగులోనే సినిమా కొనేశా. అప్పటి నుంచి ఈ సినిమాతో నా ప్రయాణం మొదలైంది. నేను నిర్మాతగా ఎన్ని అద్భుతమైన సినిమాలు తీసినా... నా మనసులో ఎప్పటికీ 'తొలిప్రేమ'కి ప్రత్యేక స్థానం ఉంటుంది'' అని చెప్పారు.


Also Read : 'తొలిప్రేమ' వసూళ్ళలో కొంత జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా...


డబ్బులు అవసరమైన ప్రతిసారీ రీ రిలీజ్ చేశా - 'దిల్' రాజు
'దిల్' రాజు మనసులో ఈ సినిమా ప్రత్యేక స్థానం ఎందుకు సంపాదించుకుందో ఆయనే వివరించారు. ''తొలిప్రేమ' వంద రోజుల వేడుక జరిగిన రోజు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉంది. అయినా సరే కంట్రోల్ చేయలేనంతగా అభిమానులు, ప్రేక్షకులు వచ్చారు. అది ఒక చరిత్ర. అటువంటి ఫంక్షన్ నేను మళ్ళీ చూడలేదు. ఎన్నో చరిత్రలు సృష్టించిన సినిమా తొలిప్రేమ. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఐదేళ్లకు ఇచ్చేవాళ్ళు. నా దగ్గర డబ్బులు ఎప్పుడు తక్కువ ఉన్నా... 'తొలిప్రేమ' రీ రిలీజ్ చేసేవాణ్ణి. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే... ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం కోసం మళ్ళీ 'తొలిప్రేమ'ను రీ రిలీజ్ చేసేవాణ్ణి. మూడుసార్లు రిలీజ్ చేశాం. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే... నాకు అడుగులు నేర్పించిన సినిమా 'తొలిప్రేమ'. రీ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే... మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ మరోసారి థియేటర్లకు మంచి అనుభూతి పొందండి. ఈ సినిమా విడుదల చేస్తున్న రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డికి ఆల్ ది బెస్ట్" అని అన్నారు. అదీ సంగతి!


Also Read నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial