పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన 'తొలిప్రేమ' సినిమా ఆయన కెరీర్ (Pawan Kalyan)లోనే కాదు, తెలుగు చిత్రసీమలో వచ్చిన గొప్ప ప్రేమకథా చిత్రాల్లో ఒకటి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదొక క్లాసిక్ హిట్. 'తొలిప్రేమ'లో పవన్ సరసన కీర్తి రెడ్డి కథానాయికగా నటించగా... ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.ఎస్.సి. ఆర్ట్స్ పతాకంపై జి.వి.జి. రాజు నిర్మించారు.


'తొలిప్రేమ' విడుదలై ఈ ఏడాదితో 25 వసంతాలు. జూలై 24, 1998లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా జూన్ 30న 300లకు పైగా థియేటర్లలో శ్రీ మాతా క్రియేషన్స్ సంస్థ 4కెలో విడుదల చేస్తోంది. శనివారం 'తొలిప్రేమ' రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆ వేడుకలో ఈ సినిమాకు వచ్చే వసూళ్ళను జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.  


జనసేన రైతు భరోసా యాత్రకు విరాళంగా 'తొలిప్రేమ' కలెక్షన్లు
'తొలిప్రేమ' రీ రిలీజ్ వేడుకలో శ్రీ మాతా క్రియేషన్స్ నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి మాట్లాడుతూ "మేం పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా సినిమాను రీ రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన 'తొలి ప్రేమ' నిర్మాత జి.వి.జి. రాజు గారికి థాంక్స్. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొత్త మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తలపెట్టిన రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం'' అని చెప్పారు. 


పవన్ కళ్యాణ్ వల్లే అంత పెద్ద విజయం
'తొలిప్రేమ' దర్శకుడు కరుణాకరన్ మాట్లాడుతూ "నా కథ అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో పడటం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. అన్నయ్యతో పాటు నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత జి.వి.జి. రాజు గారికి థాంక్స్. ఈ సినిమా చేయడం నా అదృష్టం. 'తొలిప్రేమ' నా జీవితాన్నే మార్చేసింది. 'నా అమ్మానాన్న... పవన్ కళ్యాణ్' అని నేను ఎక్కడికి వెళ్ళినా చెబుతుంటాను. ఎప్పటికీ అన్నయ్యకు కృతజ్ఞుడిగా ఉంటాను'' అని చెప్పారు. 


నిజ జీవితంలో ప్రేమలకు కారణమైన 'తొలిప్రేమ'
నిర్మాత జీవీజీ రాజు మాట్లాడుతూ ''పంపిణీదారుడిగా 'దిల్' రాజు 'తొలిప్రేమ'తో తొలి అడుగులు వేసి, ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఈ సినిమా సమయంలో ఆనంద్ సాయి, వాసుకి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్వెల్ సీన్ కొడైకెనాల్ లో తీశాం. మేల్ డూప్, ఫిమేల్ డూప్ గాయాలు పాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించాం. వారూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఈ 'తొలిప్రేమ' నిజ జీవితంలో ఎన్నో ప్రేమ కథలకు కారణం అయ్యింది'' అని చెప్పారు.


Also Read  నాలుగు వందల కోట్లతో పవన్ కళ్యాణ్ సినిమా - ఒక్కొక్కరూ చెప్పేది వింటుంటే?  


''తొలిప్రేమ'తోనే నా ప్రయాణం మొదలైంది. అప్పటికి నాకు ఆర్ట్ డైరెక్షన్ గురించి పెద్దగా తెలియదు. కానీ, 'నువ్వు చేయగలవు' అని కళ్యాణ్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, అవకాశం వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. కళ్యాణ్ లేకపోతే నేను, కరుణాకరన్ గారు ఇలా ఉండేవాళ్ళం కాదు. నిజం చెప్పాలంటే... ముందు వేరే కళా దర్శకుడిని అనుకున్నారు. తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చి కరుణాకరన్, జి.వి.జి. రాజు గారు ఎంతో ప్రోత్సహించారు. కొత్త ఆర్ట్ డైరెక్టర్ వచ్చి తాజ్ మహల్ సెట్ వేయడం అంత తేలిక కాదు. నేను చేయగలనని నమ్మి అవకాశం ఇచ్చారు. 'తొలిప్రేమ' వల్లే నా జీవితం బావుంది. వాసుకి నా జీవితంలోకి వచ్చింది'' అని ఆనంద్ సాయి చెప్పారు. 


'తొలిప్రేమ'లో ఎంత ఎనర్జీ ఉందో... 'బ్రో'లోనూ అంతే!
"తొలిప్రేమ' విడుదలైనప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. రీ రిలీజుకు ఇక్కడ ఉండటం సంతోషంగా ఉంది'' అని నటి వాసుకి చెప్పారు. "పాతికేళ్ల క్రితం వచ్చిన 'తొలిప్రేమ' ట్రైలర్ చూస్తుంటే... అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో, ఇప్పుడు మేం నిర్మిస్తున్న 'బ్రో'లో కూడా అలాగే ఉన్నారు'' అని ప్రముఖ నిర్మాత వివేక్ కూచిభొట్ల తెలిపారు.


Also Read డ్రగ్స్ కేసుతో సంబంధం లేదంటున్న అషు రెడ్డి - ఫోన్ నంబర్ బయట పెట్టొద్దని వార్నింగ్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial